తగ్గని కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-10-22T06:41:25+05:30 IST

ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికి కరోనా తీవ్రత తగ్గలేదు. నిత్యం కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

తగ్గని కరోనా ఉధృతి

పండుగల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించని షాపుల యజమానులు

ఉమ్మడి జిల్లాలో నిత్యం కొత్తగా నమోదవుతున్న కేసులు 

మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యుల అంచనా


నిజామాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికి కరోనా తీవ్రత తగ్గలేదు. నిత్యం కొత్తగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేయడం, బతుకమ్మ, దసరా పండుగలు ఒకేసారి రావడంతో ఆరు నెలల తర్వాత ఎక్కువ సంఖ్యలో గ్రామాలు, పట్టణాల వారు బయటకు వస్తున్నారు. పండుగకు సంబంధించిన షాపింగ్‌తో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. తమ అవసరాల నిమిత్తం భారీ సంఖ్యలో రావడం వల్ల షాపులన్నీ జనంతో రద్దీగా మారుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు హెచ్చరికలు చేసినా భారీగా రావడంతో భౌతిక దూరం పాటించడం లేదు. అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. కేసుల భారిన పడిన వారు ఇప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. రూ. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఫఉమ్మడి జిల్లాలో ఏడు నెలలు గడిచినా తగ్గని తీవ్రతఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకు మాత్రం తీవ్రత తగ్గలేదు. కేసులు ప్రతీ రోజు వస్తున్నాయి.


ఉమ్మడి జిల్లా పరిధిలో నిత్యం పరీక్షలు చేయడం వల్ల కొత్త కేసు లు నమోదవుతున్నాయి. పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో చేస్తున్న టెస్టుల వల్ల ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతీరోజు 100 నుంచి 150 వరకు కేసులు నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నా కేసులు మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 24,350కి పైగా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికీ కరోనా వచ్చిన వారు  ప్రతీరోజు చేరుతునే ఉన్నారు. వీటితో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరి రూ.వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు ఎక్కువగా పాటించకపోవడం వల్ల ఈ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి వల్ల ఇళ్లలోని వారికి కూడా వ్యాప్తి జరుగుతుంది. 


కొనసాగుతున్న పండుగల సందడి

గత 10 రోజుల నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో  బతుకమ్మ, దసరా సందడి కొనసాగుతోంది. ఈ పండుగ అందరికీ ప్రధానమైనది కావడంతో ప్రతి ఒక్కరూ షాపింగ్‌ నిమిత్తం బయటకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నిత్యావసర షాపులు, షాపింగ్‌మాల్స్‌, ఇతర వ్యాపార సంస్థలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పదిహేను రోజుల ముందు వరకు అన్ని షాపుల్లో భౌతిక దూరం పాటించడం చేశారు. ఒకేసారి జనం పెరగడంతో షాపుల్లో ఎక్కడా పట్టించుకోకపోవడం వల్ల గుమిగూడి కొనుగోలుచేస్తున్నారు.  దీని వల్ల మళ్లీ కరోనా తీవ్రత బాగా  పెరుగుతుందని వైద్యు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సీజన్‌ కావడంతో భౌతిక దూరం పాటించి కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారి చేసినా ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని షాపులకు వచ్చే వారు మాస్కులు కూడా ధరించకపోవడం వల్ల దీని తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కలెక్టర్‌లు సమీక్షిస్తూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు కూడా సరైన నిబంధనలు పాటించకపోవడం, భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు స్పష్టంగా ఉన్నా పం డుగ సీజన్‌ కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు.


ఉమ్మడి జిల్లాలోని అధికారులతో పాటు వైద్యాధికారులు మాత్రం నిత్యం కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం ఉండి కొనుగోలు చేయాలని కోరుతున్నారు. గడిచిన పది రోజులుగా జరుగుతున్న ఈ  కొనుగో ళ్ల వల్ల పండుగ తర్వాత భారీగా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేసుల సంఖ్య తగ్గుతుందని వారు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని షాపుల యజమానులు కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో  కేసుల సంఖ్య పెరుగుతున్నది వాస్తవమేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2020-10-22T06:41:25+05:30 IST