లంచాలు మెక్కి..కుక్కల్లా నిద్రపోతున్నారు: హోం మంత్రి ఫైర్

ABN , First Publish Date - 2021-12-05T01:43:33+05:30 IST

గోవధపై రాష్ట్రంలో పూర్తి నిషేధం అమల్లో ఉన్నా, పశువుల దొంగతానాలు, స్మగ్లింగ్ నిరాఘాటకంగా సాగిపోతుండటంపై ..

లంచాలు మెక్కి..కుక్కల్లా నిద్రపోతున్నారు: హోం మంత్రి ఫైర్

బెంగళూరు: గోవధపై రాష్ట్రంలో పూర్తి నిషేధం అమల్లో ఉన్నా, పశువుల దొంగతానాలు, స్మగ్లింగ్ నిరాఘాటకంగా సాగిపోతుండటంపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఒక పోలీస్ అధికారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? పశువుల స్మగ్లర్ల నుంచి కొంతమంది పోలీసులు లంచాలు తీసుకుని, 'కుక్కల్లా నిద్రపోతున్నారు' అంటూ ఫోనులో ఆ అధికారిపై  కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకడు ఇప్పుడు వైరల్ అవుతోంది.


''పశువులను ట్రాన్స్‌ఫోర్ట్ చేస్తున్న వాళ్లు దానికి పూర్తిగా అలవాటు పడిన నేరగాళ్లు. మీ అధికారులకు ఆ విషయం తెలుసు, కానీ లంచాలు తీసుకుని కుక్కల్లా నిద్రపోతున్నారు. మీ పోలీసులు ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతవరకూ నేను ఏమీ మాట్లాడలేదు. కానీ నేను హోం మంత్రిగా కొనసాగాలా? వద్దా?'' అని సదరు పోలీసు అధికారిని జ్ఞానేంద్ర ప్రశ్నించారు. చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో పశువుల స్మగ్లింగ్ నడుస్తుండటంపై ఆయన నిలదీస్తూ...''ఇవాళ మీ పోలీస్ ఫోర్స్ మొత్తం తుప్పుపట్టిపోయింది. మేము జీతాలు ఇస్తున్నాం. అయితే ఏ ఒక్కరూ కూడా ఆ జీతంతో బతకాలనుకోవడం లేదు. లంచాలతో పొద్దు పుచ్చాలనుకుంటున్నారు'' అని మంత్రి ఆ వీడియోలో బిగ్గరగా ప్రశ్నిస్తున్నట్టు ఉంది.


మంత్రి వివరణ..

వీడియోలో పోలీసు అధికారిని మందలించడంపై మంత్రి వివరణ ఇస్తూ, పోలీసు అధికారులంతా అలా ఉంటారని కాదు, వారిలో కొందరు లంచాలు మరుగుతున్నారని అన్నారు. తన సొంత గ్రామమైన శివమొగ్గ జిల్లా తీర్ధల్లి తాలూకాలో కూడా పశువుల స్మగ్లర్లు తమను అడ్డుకున్నందుకు ఇద్దరు యానిమల్ రైట్స్ కార్యకర్తలపై వాహనం తోలుకుంటూ వెళ్లారని, ఆ ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసేందుకు తాను ఏర్పాట్లు చేశానని తెలిపారు. గోవధ నిషేధం చట్టాన్ని రాష్ట్రంలో తీసుకువచ్చినప్పటికీ పశువుల స్మగర్ల విషయంలో కొందరు పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, వారితో చేతులు కలిపుతున్నారని, అలాంటి వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-12-05T01:43:33+05:30 IST