సెంట్రల్‌ జైలుకు కరోనా.. 247మంది ఖైదీలు.. 32 మంది సిబ్బందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-08T18:24:16+05:30 IST

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును కరోనా పట్టిపీడిస్తోంది. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతేడాది సుమారు 60 మంది ఖైదీల వరకూ ఎయిడ్స్‌రావడం, వందలాది మంది ఖైదీలు అనారోగ్యం పాలవ్వడంతో హైకోర్టు జోక్యం

సెంట్రల్‌ జైలుకు కరోనా.. 247మంది ఖైదీలు.. 32 మంది సిబ్బందికి పాజిటివ్‌

జైలు ఆసుపత్రి ఖాళీ.. ఓ డాక్టర్‌కు కరోనా.. 

తల్లికి కరోనా రావడంతో మరో డాక్టర్‌ క్వారంటైన్‌లో..

జైలులోనే ఖైదీలకు ఐసోలేషన్‌ వార్డులు.. వద్దంటున్న సిబ్బంది

సిబ్బందికి రక్షణ కల్పించాలని యూనియన్‌ నేత సతీష్‌ డిమాండ్‌


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలును కరోనా పట్టిపీడిస్తోంది. దీంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతేడాది సుమారు 60 మంది ఖైదీల వరకూ ఎయిడ్స్‌రావడం, వందలాది మంది ఖైదీలు అనారోగ్యం పాలవ్వడంతో హైకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు కరోనా విజృంభించడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అధికారులు, సిబ్బంది, ఖైదీలందరిలోనూ ఒకటే టెన్షన్‌. ఇప్పటివరకు 32 మంది జైలు సిబ్బందికి, 247 ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల హెడ్‌వార్డర్‌ ఒకరు కరోనాతో మృతి చెందారు. జైలులోపల ఉన్న ఆసుపత్రి కూడా ఖాళీ అయిపోయింది. కరోనా సోకడంతో ఒక డాక్టర్‌ బయట వైద్యం చేయించుకుంటున్నారు. మరో డాక్టర్‌ తల్లికి కరోనా రావడంతో ఆయన కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఇక్కడ సాధారణ వైద్యం సేవలూ నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 1,666 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో శిక్ష పడినవారితోపాటు రిమాండు ఖైదీలు కూడా ఉన్నారు. ఇటీవల 900 మందికి కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. అందులో ఏకంగా 247 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంతకుముందే 32 మంది సిబ్బందికి కరోనా సోకింది. 


వారివల్ల వారి కుటుంబ సభ్యులకు మరో 20 మందికి అంటింది. సుమారు నెల రోజుల నుంచి ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. టెస్ట్‌లు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత నెలలో ఒక హెడ్‌వార్డర్‌ కరోనాతో మృతి చెందారు. పలువురు ఖైదీలకు గత నెలలో కరోనా సోకింది. వీరిలో ఒక ఖైదీ జీఎస్‌ఎల్‌లో చికిత్సపొందుతూ పరారయ్యాడు. అతడిని గురువారం రంపచోడవరం వద్ద పట్టుకున్నారు. పెద్ద సంఖ్యలో ఖైదీలకు పాజిటివ్‌ వచ్చినప్పటికీ బయట ఆసుపత్రులకు పంపకుండా జైలులోని ఐసోలేషన్‌లో పెట్టి వైద్యం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. తాజాగా మరో 400 మందికి పరీక్షలు నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో వారి ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడి సిబ్బంది మాత్రం కరోనా బాధిత ఖైదీలను కూడా బయట ఆసుపత్రులకు పంపి వైద్యం చేయించాలని, ఇక్కడ ఉంటే, అందరికీ చుట్టుకునే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇంతమందికి కరోనా ఎందుకు సోకిందనే విషయంపై జైలు అధికా రులు పరిశీలన చేశారు. 


ప్రతీరోజూ సెంట్రల్‌ జైలుకు 10 నుంచి 20 మంది వరకూ ముద్దాయిలు అడ్మిట్‌ అవుతుంటారు. వారానికి సుమారు 100 వరకూ ఉంటారు. లాక్‌డౌన్‌ మొదట్లో ముద్దాయిలకు ప్రభుత్వాసుపత్రులలో కొవిడ్‌ టెస్ట్‌లు చేయించి,  రిజల్ట్‌ రాకుండానే జైలుకు తీసుకుని వచ్చేవారు. ఇక్కడ సింగిల్‌ రూమ్‌లు సుమారు 20 ఉన్నాయి. వాటిలో డెకాయిడ్‌ ఖైదీలు, మానసిక సమస్యలతో బాధపడుతున్న ఖైదీలను సింగిల్‌గా ఈ రూమ్‌లలో ఉంచుతారు. అందువల్ల టెస్ట్‌లు చేయించుకున్నవారిని రిజల్ట్‌ వచ్చేవరకైనా సింగిల్‌గా ఉంచే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక్కో బ్యారెక్‌లలో సుమారు 20 మంది ఖైదీలను ఉంచుతారు. వారిలో ఒకరిద్దరికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్ట్‌ చేసిన తర్వాత రిజల్ట్‌ వచ్చేవరకూ అందరూ కలిసే ఉండాలి. తర్వాత  రిజల్ట్‌ వచ్చిన తర్వాత పాజిటివ్‌ బాధితులను మొదట్లో జీఎస్‌ఎల్‌కు పంపించేవారు. మిగతా వారికి కనీసం టెస్ట్‌లు చేయలేదు. అన్ని బ్యారక్‌లలో ఇదే పరిస్థితి ఉండడంతో కరోనా విజృంభించింది. రోజూ ఖైదీలను లాకప్‌లో పెట్టేముందు గార్డులు చెక్‌ చేయాలి. బ్యారక్‌ చుట్టూ సెంట్రీ డ్యూటీ చేయాలి. ఖైదీల వద్ద ఉన్న రిజిష్టర్లలో సంతకాలు చేయాలి. వాళ్లు తుమ్మినా, దగ్గినా అక్కడకు వెళ్లి సంతకం చేయవలసిందే. ఇది కూడా సిబ్బందికి కరోనా సోకడానికి ఒక కారణంగా భావిస్తున్నారు.


మాకు రక్షణ కల్పించండి..

 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లలోనూ కరోనా వ్యాపిస్తోంది. ఇక్కడి సిబ్బందిలో 10 శాతం మందికి కరోనా సోకింది. ఖైదీలకు కూడా అధికంగా వస్తోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం రక్షణ కిట్లు ఇవ్వాలి. ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ జైలు డిపార్మెంట్‌ గార్డింగ్‌ ఫోర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.సతీష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఇక్కడ ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో 32 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపఽథ్యంలో వారి కుటుంబాల్లోని భార్య,  తల్లి కూడా కూడా సోకింది. ఒక కుటుంబంలో ముక్కుపచ్చలారని మూడేళ్ల బిడ్డకు కూడా కరోనా సోకిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది అందరికీ  ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. రక్షణ కిట్లు ఇవ్వాలి. శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-08-08T18:24:16+05:30 IST