ఎందుకింత ఉదాసీనత!!

ABN , First Publish Date - 2021-04-21T04:57:55+05:30 IST

గత ఏడాది మార్చిలో కేవలం మూడు పాజిటివ్‌లు మాత్రమే నమోదు అయ్యాయి.

ఎందుకింత ఉదాసీనత!!
కరోనా బాధితుడి మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తూ..

తొలి విడతకన్నా రెండో విడత వందరెట్ల వేగంతో కరోనా విజృంభణ

మంగళవారం ఒక్కరోజే 1347 పాజిటివ్‌లు, 8 మంది మృతి

కట్టడిలో చేతులెత్తేసిన యంత్రాంగం

సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు

ఆరోగ్యశ్రీ కింద బెడ్లు దొరకని దైన్యం

రోజుకు రూ.30వేలు కడితే అన్నీ..

బ్లాక్‌ మార్కెట్లో ‘రెమ్‌డెసివిర్‌’

రూ.900 ఇంజక్షన్‌ బ్లాక్‌లో రూ.30వేలు. 

జీజీహెచ్‌నూ గాలికి వదిలేశారు!

రికమండేషన్‌ ఉంటేనే బెడ్‌!

హోం క్వారంటైన్‌ బాధితులకు కరువైన వైద్య సలహాలు


కరోనా మహమ్మారి జిల్లాను కబళించేస్తోంది. తొలి విడత కన్నా వంద రెట్ల వేగంతో నగరం, పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా చుట్టేస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మంగళవారం ఒక్కరోజే 1347 పాజిటివ్‌లు నమోదయ్యాయి. బాధితుల్లో 8 మంది మృత్యువాతపడ్డారు. తొలి విడతలో ప్రతి వంద మంది బాధితుల్లో ఒక్కరు మరణిస్తే ఇప్పుడు ముగ్గురు మరణిస్తున్నారు. అంటే మరణాల శాతం మూడు రెట్లు పెరిగింది. 


విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో, బాధితులకు చికిత్స అందించడంలో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందకపోవడంతో ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులు కరోనా బాధితులను పిండుకొంటున్నాయి. బెడ్ల కొరత సృష్టించి రూ.లక్షలకు లక్షలు దండుకొంటున్నాయి. కొవిడ్‌ బాధితులకు వాడే సూది మందునూ ‘బ్లాక్‌’ చేసేశారు.  అంతో ఇంతో ఉచితంగా సేవలందించే జీజీహెచ్‌లో పరిస్థితి తీసికట్టుగా తయారవుతోంది. ఇక్కడా రెకమండేషన్‌ లేనిదే బెడ్లు దొరకని పరిస్థితి. హోం క్వారంటైన్‌కు వెళ్లే వారికి వైద్య సలహాలు, సేవలు అందించే దిక్కులేకుండా పోయింది. మొత్తమ్మీద కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం వైపు నుంచి అన్ని కోణాల్లో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 


నెల్లూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : గత ఏడాది మార్చిలో కేవలం మూడు పాజిటివ్‌లు మాత్రమే నమోదు అయ్యాయి. ఏప్రిల్‌ నెలాఖరుకు కేసుల సంఖ్య 160. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నమోదైన కేసుల సంఖ్య 64,344. అయితే, రెండో విడతలో కేసుల వేగం వంద రెట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చిలో 632 కేసులు, ఏప్రిల్‌ 20వ తేదీ నాటికి 4830 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది తొలి విడత కరోనా మొదలైన ఏడు నెలల తరువాత రోజుకు వెయ్యి కేసులు రికార్డుకెక్కితే ఇప్పుడు రెండో విడత రెండో నెలకే రోజుకు వెయ్యికిపైగా కేసులు రికార్డు అవుతున్నాయి. 


రెండున్నర రెట్లు పెరిగిన మరణాలు


రెండో విడతలో మరణాల శాతం గణనీయంగా పెరుగుతోంది. వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 591 మంది బాధితులు మరణించారు. అయితే ఈ ఏడాది మార్చిలో నలుగురు, ఏప్రిల్‌లో ఈ 20 రోజుల కాలంలో 125 మంది మరణించారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఇంకా ఎక్కువ మందే చనిపోయారు. తొలి విడతలో కరోనా బారిన పడిన ప్రతి వంద మందిలో కేవలం ఒక్కరు మాత్రమే మరణించారు. కరోనా సోకినా పక్షం రోజులు పడుకుంటే దానంతట అదే తగ్గిపోతుందిలే అనే ఽధైర్యం గత ఏడాది కనిపించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా బారిన పడిన ప్రతి వంద మందిలో 2.5 మంది చనిపోతున్నారు. ఆరంభంలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కేసులు పెరిగే కొద్ది చికిత్స గగనం అవుతుంది. వైరస్‌ మరింత బలపడుతుంది. ఈ క్రమంలో మరణాల శాతం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. 


ప్రాణాలతో వ్యాపారం


ప్రాణాంతకంగా మారిన కరోనా కొన్ని ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సలు అందించాలి. అయితే, అత్యధిక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆ సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ అంటేనే బెడ్లు లేవనే సమాధానం వస్తోంది. కృతిమ కొరత సృష్టించి బెడ్లు అమ్ముకొంటున్నారనే విమర్శలూ ఉన్నాయి. తెలిసిన డాక్టర్లు, రాజకీయ నాయకుల ద్వారా ఫోన్లు చేయిస్తే తప్ప బెడ్లు దొరకడం లేదు. అది కూడా రోజుకు రూ.30వేలు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మందులు, ఇన్విస్టిగేషన్లకు వేరుగా డబ్బులు చెల్లించాల్సిందే. 



బ్లాక్‌మార్కెట్‌లో రెమ్‌డెసివిర్‌


కరోనా బాధితులు త్వరగా కోలుకోవడం కోసం  రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వేస్తారు. సాధారణంగా ఈ ఇంజక్షన్‌  ధర రూ.800 నుంచి 1000 లోపే. కానీ ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రులు వీటిని బ్లాక్‌ చేశాయి. కొంతమంది ఏజెంట్ల దగ్గర పెట్టి అధిక ధరకు అమ్ముకొంటున్నాయి. రోగి స్తోమతను బట్టి ధరను అమాంతం పెంచుతున్నారు. ‘‘మా ఆసుపత్రిలో స్టాకు లేదు. ప్రభుత్వం సప్లయ్‌ చేయలేదు, మాకు తెలిసిన ఒక వ్యక్తి వద్ద ఉన్నాయి. మీకు ఫోన్‌ నెంబరు ఇస్తాము. మీరే తెచ్చి ఇవ్వండి.’’ అని తెలివిగా చెప్పి వేల రూపాయలు దండుకొంటున్నారు. సోమవారం ఓ ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగి కోసం ఒక్కో ఇంజక్షను రూ. 5వేలు పెట్టి కొనుగోలు చేశారంటే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉందో ఊహించుకోవచ్చు. 


జీజీహెచ్‌లోనూ అంతంత మాత్రమే


ఉచితంగా రోగులకు అంతో ఇంతో సేవలు అందిస్తున్న ఆసుపత్రి జీజీహెచ్‌ మాత్రమే. అయితే ఇక్కడా రోగులను పట్టించుకునే దిక్కులేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. సిఫారసు లేనిదే సామాన్యులకు బెడ్లు దొరికే పరిస్థితి లేదు. మంగళవారం ఒక కరోనా బాధితుడికి బెడ్‌ కోసం నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆసుపత్రి వర్గాలతో పెద్దగా గొడవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోం క్వారంటైన్‌లో ఉంటామనే వారికి ఒక కిట్టు చేతికి ఇచ్చి పంపుతున్నారే తప్ప ఇంటికి పంపే ముందు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వ్యాధి తీవ్రత ఎలా ఉంది? వారిని హోం క్వారంటైన్‌కు పంపవచ్చా!? లేక ఆసుపత్రిలోనే ఉంచుకోవాలా!? తదితర విషయాలను పరీక్షించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఇవన్నీ చేసేందుకు  డాక్టర్లు ఉండటం లేదు. ఇంటికి పోతావా...ఆ పో...! అని ముక్తసరి సమాధానంతో వదిలించుకొంటున్నారు. 


చేతులెత్తేసిన యంత్రాంగం


కరోనా ప్రమాదం ఇంత తీవ్రంగా ఉంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, యంత్రంగం మాత్రం చేతెలెత్తేసింది. తొలి విడత అనుభవంతో మరింత సమర్ధవంతంగా కరోనాను ఎదురోవాల్సిందిపోయి.. గతానికన్నా తీసికట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు కొవిడ్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న దోపిడీని పట్టించుకోవడం లేదు. జీజీహెచ్‌లో మసకబారుతున్న వైద్యసేవల గురించి అసలు పట్టించుకోవడం లేదు. పెరుగుతున్న కరోనా తీవ్రతను అసలు గుర్తిస్తున్నట్లుగా లేదు. మార్చిలో 632 కేసులు ఉండగా ఏప్రిల్‌ 20వ తేదికి 4830 కేసులు నమోదయ్యాయి. అంటే గడచిన 20 రోజుల్లో కేసుల సంఖ్య 8రెట్లు పెరిగింది. ఇదే వేగం కొనసాగితే ఏప్రిల్‌ నెలాఖరుకు కేసుల సంఖ్య 16 రెట్లు పెరిగేలా కనిపిస్తోంది.  గత ఏడాది మొత్తం 64వేల కేసులు నమోదవగా వైరస్‌ వ్యాప్తిలో ఇదే వేగం కొనసాగితే మే నెలకే ఆ రికార్డు బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తికి అవకాశాలు కూడా అలాగే కల్పించారు. ఆ... కరోనాది ఏముందిలే  అంటూ అన్ని రంగాలను విచ్చలవిడిగా వదిలేశారు. ఎన్నికల పేరుతో వేలాది మంది గుమికూడేలా చేశారు. ప్రజలు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం యావత్‌ మరోసారి పూర్తిగా కరోనా కట్టడికి కంకణం కట్టుకోకపోతే పరిస్థితి చేజారిపోతుంది. 


ప్రభుత్వ కార్యాలయాల్లో బారీకేడ్లు

నెల్లూరు (హరనాథపురం) : కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశాలతో జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయంలో ఈ బారికేడ్లు మొదటగా ఏర్పాటయ్యాయి. సిబ్బందితోపాటు అర్జీదారులకు థర్మల్‌ స్కానింగ్‌ చేశాక, అత్యవసరమైతేనే కార్యాలయాల్లో అనుమతి ఇవ్వనున్నారు.  

 



Updated Date - 2021-04-21T04:57:55+05:30 IST