మళ్లీ కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-07-01T07:15:48+05:30 IST

నల్లగొండ జిల్లాలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. నాలుగు నెలలుగా సద్దుమణిగిన కరోనా మళ్లీ పంజా విసురుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ కరోనా కలకలం

నల్లగొండ జిల్లాలో ఒక్కరోజే 13 కేసులు నమోదు 

ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్‌

నల్లగొండ అర్బన్‌, జూన్‌ 30: నల్లగొండ జిల్లాలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. నాలుగు నెలలుగా సద్దుమణిగిన కరోనా మళ్లీ పంజా విసురుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 347మందికి పరీక్షలు నిర్వహించగా, 13 పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న పానగల్‌లో ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. అడవిదేవులపల్లి మండలంలో ముగ్గురికి, నాగార్జునసాగర్‌లో ఇద్దరికి, మిర్యాలగూడ డివిజన్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు మందులు అందజేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా, నాలుగు నెలలుగా జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఆర్టీపీసీ, ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, జూన్‌ నెలలో మొత్తం 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైన నాటి నుంచి నల్లగొండ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం పాజిటివ్‌ కేసులు 84,949 నిర్ధారణ అయ్యాయి. జిల్లా జనాభా 17.43లక్షలు కాగా, వైద్యశాఖ అధికారులు ఇప్పటి వరకు 12,77,866 పరీక్షలు నిర్వహించారు. 84,949 మందికి పాజిటివ్‌ రాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొంది 84,536 మంది కోలుకున్నారు. కాగా, కరోనాతో 401 మృతిచెందగా, ప్రస్తుతం జిల్లాలో 22 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా ఇళ్లలోనే హోంఐసోలేషన్‌లో ఉన్నారు.

Updated Date - 2022-07-01T07:15:48+05:30 IST