కొవిన్‌ కేక

ABN , First Publish Date - 2021-03-02T07:02:50+05:30 IST

ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా మరో అంకానికి శ్రీకారం చుట్టుకుంది. దేశవ్యాప్తంగా రెండో విడత టీకా కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. 60 సంవత్సరాలు దాటిన

కొవిన్‌ కేక

4 గంటల్లోనే 10లక్షల రిజిస్ట్రేషన్లు!

సాయంత్రం 7 గంటలకు 25 లక్షలకు చేరిక

ఎయిమ్స్‌లో తొలి టీకా తీసుకున్న ప్రధాని

పూర్తి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కే మోదీ ఓటు

వెంకయ్య, కేంద్ర మంత్రులు జైశంకర్‌, 

జితేంద్రసింగ్‌, సీఎంలు నితీశ్‌, నవీన్‌ కూడా

ప్రారంభమైన రెండో విడత వ్యాక్సినేషన్‌

అర్హులంతా టీకా తీసుకోండి: ట్విటర్లో మోదీ

యాప్‌లో కాదు.. పోర్టల్‌లోనే రిజిస్ట్రేషన్‌


న్యూఢిల్లీ, మార్చి 1: ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా మరో అంకానికి శ్రీకారం చుట్టుకుంది. దేశవ్యాప్తంగా రెండో విడత టీకా కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు; దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న 45-59 సంవత్సరాల మధ్య వయస్కులకు కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకు కొవిన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత, దానిలో రిజిస్ట్రేషన్‌కు ఎగబడ్డారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కేవలం నాలుగు గంటల్లోనే దేశవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా రిజిస్టర్‌ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వేలాది మంది క్యూ కట్టారు. అందరికంటే ముందుగా సోమవారం ఉద యం 6.30 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ప్రధాని మోదీ తొలి టీకా తీసుకున్నారు.


టీకా వేసుకోవడానికి చాలామంది భయపడటం, ఇంకా ట్రయల్స్‌లో ఉండగానే ఆమోదం తెలిపారంటూ భారత్‌ బయోటెక్‌ టీకాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్వదేశీ టీకా కొవాగ్జిన్‌నే ప్రధాని తీసుకున్నా రు. అనంతరం 7.06 గంటలకు తాను టీకా తీసుకున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. నవ్వు తూ టీకా తీసుకుంటున్న ఫొటోను అప్‌లోడ్‌ చేశారు. పాండిచ్చేరి, కేరళ నర్సులతో కూడిన ఫొటోలను కూడా ట్విటర్లో ఉంచారు. ఒక ఫొటోలో పాండిచ్చేరి నర్సు నివేద టీకా వేస్తుంటే రోశమ్మ పక్కన నిలబడ్డారు. మరో ఫొటోలో ఇద్దరూ మోదీతో కలిసి దిగిన ఫొటోను ఉంచారు. ‘‘ఎయిమ్స్‌లో టీకా తొలి డోసు తీసుకున్నాను. కొవిడ్‌పై పోరాటంలో భాగంగా ఇంతతక్కువ సమయంలోనే మన డాక్టర్లు, శాస్త్రవేత్తలు టీకా అందుబాటులోకి తేవడం గర్వకారణం. అర్హత కలిగిన వాళ్లం తా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా కలిసి భారత్‌లో కొవిడ్‌ లేకుం డా చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. 


ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టీకా తీసుకున్నారు. ఇక, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో టీకా తొలి డోసుతీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అర్హులంతా విధిగా టీకా వేయించుకోవాలని, వైర్‌స వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. ఇక, బిహార్లో సీఎం నితీశ్‌ కుమార్‌ టీకా తీసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సహా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ టీకా ఉచితంగా ఇస్తామని పునరుద్ఘాటించారు. కేంద్ర మం త్రులు జైశంకర్‌, జితేంద్ర సింగ్‌, రాజస్థాన్‌, తమిళనాడు గవర్నర్లు కల్రాజ్‌ మిశ్రా, భన్వరీలాల్‌ పురోహిత్‌, ఒడిసాలో సీఎం నవీన్‌ పట్నాయక్‌, ముంబైలో భార్య, కుమార్తెతో కలిసి 80 ఏళ్ల ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితరులు కూడా టీకా తీసుకున్నారు. 


కర్ణాటకలో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథి, భోపాల్‌లో 89 ఏళ్ల రిటైర్డ్‌ డాక్టర్‌ ఎన్పీ మిశ్రా తొలి టీకా తీసుకున్నారు. కాగా, తొలి టీకాను ప్రధాని మోదీ తీసుకోవడం ద్వారా ప్రజల అనుమానాలన్నీ పటాపంచలవుతాయని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా, భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం కావడంతో రోగులకు ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో ఉదయం 6.30 గంటలకే ప్రధాని టీకా తీసుకున్నారని చెప్పారు. అనంతరం, అరగంటపాటు ఆస్పత్రిలోనే పరిశీలనకు ఉంచామని, ఆయన మామూలుగానే ఉన్నారని, తర్వాత వెళ్లిపోయారని తెలిపారు. అయితే, కొవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవడం ఇబ్బందిగా మారిందని, సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయనే ఫిర్యాదులు వచ్చాయి. దాంతో టీకా రిజిస్ట్రేషన్‌ను పోర్టల్‌లో చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 


సుప్రీం జడ్జిలకు నేడు

సుప్రీం కోర్టులోని జడ్జిలు, వారి కుటుంబాలకు కొవిడ్‌ టీకాను మంగళవారం నుంచి ఇవ్వనున్నారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని వారికి ఇచ్చారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఏర్పాట్లు చేశారు. ఇక, డబ్బులు చెల్లించి తమ నియోజకవర్గాల్లోనే టీకా తీసుకోవాలని, తద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు బీజేపీ నిర్దేశించింది. 

Updated Date - 2021-03-02T07:02:50+05:30 IST