మహానగరంలో కరోనా రెండో వేవ్‌ బీభత్సం..

ABN , First Publish Date - 2021-04-20T07:40:53+05:30 IST

మహానగరం బిక్కుబిక్కుమంటోంది.. నలుమూలల నుంచి కరోనా చేస్తున్న దాడులతో....

మహానగరంలో కరోనా రెండో వేవ్‌ బీభత్సం..

  • మహమ్మారి విశ్వరూపం.. 
  • విలవిలలాడుతున్న నగరం
  • కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు
  • అరకొరగానే అధికారుల సన్నద్ధత


మహానగరం బిక్కుబిక్కుమంటోంది.. నలుమూలల నుంచి కరోనా చేస్తున్న దాడులతో నగరమంతా భయానక వాతావరణం ఏర్పడింది. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌, ఆస్పత్రిలో అడ్మిషన్‌, ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్‌... ప్రతిదాని కోసం పరుగులు పెట్టీ పెట్టీ జనం సొమ్మ సిల్లి పోతున్నారు. గత సంవత్సరం కరోనాని చూసిన అనుభవంతో నిన్న మొన్నటి దాకా కొంచెం ధైర్యంగా ఉన్నవారు కూడా ఈ సారి వైరస్‌ తీవ్రత, విధ్వంసం ధాటికి విలవిల లాడుతున్నారు. భయం, దాని వెంట నిరాశ తరుముకొస్తూ నగర దైనందిన జీవితం నుంచి కళాకాంతులను హరించి వేస్తున్నాయి..


హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనే చందంగా మారింది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీల)  అధికారుల పరిస్థితి. ఓ పక్క సిబ్బంది కొరత, మరో పక్క ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సిఫార్సులతో కొవిడ్‌-19 పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక్కో యూపీహెచ్‌సీలో నిత్యం 75 మందికి టోకెన్‌ పద్ధతిలో కొవిడ్‌ పరీక్షలను చేయాల్సి ఉంది. వైరస్‌ తీవ్రత దృష్ట్యా కొన్ని యూపీహెచ్‌సీల్లో సుమారు 120 మందికి తగ్గకుండా పరీక్షలు చేస్తున్నారు. కొందరి సిఫార్సులతో వాటి సంఖ్య మరింత పెరిగి 150 మంది నుంచి 200 మంది వరకు, కొన్ని సందర్భాల్లో 200 పైచిలుకు ఉంటోంది. ఆ స్థాయిలో పరీక్షలు చేస్తున్నా సామాన్యులకు సకాలంలో పరీక్షలు చేయలేకపోవడంతో విమర్శల పాలవుతున్నారు.


అప్పటికప్పుడు చేయాల్సిందే...

ఉచితంగా చేస్తున్న కొవిడ్‌-19 పరీక్షలు, వ్యాక్సినేషన్‌ కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న ప్రముఖుల సిఫార్సులు పెరిగిపోయాయి. అనుచరగణం, వారి కుటుంబ సభ్యులకు, ఇతరాత్ర సిబ్బందితో పాటు శ్రేయోభిలాషులకు వైరస్‌ లక్షణాలు ఉన్నా లేకున్నా, టోకెన్‌ పొందకున్నా, రద్దీగా ఉన్నా అప్పటికప్పుడు పరీక్ష చేయాల్సిందే అని లీడర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పరీక్ష కోసం సిఫార్సుతో వచ్చే వారు ‘నన్ను ఫలానా వ్యక్తి పంపించారు. మీరు నాకే లేట్‌ చేస్తారా, అన్నకు ఫోన్‌ చేయమంటారా’ అంటూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సిఫార్సులతో వచ్చిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తుంటే టోకెన్లు తీసుకుని ఎప్పటి నుంచో క్యూలో నిలబడ్డవారు అసహనంతో వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి గురవుతున్నారు. 


సిబ్బంది కొరత...ఉన్న వారికి కరోనా...

కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని యూపీహెచ్‌సీతో పాటు కుత్బుల్లాపూర్‌లోని పలు యూపీహెచ్‌సీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. చాలీచాలని సిబ్బందితోనే అటు పరీక్షలు, ఇటు వ్యాక్సినేషన్‌, మరోవైపు సాధారణ రోగులకు వైద్య పరీక్షలతో పాటు మందుల పంపిణీ చేస్తూ నెట్టుకొస్తున్నారు. గర్భిణుల చికిత్సలో కూడా ఎటువంటి లోపం రాకుండా సేవలు అందిస్తున్నారు. మూలిగే నక్కపై తాడి పండు పడిందనే చందంగా అసలే సిబ్బంది కొరతతో నానా అవస్థలు పడుతుంటే, ఉన్న వారిలో కూడా పలువురికి కరోనా సోకడంతో విధుల నిర్వహణ మరింత కష్టంగా మారింది. వ్యాక్సిన్‌పై మొదట్లో వచ్చిన వదంతులకు భయపడి వెనుకాడిన జనం ప్రస్తుతం కొవిడ్‌-19 విజృంభన నేపథ్యంలో బారులు తీరుతున్నారు.


కూకట్‌పల్లి : కూకట్‌పల్లి జోన్‌ మూసాపేట సర్కిల్‌ పరిధిలో ఎంటమాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కరోనాతో సోమవారం ఉదయం మృతి చెందాడు. సికింద్రాబాద్‌ ప్రాంతంలోని పార్శిగుట్టకు చెందిన డి.శ్యామ్‌ (54) 20 ఏళ్ల క్రితం కూకట్‌పల్లి వచ్చి ఎల్లమ్మబండ మహంకాళినగర్‌లో నివాసముంటున్నాడు. 11 ఏళ్లుగా కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలో ఎంటమాలజీ విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగా పనిచేస్తున్నారు. కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ డివిజన్లలో విధులు నిర్వహిస్తున్నాడు.


జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 రోజుల క్రితం కేపీహెచ్‌బీకాలనీ మూడోఫేజ్‌లోని బస్తీ దవాఖానాకు తోటి సిబ్బందితో కలిసి వెళ్లాడు. శ్యామ్‌కు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయడంతో పాజిటివ్‌ వచ్చింది. వైద్యులు మందులు ఇచ్చి హోం క్వారంటైన్‌లో ఉండమని సూచించారు. మూడు రోజుల నుంచి శ్యామ్‌కు విరేచనాలు, వాంతులు, నీరసం రావడంతో ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శ్యామ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శ్యామ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.


మరొకరు మృతి

ఓల్డు బోయినపల్లి : ఓల్డుబోయినపల్లి డివిజన్‌ హరిజనబస్తీకి చెందిన ఓ వ్యక్తి(45) కరోనాతో మృతి చెందాడు. పది రోజుల క్రితం అంజయ్యనగర్‌ బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకున్న అతడికి పాజిటివ్‌గా తేలింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడాడు. ఆదివారం శ్వాసకు సంబంధించిన  సమస్యలు తలెత్తడంతో 108 సహాయంతో గాంధీకి తరలించారు. చికిత్స పొందుతున్న అతడు సోమవారం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


మా దుస్థితి ఎవరికీ రావొద్దు

రాజేంద్రనగర్‌ : ‘‘నాకు ఎదురైన పరిస్థితులు ఈ ప్రపంచంలో ఎవరికీ రాకూడదు. ఎవరూ దగ్గరకు రాని పరిస్థితి’’ అని కొవిడ్‌ కారణంగా తండ్రిని కోల్పోయిన ఓ కుమారుడి ఆవేదన. ‘‘చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి 50 సంవత్సరాలు నిండిన వారు అనవసరంగా బయటకు రావద్దు. నా కన్నా బలంగా ఉండే  మా నాన్న కొవిడ్‌తో బాధపడుతుంటే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లా. నాన్నను పరీక్షించడానికి కనీసం వైద్య సిబ్బంది రాలేదు. నగరంలో పెద్దాసుపత్రిగా చెప్పుకునే అక్కడకు ఎవరూ వెళ్లొద్దు. తండ్రి మరణిస్తే ఓదార్చేవారు, ధైర్యం చెప్పేవారు లేరు’’ అంటూ వాపోతున్నాడు.


కుమారుడు  లేకుండానే సమాధి కార్యక్రమాలు 

‘‘అమ్మకు నాన్న మరణించిన విషయం తెలియదు. అమ్మను చూసుకుంటూ ఆస్పత్రిలోనే ఉన్న తమ్ముడు నాన్న చనిపోతే అంత్యక్రియలకు రాలేని పరిస్థితులు. ఇలాంటి దుస్థితి ఎవరికీ వద్దు’’ మరో కొడుకు ఆవేదన ఇది. చివరకు నాన్న  తోబుట్టువులు కూడా సమాధి కార్యక్రమానికి రాలేదని వాపోతున్నాడు. ఇలా కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలలో ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకుండా జాగ్రత్తలు పాటించాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రజలకు సూచిస్తున్నారు.


కనిపించని పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది...

సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్నా చర్యలు శూన్యంగా కన్పిస్తున్నాయి. యూపీహెచ్‌సీ కేంద్రాల వద్దకు కరోనా సోకిన వారు, లక్షణాలు ఉన్నవారితో పాటు ప్రతి ఒక్కరూ గుంపులుగుంపులుగా వచ్చి గందరగోళం సృష్టిస్తున్నా ఒక్క పోలీసు కానిస్టేబుల్‌ కూడా కేంద్రాల వద్ద లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గొడవ జరిగినప్పుడో, లేక జనం ఎక్కువగా వచ్చినప్పుడో, వైద్యులు అడిగితేనో పోలీసు సిబ్బందిని పంపిస్తున్నారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఎన్నో సమస్యల మధ్య విధుల నిర్వహణ కత్తిమీద సాములా మారిందని పలువురు వైద్యులు, సిబ్బంది వాపోతున్నారు.


షాపూర్‌నగర్‌ యూపీహెచ్‌సీలో చిత్తశుద్ధి కరువు

వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు చేసేలా యూపీహెచ్‌సీల సిబ్బంది ప్రయత్నం చేస్తుంటే షాపూర్‌నగర్‌లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. శామీర్‌పేట్‌లో ఉన్న ఔషధ నిల్వల కేంద్రం నుంచి కొవిడ్‌-19 పరీక్ష కిట్లు తేవడానికి వ్యక్తిని పురమాయించడంలో నిర్లక్ష్యం కారణంగా సోమవారం పరీక్షలు నిలిచిపోవడం విడ్డూరం. పరీక్షలు చేయకపోవడంతో అనుమానితులు తీవ్ర ఇబ్బందులు పడి దూర ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రోజూ ఉదయం శామీర్‌పేట్‌లోని స్టోర్‌ నుంచి వారికి అవసరమైన కిట్లను సిబ్బందిని పంపించి తెచ్చుకోవల్సి ఉంటుంది. ఒక్కోసారి నిల్వలను బట్టి వారం, పది రోజులకు సరిపడా కిట్లను ఒకేసారి తెచ్చుకుంటారు. ఆదివారమే కిట్లు అయిపోయినా సోమవారం కిట్లను తెప్పించుకోలేదు. కిట్లు లేవని సోమవారం పరీక్షలు చేయలేదు.


వ్యాక్సిన్‌ కొరత.. ప్రజల వెత

అల్వాల్‌ : కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ (టీకా) ఒక్కటే పరిష్కారమని అటు అధికారులు, ఇటు వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు టీకా కోసం కేంద్రాలకు పోటెత్తుతున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వల్ప ఫీజు తీసుకుని టీకా ఇస్తున్నారు. ఒకే సారి అధిక సంఖ్యలో జనం వస్తుండడంతో టీకా కొరత ఏర్పడుతోంది. వ్యాక్సిన్‌ లభించక చాలా మంది వెనుదిరుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదుతో పాటు, డైరెక్టుగా వచ్చేవారికి కూడా టీకా ఇచ్చే ఏర్పాట్లు ఉండటంతో ఆయా సెంటర్లకు ప్రజలు ఉదయం 7 గంటల నుంచే వస్తున్నారు. 


అల్వాల్‌లో మూడు సెంటర్లలో

అల్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని నవ కళాకేంద్రంలో ఉచితంగా టీకా వేస్తుండగా, రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు తీసుకుని టీకా వేస్తున్నారు. కొరతతో అందరికీ టీకా వేయలేక పోతున్నారు. 


సరఫరా తక్కువ

అల్వాల్‌ పీహెచ్‌సీలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారితో పాటు నేరుగా వచ్చిన 200 మందికి టోకెన్‌లను జారీ చేస్తున్నారు. వారందరికీ ఇచ్చాక సమయం ఉంటే మరో వంద మందికి కూడా టీకా ఇస్తున్నారు. కానీ, రోజూ 500 నుంచి 600 మంది వరకు 45 ఏళ్లు దాటినవారు టీకా కోసం నిరీక్షిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో వైద్యులు అందరికీ ఇవ్వలేకపోతున్నారు. దీనిపై కొన్నిసార్లు ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పంపిణీని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


1000  డోస్‌ల వచ్చాయి

అల్వాల్‌ పీహెచ్‌సీకి సోమవారం 1000 డోస్‌లు వచ్చాయి. 600 మందికి ఇచ్చాం. 400 డోస్‌లను మంగళవారం కోసం స్టోర్‌ చేశాం. వ్యాక్సిన్‌ పట్ల అవగాహన పెరగడంతో జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ టీకా అందే విధంగా కృషి చేస్తున్నాం. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందించడమే మా ధ్యేయం. - వీరయ్య, ఫార్మసిస్ట్‌, అల్వాల్‌ పీహెచ్‌సీ.

Updated Date - 2021-04-20T07:40:53+05:30 IST