కరోనా అలర్ట్‌

ABN , First Publish Date - 2021-02-26T05:53:55+05:30 IST

దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా కేసులు క్రమేణా పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

కరోనా అలర్ట్‌

రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తం

నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని నిర్ణయం

ప్రస్తుతం రోజుకు రెండు వేల మందికి టెస్ట్‌లు

సెకండ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో నేటి నుంచి అదనంగా మరో వెయ్యి మందికి...

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలనే నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం

పాఠశాలల్లో ప్రతి తరగతిలో ర్యాండమ్‌గా ఇద్దరికి పరీక్షలు

వైరస్‌ బాధితులను సకాలంలో గుర్తించడంపై అధికారులు దృష్టి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా కేసులు క్రమేణా పెరుగుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ బారినపడిన వారిని సకాలంలో గుర్తించడం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్న అధికారులు...ఆ దిశగా చర్యలను వేగవంతం చేశారు. వీలైనంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలిని నిర్ణయించారు. 


వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా వున్న రోజుల్లో రోజుకు ఆరు వేల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు వేలకు తగ్గించారు. మళ్లీ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధితులను సకాలంలో గుర్తించేందుకు పరీక్షలను పెంచుతున్నారు. శుక్రవారం నుంచి ప్రతిరోజూ జిల్లాలో మూడు వేల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అనుమానితులతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశమున్న ప్రాంతాల్లో ర్యాండమ్‌గా కొంతమందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఏజెన్సీ వంటి ప్రాంతాల్లో సంతల్లోను, పాఠశాలల్లో ఒక్కో తరగతి నుంచి ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీరితోపాటు లక్షణాలున్నట్టు గుర్తించిన ప్రతి చిన్నారికి వెంటనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఆదేశాలు జారీచేశారు.  


యాంటీజెన్‌ వారికి మాత్రమే...


రోజువారీ పరీక్షల్లో ఆర్‌టీపీసీఆర్‌ కిట్లను మాత్రమే వినియోగించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, శస్త్రచికిత్సలు, డెలివరీలు వంటివి నిర్వహించాల్సిన వారికి మాత్రం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజూ సుమారు 200 మందికి ఈ పరీక్షలు చేస్తున్నారు. 


అందుబాటులో కిట్లు


కొవిడ్‌ నిర్ధారణ కిట్లు జిల్లాలో పూర్తిస్థాయిలో అందుబాటులో వున్నట్టు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలతోపాటు నగర పరిధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌ నిర్ధారణ కిట్లు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 200 నుంచి 500 వరకు కిట్లు అందుబాటులో ఉంచామని, అవసరమైన వారికి ఇండెంట్లు పెట్టిన వెంటనే పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 


టెస్ట్‌లకు క్యూ..


కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన తరువాత జిల్లాలో నిర్ధారణ పరీక్షలకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. అయితే, దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడం, సెకండ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వైరస్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలున్నా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. నగర పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాల సంఖ్య తక్కువగా ఉంది. పరీక్షలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో నగర పరిధిలోని ప్రతి యూపీహెచ్‌సీలోను పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


అందుబాటులో కొవిడ్‌ నిర్ధారణ కిట్లు

డాక్టర్‌ పీఎస్‌ సూర్యనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

జిల్లాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శుక్రవారం నుంచి అదనంగా మరో వేయి పరీక్షలు నిర్వహించనున్నాం. ఇందుకోసం అవసరమైన కొవిడ్‌ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచాం. నగర పరిధిలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల కోసం పూర్తిగా ఆర్టీపీసీఆర్‌ కిట్లను వినియోగిస్తున్నాం.

Updated Date - 2021-02-26T05:53:55+05:30 IST