పల్లెల్లో కరోనా పడగ

ABN , First Publish Date - 2021-05-15T05:40:50+05:30 IST

జిల్లాలో 887 పంచాయతీలు, 1,550కి పైగా మజరా గ్రామాలు ఉన్నాయి. జిల్లా జనాభా 2011 గణాంకాల ప్రకారం 28 లక్షలకు పైగా ఉంది. కరోనా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రామ సీమల్లోనూ స్వైరవిహారం చేస్తోంది.

పల్లెల్లో కరోనా పడగ

గ్రామాల్లో రోజు రోజుకు విస్తరిస్తున్న కేసులు

పెరుగుతున్న మరణాలు

జిల్లావ్యాప్తంగా 24 గంటల్లో 1,460 కేసులు నమోదు

అందులో గ్రామాల్లో నమోదైన కేసులు 1,000కి పైగానే

ఇరుకు ఇంట్లో జనం అవస్థలు


కరోనా మహమ్మారి పల్లెసీమల్లో దడ పుట్టిస్తోంది. పచ్చని పల్లెసీమల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్‌ కేసులు లేని పల్లె లేదు. చాలా మంది పాజిటివ్‌ లక్షణాలు ఉన్నా టెస్టు చేయించుకోక జనంలో తిరుగుతున్నారు. ఆర్‌ఎంపీ వైద్యులతో తెలిసీ తెలియని చికిత్స పొందుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతి బృందం ప్రతి మండలంలో రెండు గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దారుణమైన వాస్తవాలు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 1,460 కేసులు నమోదైతే అందులో 75 శాతం పల్లెల్లో వచ్చినవే. హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఇరుకు ఇళ్లల్లో అవస్థలు పడుతున్నారు.


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో 887 పంచాయతీలు, 1,550కి పైగా మజరా గ్రామాలు ఉన్నాయి. జిల్లా జనాభా 2011 గణాంకాల ప్రకారం 28 లక్షలకు పైగా ఉంది. కరోనా పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. ముఖ్యంగా గ్రామ సీమల్లోనూ స్వైరవిహారం చేస్తోంది. కొందరు కరోనా టెస్టులు చేయించుకోగా, చాలా మంది కరోనా లక్షణాలు ఉన్నా టెస్టులు చేయించుకోవడం లేదు. గ్రామాలకు వచ్చే వైద్యులు, మెడికల్‌ షాపులో ఇచ్చే మందులను తింటూ ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్న వాళ్లను వలంటీర్ల ద్వారా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తే పల్లె సీమల్లో భారీగా కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసింది.


పెరుగుతున్న కేసులు

శుక్రవారం వైద్యారోగ్యశాఖ ఇచ్చిన హెల్త్‌బులిటెన్‌ మేరకు 1,460 కేసులు నమోదయ్యాయి. అందులో 359 కేసులు కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, మైదుకూరు పట్టణాల్లో నమోదైతే... 1100 కేసులు పల్లెల్లోనే నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ సమాచారం. అలాగే ఏప్రిల్‌ నెలలో మాత్రమే 18,118 కేసులు నమోదైతే అందులో గ్రామాల్లో నమోదైన కేసులు 12 వేలకు పైగా ఉంటాయని అంచనా. మే నెలలో ఇప్పటి వరకూ 15,692 కేసులు నమోదైతే దాదాపు 70 శాతం కేసులు అంటే 11 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు గ్రామాల నుంచే వచ్చాయని తెలుస్తోంది. అదే క్రమంలో మరణాల రేటు కూడా భారీగానే ఉంది. అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిశీలింన లెక్కలకు పొంతన కుదరడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు 60 మంది మృతి చెందారు. కేవలం మండలానికి రెండు చొప్పున గ్రామాల్లో పరిశీలిస్తే 147 మందికిపైగా మృతి చెందినట్లు తేలింది. అంటే ప్రైవేటు ఆసుపత్రులు, ఇంట్లోనే చికిత్స పొందుతూ మృతి చెందిన కేసులు, కరోనా లక్షణాలతో మరణించిన వారు అధికారిక రికార్డుల్లోకి ఎక్కలేదని తెలుస్తోంది.


ఇరుకు ఇంట్లో అవస్థలు

పాజిటివ్‌ రాగానే స్వల్ప లక్షణాలు ఉన్నాయంటూ హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 75 శాతం హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. పట్టణాల్లో పేదల ఇళ్లల్లో మినహా బడాబాబులు, ఉద్యోగులు, వ్యాపారుల ఇళ్లల్లో ప్రత్యేక గదులు ఉంటాయి. వారికి హోం ఐసోలేషన్‌లో ఉంటే కుటుంబ సభ్యులు వారికి దూరంగా సేవలందిస్తారు. పల్లెల్లో మెజార్టీ చిన్న ఇళ్లే ఉన్నాయి. కొందికైతే ప్రత్యేక పడక గదులు ఉండవు. ఐదారుగురు కుటుంబ సభ్యులు హాల్‌లోనూ, ఒకే గదిలోనూ నిద్రించాల్సి ఉంటుంది. అందరికీ కలిపి ఒకే టాయిలెట్‌, బాతరూం ఉంటాయి. అలాంటి ఇళ్లల్లో పాజిటివ్‌ వచ్చిన బాధితుడిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో వారి నుంచి ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంది. ఒకే గదిలో భార్య, పిల్లలతో నివసించే ఆ కుటుంబాలు సతమతమవుతున్నాయి. కొందరైతే భార్య, పిల్లలను దూరపు బంధువుల ఇళ్లకు పంపించాల్సి వస్తోంది.


ఇవీ వాస్తవాలు..

- పులివెందుల నియోజకవర్గంలో నారపురెడ్డిపల్లె, అచ్చవెల్లి, పెద్దజూటూరు, వేముల, బిదినంచర్ల, పైడిపాలెం, లింగాల, అప్పులవారిపల్లె, సంత కొవ్వూరు, పాలూరు, నావనూరు, పాలగిరి, నాగిరెడ్డిపల్లె, చక్రాయపేట, వీరన్నగట్టుపల్లె, రామిరెడ్డిపల్లె గ్రామాల్లో ఆంధ్రజ్యోతి బృందం పరిశీలించింది. 364 మందికి పాజిటివ్‌ రాగా 224 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్సలు పొందుతున్నారు. కేవలం 80 మంది మాత్రమే ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెళ్లారు. పరిశీలించిన ఆ గ్రామాల్లో ఇప్పటివరకు 22 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లు గ్రామస్తులు వెల్లడించారు. లింగాల గ్రామంలో 8 మంది మృత్యువాత పడినట్లు పేర్కొంటున్నారు. 

- కమలాపురం నియోజకవర్గంలో బైనపల్లె, నాగిరెడ్డిపల్లె, రామన్నగారిపల్లె, గుర్రంపాడు, సమ్మటూరు, గంగవరం, వల్లూరు, బాలువారిపల్లె గ్రామాల్లో పరిశీలిస్తే 183 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 118 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆసుపత్రికి వెళ్లిన వారు 55 మంది మాత్రమే. ఇప్పటిదాకా 13 మంది మృత్యువాత పడ్డారు. 

- మైదుకూరు నియోజకవర్గంలో వనిపెంట, ముదిరెడ్డిపల్లె, అప్పిరెడ్డిపల్లె, వి.రాజుపాలెం, నెలటూరు, దువ్వూరు, భూమయ్యపల్లె, దుంపలగట్టు గ్రామాల్లో 297 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 190 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటే 107 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెళ్లారు. 18 మంది మృత్యువాత పడ్డారు. 

- జమ్మలమడుగు నియోజకవర్గంలో గూడెంచెరువు, ఉప్పలపాడు, దొమ్మరనంద్యాల, వేపరాల, పెద్దపసుపుల, సిద్దపల్లె, లావనూరు, ముద్దనూరు, యామవరం, చిలంకూరు, పొట్లదుర్తి గ్రామాల్లో 360 కరోనా కేసులు నమోదయ్యాయి. 207 మంది ఇంట్లో ఉంటూ చికిత్స పొందితే 42 మంది మాత్రమే ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెళ్లారు. కరోనా బారిన పడి 21 మంది మృత్యువాత పడ్డారు.

- ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లింగాపురం, ఖాదర్‌బాద్‌, టంగుటూరు, ఎర్రపాడు గ్రామాల్లో 113 మంది కరోనా బారిన పడితే అందరు కూడా హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం అందుకుంటున్నారు. ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

- రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో కూచ్చివారిపల్లె, పాటూరు, లేబాక, ఒంటిమిట్ట, చెంచుగారిపల్లె, తిమ్మసముద్రం, దిగువపల్లె, వీరబల్లి, ఈడిగపల్లె, మాధవరం, శెట్టిగుంట, కొత్తపేట, పుత్తన్నవారిపల్లె, చిట్వేలి, దేవమాచుపల్లె, నారాయణనెల్లూరు గ్రామాల్లో 1,189 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వారిలో 613 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటే 118 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ఆసుపత్రుల్లో చేరి చికిత్స అందుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ నెలన్నరలో 58 మంది మృత్యువాత పడినట్లు గ్రామస్తులు వెల్లడించారు. 

- బద్వేల్‌ నియోజకవర్గంలో చిలకలచెరువు, చిరువెంగలాపురం, పోరుమామిళ్ల, రంగసముద్రం, బెడుసుపల్లె, ఉప్పువారిపల్లె, ఉప్పులూరు, నరసాపురం, రెడ్డివారిపల్లె, గోవిందయ్యపల్లె, కామసుముద్రం, అట్లూరు గ్రామాల్లో 277 కరోనా కేసులు నమోదు కాగా 240 మంది హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 37 మంది మాత్రమే ఆసుపత్రి, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లారు. 9 మంది మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Updated Date - 2021-05-15T05:40:50+05:30 IST