కరోనా.. 1053

ABN , First Publish Date - 2020-07-06T10:17:24+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి బాగా పెరిగిపోతోంది. ఆదివారం ఒక్కరోజే 189 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా.. 1053

ఒక్కరోజులో 189 పాజిటివ్‌ కేసులు

ఆందోళన చెందుతున్న జిల్లావాసులు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఉధృతి బాగా పెరిగిపోతోంది. ఆదివారం ఒక్కరోజే 189 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకూ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1053కి చేరింది. గడచిన వారం రోజుల్లో ఏకంగా 411 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కరోనా ఉధృతికి అద్దం పడుతోంది. క్వారంటైన్‌ కేంద్రాలతో పాటు కమ్యూనిటీలోనూ కేసుల సంఖ్య పెరగడం.. జిల్లావాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైపోయింది. జిల్లా అంతటా కరోనా అనుమానిత లక్షణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందులో పాజిటివ్‌ల సంఖ్య కూడా భారీగానే నిర్ధారణ అవుతోంది. ఇప్పటికే ఆరుగురు కరోనా లక్షణాలతో మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో జిల్లావాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 


 నిబంధనలు బేఖాతరు.

కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తూ కరోనా ముప్పును ఏరికోరి తెచ్చుకుంటున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, దాబాలు, మాంసం, చేపల దుకాణాల వద్ద జనం గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్క్‌లు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకపోవడంతో ‘కొవిడ్‌’ను ఆహ్వానించినట్ల అవుతోంది. అధికారులు హెచ్చరిస్తున్నా.. నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో కూడా భౌతిక దూరం పాటించకుండా.. ప్రయాణాలు సాగిస్తున్నారు. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అంతా స్వీయనియంత్రణ పాటించాల్సి ఉంది. అలా అయితేనే కరోనా ముప్పు నుంచి సిక్కోలు కోలుకునే అవకాశం ఉంది. 


వారం రోజుల్లో 411 పాజిటివ్‌ కేసులు

గత నెల 29న - 01

30న - 57

ఈ నెల 1న  - 35

 2న - 0

3న - 53

4న - 76

5న - 189

మొత్తం - 411

Updated Date - 2020-07-06T10:17:24+05:30 IST