కొవిడ్‌తో మెదడు చిత్తు!

ABN , First Publish Date - 2020-09-22T05:30:00+05:30 IST

కొవిడ్‌ ప్రభావం ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థ మీదే ఎక్కువ. అయితే కొందరిలో ఈ వైరస్‌ దారి మార్చి మెదడు మీద దాడి చేస్తోంది. దాంతో ఇప్పటివరకూ కొవిడ్‌ చికిత్సలో భాగంగా శ్వాసకోశవ్యవస్థ మీదే దృష్టి పెడుతున్న వైద్యులకు, కొవిడ్‌తో తలెత్తే సైకోసిస్‌, స్ట్రోక్‌ సమస్యలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి...

కొవిడ్‌తో మెదడు చిత్తు!

కొవిడ్‌ ప్రభావం ప్రధానంగా శ్వాసకోశవ్యవస్థ మీదే ఎక్కువ. అయితే కొందరిలో ఈ వైరస్‌ దారి మార్చి మెదడు మీద దాడి చేస్తోంది. దాంతో ఇప్పటివరకూ కొవిడ్‌ చికిత్సలో భాగంగా శ్వాసకోశవ్యవస్థ మీదే దృష్టి పెడుతున్న వైద్యులకు, కొవిడ్‌తో తలెత్తే సైకోసిస్‌, స్ట్రోక్‌ సమస్యలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి.


కరోనా వైరస్‌ ప్రధానంగా ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ వైరస్‌ వాసనను తెలిపే ఆల్‌ఫాక్టరీ నాడి ద్వారా మెదడులోకి చేరి అక్కడ కూడా తిష్ట వేస్తోందనే విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాల్లో వాసన కోల్పోయే లక్షణం దీనికి సంబంధించినదే! ఇలా మెదడు, నాడీవ్యవస్థలు కరోనాతో జబ్బుపడిన వారిలో, అయోమయం, భ్రాంతులు, చీకాకు... మొదలైన లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో మెదడు కణజాలం వాచి, ఇన్‌ఫ్లమేషన్‌కు గురైతే మరికొందరిలో మెదడు కణాలైన న్యూరాన్లను కప్పే మైలీన్‌ అనే కొవ్వు పొర కరిగిపోతూ ఉంటుంది. ఇలా కొవ్వుపొర కరగడం మూలంగా తలెత్తే సమస్య, తిరిగి సరిదిద్దే వీలు లేని నాడీసంబంధ సమస్య మల్టిపుల్‌స్క్లెరోసిస్‌ను పోలి ఉంటోంది. 


కారణాన్ని బట్టి చికిత్స!

బ్రెయిన్‌ స్ట్రోక్‌, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మెదడులో రక్తం గడ్డలు ఏర్పడడం ఈ సమస్య ప్రధాన ప్రభావాలు. మరికొందరిలో స్ట్రోక్‌తో పాటు ఎన్‌సెఫలైటిస్‌ కూడా బయల్పడుతోంది. అయితే తాజా లక్షణాలు కొవిడ్‌కు సంబంధించినవేనా? లేక ఈ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాధినిరోధకశక్తి అతిగా స్పందించడం మూలంగా తలెత్తిన ప్రభావం ఫలితమా? అనేది నాడీ వైద్యులు తేల్చుకోలేకపోతున్నారు. ఈ రెండు సమస్యలకూ వేర్వేరు చికిత్సలు అవసరం అవుతాయి కాబట్టి అసలు కారణాన్ని కనిపెట్టడం కీలకంగా మారింది.


ఎంత మందిలో?

నేరుగా కేంద్ర నాడీవ్యవస్థే లక్ష్యంగా వైరస్‌ దాడిచేస్తే యాంటీవైరల్‌ మందులతో చికత్స చేయవచ్చు. అలాకాకుండా కేంద్ర నాడీవ్యవస్థలో ఈ వైరస్‌ కనిపించకపోతే శరీరం నుంచి వైరస్‌ వెళ్లిపోయిందని భావించి, యాంటీఇన్‌ఫ్లమేటరీ మందులతో చికిత్స అందించవలసి ఉంటుంది. అయితే శరీరంలో వైరస్‌ లేకపోయినా, యాంటీవైరల్‌ మందులతో చికిత్స చేయడంలో అర్థం లేదు. అలాగని మెదడులో వైరస్‌ ఉన్నవారికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు ఇస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి సమస్యను కచ్చితంగా అంచనా వేసి సరైన చికిత్స అందించడం ఎంతో కీలకం అంటున్నారు వైద్యులు!     


Updated Date - 2020-09-22T05:30:00+05:30 IST