యువత, మధ్య వయసువారిపైనే కరోనా పంజా

ABN , First Publish Date - 2021-04-23T09:27:24+05:30 IST

రాష్ట్రంలో యువత, మధ్య వయసు వారే ఎక్కువగా కరోనాకు గురవుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 43%పైగా బాధితులు 21-40 ఏళ్ల మధ్య ఉన్నవారే.

యువత, మధ్య వయసువారిపైనే కరోనా పంజా

రాష్ట్రంలో 5,567 కేసులు; 23 మరణాలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌కు పాజిటివ్‌

మొత్తం కేసుల్లో 20-40 మధ్య వారు 43%

జీహెచ్‌ఎంసీలో దాదాపు వెయ్యి పాజిటివ్‌లు

గాంధీలో 52 మంది మృతి!

జగిత్యాల వ్యవసాయ శాఖలో 11 మందికి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యువత, మధ్య వయసు వారే ఎక్కువగా కరోనాకు గురవుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 43%పైగా బాధితులు 21-40 ఏళ్ల మధ్య ఉన్నవారే. 41-70 ఏళ్ల వారు 40 శాతం ఉన్నారు. రాష్ట్రంలో బుధవారం 5,567 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 23 మంది మృతి చెందారు. 1,02,335 మందికి టెస్టులు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 3,73,468కు, మరణాలు 1,899కు పెరిగాయి. యాక్టివ్‌ కేసులు 49,781కి చేరాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 989 నమోదయ్యాయి. రంగారెడ్డి(437), మేడ్చల్‌ (421), నిజామాబాద్‌(367), మహబూబ్‌నగర్‌(258), కామారెడి ్డ(206) లోనూ భారీగా పాజిటివ్‌లు వచ్చాయి.


రాజ్యసభ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా.. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు ఈ నెల 19న కరోనా నిర్ధారణ కాగా, నిత్యం ఆయన వెన్నంటి ఉండే ఎంపీ సంతోష్‌కు గురువారం పాజిటివ్‌ అని తేలింది. సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా సంతోష్‌ ఆయనతో పాటే ఉన్నారు.


కామారెడ్డి జిల్లా మద్నూర్‌ ఎంపీడీవో నగేశ్‌(57) గురువారం కరోనాతో మృతి చెందారు. ఈ మండలం మహారాష్ట్ర సరిహద్దున ఉంటుంది. జగిత్యాల జిల్లాలో వ్యవసాయ శాఖలో 11 మందికి కరోనా సోకింది.

కొవిడ్‌ పరీక్షకు అధిక ఫీజు వసూలు చేస్తున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రైవేటు ఆస్పత్రికి అనుసంధానంగా పనిచేస్తున్న ల్యాబ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేశారు.

తమకు కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, క్వారంటైన్‌లో ఉన్నామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులు తెలిపారు.


1.22 లక్షల మందికి టీకా

రాష్ట్రంలో బుధవారం 1,22,805 మందికి కరోనా టీకా వేశారు. 1,04,770 మందికి తొలి డోసు, 18,035 మందికి రెండో డోస్‌ ఇచ్చారు. ఇప్పటివరకు  రాష్ట్రంలో 33,81,490 మంది టీకా తీసుకున్నారు. వీరిలో 29,73,323 మంది మొదటి డోసు, 4,18,167 మంది రెండో డోసు వేయించుకున్నారు.


ఏపీలో 10 వేలు దాటిన కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కేసులు తొలిసారిగా పదివేలు దాటాయి. కొత్తగా 10,759 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.97 లక్షలకు చేరుకుంది.  31 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో అత్యధికంగా 1,474 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలులో 1,367, శ్రీకాకుళంలో 1,336, గుంటూరులో 1,186, తూర్పుగోదావరిలో 992, నెల్లూరులో 816, విశాఖపట్నంలో 844, అనంతపురంలో 789, కృష్ణాలో 679 మంది వైరస్‌ బారిన పడ్డారు.

Updated Date - 2021-04-23T09:27:24+05:30 IST