కరోనా కాటు

ABN , First Publish Date - 2020-07-06T11:10:34+05:30 IST

కోనసీమలో కరోనా విజృంభిస్తోంది. మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

కరోనా కాటు

 కొవిడ్‌-19తో మృత్యువాతపడుతున్న యువకులు 

మంత్రి పీఏ కాంటాక్ట్స్‌లో ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ

మూడు నెలల చిన్నారి, 14 నెలల బాబుకూ కూడా వైరస్‌ 8 ఆందోళనలో కోనసీమ ప్రజలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): కోనసీమలో కరోనా విజృంభిస్తోంది. మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మొన్న తూర్పుపాలెం, నేడు పెదపట్నంలంకకు చెందిన ఇద్దరు యువకులు కరోనా వైర్‌స్‌తో మృత్యువాతపడ్డారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాంటాక్ట్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి. మంత్రి పీఏ కాంటాక్ట్‌ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. మూడు నెలల చిన్నారి సహా చిన్న పిల్లలకు కరోనా సోకడంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. మంత్రి పినిపే విశ్వరూప్‌ పీఏగా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని కాంటాక్ట్‌గా అయినవిల్లి మండలం తొత్తరమూడిలో ఉంటున్న మావయ్యకు పాజిటివ్‌ వచ్చింది. ఆయన పి.గన్నవరంలోని ఒక స్కూలులో హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. అతని కాంటాక్ట్‌లకు సంబంధించి 17 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. హెచ్‌ఎం కుటుంబ సభ్యులు ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. మంత్రి పీఏ కుటుంబ సభ్యుల్లో పద్నాలుగేళ్ల బాబు, ఏడు సంవత్సరాల బాలుడికి వైరస్‌ సోకింది. హెచ్‌ఎం మరో కుమార్తె(30)కు, ఆమె మూడు నెలల చిన్నారికీ కూడా పాజిటివ్‌ రిపోర్టు రావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.


మంత్రి పీఏ మావయ్య ఇంటి కింద పోర్షన్లో అద్దెకు ఉంటున్న ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో 70 ఏళ్ల వృద్ధురాలు, 11 ఏళ్ల బాలిక ఉన్నారు. ఇటీవల అమలాపురం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో అమలాపురం పట్టణం దొమ్మేటి వారి వీధికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్‌ తేలింది. ఆమె ఇటీవల హైదరాబాద్‌ నుంచి అమలాపురం వచ్చి కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా నిర్ధారణ అయ్యింది. గతంలో ఇక్కడే ఒక పాజిటివ్‌ కేసు నమోదై రెడ్‌జోన్‌ ఆంక్షలను కూడా సడలించిన నేపథ్యంలో మళ్లీ కంటైన్మెంట్‌ జోన్‌ పెట్టనున్నారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరానికి చెందిన ఓ యువకుడికీ పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది.


మరోవైపు కోనసీమలో మరణాలు పెరుగుతున్నాయి. మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన 35 ఏళ్ల ఫైనాన్స్‌ వ్యాపారి కరోనాతో ఆదివారం మృతి చెందాడు. కొవిడ్‌-19 లక్షణాలతో బాధపడుతున్న అతడు శనివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌లో చేరగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబీకులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ముఖ్యంగా యువకులు వైరస్‌తో అకాల మృత్యువాతపడుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఓ యువకుడు మూడు రోజుల క్రితం కరోనాతో మృతి చెందాడు. అతడి కాంటాక్ట్‌ కేసుల్లో తల్లి, పెదనాన్నలతో పాటు స్నేహితునికి పాజిటివ్‌గా తేలింది. మృతుని కాంటాక్ట్‌లకు సంబంధించిన మరికొన్ని ఫలితాలు వెల్లడి కావలసి ఉంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలేనికి చెందిన కాంటాక్ట్‌ వ్యక్తుల పరీక్ష నివేదికలు వెల్లడి కావలసి ఉంది.  

Updated Date - 2020-07-06T11:10:34+05:30 IST