సహకార బ్యాంకులకు ‘రెవెన్యూ’ మోసం

ABN , First Publish Date - 2021-04-22T10:34:01+05:30 IST

నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు సృష్టించి సహకార బ్యాంకులను కొల్లగొట్టడానికి రెవెన్యూ అధికారులు సహకరించినట్లు జిల్లా కలెక్టర్ల నుంచి అందిన నివేదికలపై ఏపీ లోకాయుక్త విస్మయం వ్యక్తం చేసింది.

సహకార బ్యాంకులకు ‘రెవెన్యూ’ మోసం

  • అనర్హులతో చేతులు కలిపిన అధికారులు
  • నకిలీ పట్టాదారు పుస్తకాలతో రూ.కోట్లకు టోకరా
  • కలెక్టర్ల నివేదికల్లో  విస్తుపోయే వాస్తవాలు
  • క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్న ఏపీ లోకాయుక్త
  • సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎ్‌సకు ఆదేశం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలు సృష్టించి సహకార బ్యాంకులను కొల్లగొట్టడానికి రెవెన్యూ అధికారులు సహకరించినట్లు జిల్లా కలెక్టర్ల నుంచి అందిన నివేదికలపై ఏపీ లోకాయుక్త విస్మయం వ్యక్తం చేసింది.  సహకార బ్యాంకుల నుంచి నకిలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందిన వారి వివరాలతో కూడిన నివేదికను తమ ముందుంచాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి. లక్ష్మణరెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. సహాకార బ్యాంకుల్లో నిధుల గోల్‌మాల్‌పై గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలోని జీడీసీసీ బ్యాంకు మాజీ అసిస్టెంట్‌ మేనేజర్‌ బి. విఘ్నేశ్వరరావు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త.. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో కొందరు రెవెన్యూ అధికారులు అనర్హులతో చేతులు కలిపి నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రుణాలు పొందినట్లు గుంటూరు కలెక్టర్‌ నివేదికలో వివరించారు.


ఇలా 30 మంది రుణాలు పొందారని, వీరికి 10 మంది రెవెన్యూ అధికారులు సహకరించారని తెలిపారు. వీరిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, తొండంగి మండలంలో 61 మంది రైతులు నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలతో రూ.22.07 కోట్లు మేర రుణాలు పొందినట్లు లోకాయక్తకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలు పరిశీలించిన లోకాయుక్త నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన రైతులతోపాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది.   నకీలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందినట్లు మిగిలిన జిల్లాల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి,  సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఆదేశించింది. 

Updated Date - 2021-04-22T10:34:01+05:30 IST