కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. ఏమేం పరీక్షలు తప్పనిసరి!?

ABN , First Publish Date - 2021-04-25T06:04:57+05:30 IST

కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో

కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. ఏమేం పరీక్షలు తప్పనిసరి!?

 కిడ్నీ, కాలేయ పరీక్షలు తప్పనిసరి

- డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు, సీనియర్‌ నెఫ్రాలజిస్టు, నిమ్స్‌. 


కొవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తులు తప్పనిసరిగా కిడ్నీలు, కాలేయం పనితీరు పరీక్షలు చేయించుకోవాలని మూత్రపిండాల వ్యాధి సీనియర్‌ నిపుణులు డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు సూచిస్తున్నారు. రెండో దశ వ్యాప్తిలో డయాలసిస్‌, కిడ్నీ మార్పిడి రోగులు పెద్దగా వైరస్‌కు ఎఫెక్టు కాకపోవడం సంతోషకరమని ఆయన చెబుతున్నారు. కొవిడ్‌ కాలంలోనూ రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ శ్రీభూషణ్‌రాజు ఆంధ్రజ్యోతితో  పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో డయాలసిస్‌, కిడ్నీమార్పిడి పేషెంట్లు పెద్దగా ఎఫెక్టు కాకపోవడం సంతోషకరం. నాకు తెలిసిన సుమారు రెండువేల మంది డయాలసిస్‌ రోగుల్లో 20 మంది మాత్రమే పాజిటివ్‌ అయ్యారు. వాళ్లూ ఇప్పుడు కోలుకున్నారు. అరవై మంది కిడ్నీమార్పిడి పేషెంట్లలో కేవలం ఇద్దరు మాత్రమే కొవిడ్‌కు గురయ్యారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. వీరంతా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనడానికి బహుశా వారిలో అవగాహన పెరగడం, ఒకవిధమైన క్రమశిక్షణకు అలవాటుపడటమే ప్రధాన కారణం కావచ్చు. అదే తొలిదశలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల్లో 25 శాతం మూత్రపిండాల వ్యాధిగ్రస్తులే ఉండటం గమనించాం. ఏడాది కాలంలో నా రెగ్యులర్‌ పేషెంట్లలో మొత్తం ఎనిమిది మంది కొవిడ్‌, నాన్‌కొవిడ్‌తో కన్నుమూశారు. ఈ అంశాలపై నా విశ్లేషణతో ఒక అంతర్జాతీయ హెల్త్‌జర్నల్‌కు ఒక కథనం కూడా రాశాను. అలాగే డయాలసిస్‌ పేషెంట్లతో పాటు కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని ఏడాది దాటిన వ్యక్తులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాం. వారిలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లూ కనిపించలేదు. వారంతా బావున్నారు. పైగా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల కొందరు వైరస్‌కు ఎఫెక్టు అయినా, త్వరగా కోలుకున్నారు. 


నా కూతురు గుర్తుపట్టలేదు

కొవిడ్‌ తొలిదశ సమయంలో నా పేషెంట్లు చాలామంది మందులు దొరక్క ఇబ్బందిపడ్డారు. కిడ్నీమార్పిడి రోగులు ఒక్క రోజుకూడా మందులు మానకూడదు. అలాంటి కష్ట సమయంలో మేం కొందరికి మందులు తెప్పించి ఇచ్చాం. చాలామందికి పోలీసులు సైతం మందులు సమకూర్చడంలో సహాయకారిగా నిలిచారు. నా పేషెంట్లతో వాట్సాప్‌ గ్రూపుల ద్వారా నిరంతరం కాంటాక్టులో ఉంటాను. అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వారెప్పుడు కాల్‌చేసి సలహాలు అడిగినా, ఇస్తుంటాను. వీడియోకాల్స్‌ ద్వారా రోగి పరిస్థితినీ తెలుసుకుంటాను. సాధారణ వ్యక్తులే భయాందోళనలకు గురవుతున్న పరిస్థితుల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్లకు మరింత ధైర్యం చెప్పి, అండగా నిలవడం ఒక డాక్టరుగా నా బాధ్యత.  కొవిడ్‌ సమయంలోనూ డయాలసిస్‌ చేస్తున్నాం. కొవిడ్‌ సోకిన డయాలసిస్‌ రోగులకు కూడా ఎన్నడూ చికిత్సను ఆపలేదు. వాళ్లకు ట్రీట్మెంట్‌ కొనసాగిస్తున్నాం. గతేడాది జూలైలో నాకూ కొవిడ్‌ వచ్చింది. అప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ కూడా తగ్గాయి. హోమ్‌ ఐసోలేషన్‌లోకెళ్లి నా అంతట నేను ట్రీట్మెంట్‌ ఇచ్చుకున్నాను. నెలరోజుల వరకు ఇంటికి దూరంగా క్వారంటైన్‌లో గడిపాను. రోజూ నా గుండెలమీదెక్కి ఆడుకునే రెండేళ్ల నా చిన్నకూతురు మనోజ్ఞ నెల రోజుల తర్వాత నన్ను చూసి గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు కొవిడ్‌ ఉధృతంగా ఉంది కనుక, ఇంట్లోనే వేరే గదిలో ఉంటున్నాను. ఇదివరకు రోజూ కుటుంబమంతా కలిసి భోజనం చేసేవాళ్లం. తీరిక వేళల్లో నా కూతుళ్లతో ఆడుతూ, పాడుతూ గడిపేవాడిని. ఇప్పుడు అవన్నీ లేవు. నా భార్య, పిల్లలతో పాటు 75ఏళ్ల మా అమ్మ ఆరోగ్యం కోసం కొన్ని ఆనందాలను కొంతకాలం వదులుకోక తప్పదు కదా.! 


మూత్రపిండాలు బాగున్నాయా..?

కొవిడ్‌ బాధితుల్లోని కొందరిని పరీక్షించినప్పుడు, వాళ్ల మూత్రపిండాల్లో వైరస్‌ అవశేషాలున్నట్లు పరిశోధనల్లో తేలింది. కనుక కరోనా వైరస్‌ ఊపిరితిత్తులమీదే కాదు మూత్రపిండాలమీదా ప్రభావం చూపుతుంది. అయితే, నావద్దకు వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం కొవిడ్‌ చికిత్సలో భాగంగా వాడిన మందులవల్ల మూత్రపిండాల పనితీరు మందగించడం వంటి సమస్యలను చూశాను. ఇంకొందరు అప్పటికే కిడ్నీసమస్యలున్నా, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేయడం వల్ల మరింత అనారోగ్యానికి లోనయ్యారు. కనుక కొవిడ్‌ తగ్గిన నెలరోజుల తర్వాత తప్పనిసరిగా మూత్రపిండాలు, కాలేయం  పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం తేడాగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. రిపోర్టు నార్మల్‌గా ఉన్నా, మూడు నెలల తర్వాత మళ్లీ ఒకసారి తప్పనిసరిగా పరీక్షలు చేయించాలి. ముఖం, కాళ్ల వాపులు, బీపీ అదుపు తప్పడం వంటి లక్షణాలు కిడ్నీ సమస్యలకు సంకేతం. కనుక వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


ఆరు నెలలు జాగ్రత్త

కొవిడ్‌ నుంచి కోలుకున్న వాళ్లు పూర్తిగా కోలుకోడానికి ఆరునెలలు పడుతుంది. అప్పటి వరకు వాళ్లలో నిస్సత్తువ, బడలిక, గుండెదడ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కనుక పదిహేను రోజుల తర్వాత పరీక్షలో నెగెటివ్‌ వచ్చిందని సంబరపడి ఇష్టానుసారంగా ఉంటామంటే కుదరదు. బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ, వీలైనంత మేర విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే వీలైనంత త్వరగా సాధారణ స్థితిలోకి వస్తారు. అలా అని బద్ధకంగా పడుకోమని కాదు. శరీరానికి మితిమీరిన శ్రమ మాత్రం ఇవ్వద్దు. 

Updated Date - 2021-04-25T06:04:57+05:30 IST