ఐపీఎల్‌లో మళ్లీ కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-04-16T09:01:13+05:30 IST

గత ఏడాది మాదిరే..ఈ ఐపీఎల్‌పైనా కరోనా పడగ విసరనుందా ? ఢిల్లీ జట్టులో అనూహ్యంగా ఓ కొవిడ్‌ కేసు వెలుగుచూడడంతో అందరిలో ఇప్పుడు ఇదే అనుమానం తలెత్తుతోంది.

ఐపీఎల్‌లో మళ్లీ   కరోనా కలకలం

ఢిల్లీ ఫిజియోకు పాజిటివ్‌

ముంబై: గత ఏడాది మాదిరే..ఈ ఐపీఎల్‌పైనా కరోనా పడగ విసరనుందా ? ఢిల్లీ జట్టులో అనూహ్యంగా ఓ కొవిడ్‌ కేసు వెలుగుచూడడంతో అందరిలో ఇప్పుడు ఇదే అనుమానం తలెత్తుతోంది. దేశంలో హఠాత్తుగా పెరుగుతున్న కొవిడ్‌ కేసుల ప్రభావం ఐపీఎల్‌పైనా పడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ ఫరాట్‌కు కరోనా సోకడం లీగ్‌లో కలకలం రేపింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫిజియో ప్యాట్రిక్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. ప్రస్తుతం అతడు ఆ జట్టు వైద్య బృందం నిశిత పర్యవేక్షణలో ఉన్నాడు’ అని లీగ్‌ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. కరోనా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’ దేశంలోకి ప్రవేశించిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో ఐపీఎల్‌లో వైరస్‌ బయటపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. నిరుడు మేలో.. టోర్నీ మధ్యలో ఒక కేసుతో మొదలై క్రమంగా పాజిటివ్‌లు పెరగడంతో లీగ్‌ను అర్ధంతరంగా వాయిదా వేసి నాలుగు నెలల తర్వాత యూఏఈలో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈసారి ముంబైలోని మూడు వేదికల్లో, పుణెలోని ఒక స్టేడియంలోనే మ్యాచ్‌లు జరుగుతున్నందున జట్లు పెద్దగా ప్రయాణించాల్సిన అవసరం ఉండడంలేదు. అయినా కరోనా కేసు వెలుగు చూడడం సంచలనం రేపింది. దాంతో రాబోయే రోజుల్లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించే విషయాన్ని లీగ్‌ నిర్వాహకులు పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. కాగా..చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ వెన్ను గాయంతో ఈ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ రసిక్‌ సలాం కూడా వెన్ను గాయంతో ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నాడు. 

Updated Date - 2022-04-16T09:01:13+05:30 IST