పెరుగుతున్న పేదరికం

ABN , First Publish Date - 2021-04-22T06:37:49+05:30 IST

కొవిడ్‌, లాక్‌డౌన్‌, ఇటీవల

పెరుగుతున్న పేదరికం

కొవిడ్‌, లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌

పాతబస్తీలో 80 శాతం కుటుంబాలు పేదరికంలోకి

 స్వచ్ఛంద సంస్థ సర్వేలో వెల్లడి

మదీన, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌, లాక్‌డౌన్‌, ఇటీవల వచ్చిన వరదలతో పాతబస్తీలో 80 శాతం కుటుంబాలు దారిద్రంలోకి నెట్టివేయబడ్డాయి. కరోనా నేపథ్యంలో జీవనస్థితిగతులు తలకిందులయ్యాయి. పాతబస్తీలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ పాతబస్తీలో నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. సుమారు 20 ప్రాంతాల్లో 7,200 కుటుంబాల్లో 30 మంది వలంటీర్లు సర్వే నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 80 శాతం కుటుంబాలు వేతనాలు, ఉద్యోగాలు, ఆస్తులు కోల్పోయినట్లు వెల్లడైంది. చాలామంది పేదరికంలోకి నెట్టబడ్డారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో 26 శాతం మంది ఒంటరి మహిళలే అని తెలిసింది. వీరిని లాక్‌డౌన్‌ తర్వాత భర్తలు వదిలేశారని సర్వేలో తేలింది. కుటుంబ పోషణ కోసం ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు బడి మానేశారు. చాలా ఫ్యాక్టరీలు మూతపడడంతో వందలాది మంది నైపుణ్యం గల కార్మికులు దినసరి కార్మికులుగా మారారు. బ్లూ కాలర్‌ ఉద్యోగాలు చేసే యువకులు సైతం రోజుకూలీలుగా మారారు. మరికొంతమంది ఏ పనీ దొరక్క ఖాళీగానే ఉంటున్నారు. 70 శాతం మంది వైద్యానికి దూరమయ్యారు. 35 ఏళ్లకు పైబడినవారిలో 70 శాతం మంది హైపర్‌టెన్షన్‌కు గురవుతున్నారని ఆ సర్వే నివేదిక వెల్లడించింది. కొవిడ్‌ పేద కుటుంబాలపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సర్వే వెల్లడించింది. అనేక కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు వారి వద్ద తగిన పత్రాలు కూడా లేవని తేలింది. 


కుటుంబాలను ఆదుకునేందుకు 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న 33 శాతం మంది పిల్లలు చదువులు మానేశారు. వీరు తోపుడు బళ్ల వ్యాపారులు, హోటళ్లలో హెల్పర్లు, మెకానిక్‌ షాపుల్లో పనిచేస్తున్నారని హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ముజ్తబా హసన్‌ అస్కరి ’ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 

లాక్‌డౌన్‌ కారణంగా గార్మెంట్స్‌, జరీ, ఎంబ్రాయిడరీ వర్క్స్‌, మెకానికల్‌ ఫ్యాక్టరీలతోపాటు కమేళాలు మూతపడడంతో బార్కస్‌, షాహీన్‌నగర్‌, సలాల ప్రాంతాలకు చెందిన చాలామంది జీవనోపాధి కోల్పోయారు. చిన్న వ్యాపారాలు మూతపడడంతో 25 శాతం మహిళలు ఆదాయం కోల్పోయారు. వారిప్పుడు కేవలం రూ. 2 వేలు నుంచి రూ. 3 వేల జీతానికి ఇళ్లల్లో పనిచేస్తున్నారు. 


సర్వేలో తేలిన కీలకాంశాలు

- 50 శాతం మంది భర్తలు లేని మహిళలకు 5 ఏళ్లలోపు ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్నారు.

- భర్త వదిలేసిన మహిళ సగటు వయస్సు 30 ఏళ్లు. 

- 30 శాతం మంది వరదల తర్వాత చర్మవ్యాధులతో బాధపడుతున్నారు.

- 40 శాతం మంది పెద్దల్లో రక్తపోటు అధికంగా ఉంది. 20 శాతం గృహిణులు మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు.

- ముగ్గురు పిల్లల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. 

Updated Date - 2021-04-22T06:37:49+05:30 IST