ఉక్కిరి బిక్కిరి.. సిరిసిల్లలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-07T19:43:52+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కొవిడ్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు కలవరపరుస్తున్నాయి. గురువారం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి

ఉక్కిరి బిక్కిరి.. సిరిసిల్లలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ఒకే రోజు 148 కరోనా కేసులు 

సిరిసిల్ల అర్బన్‌లో 70 పాజిటివ్‌లు  


సిరిసిల్ల (ఆంధ్రజ్యోతి)/ముస్తాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కొవిడ్‌ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు కలవరపరుస్తున్నాయి. గురువారం జిల్లాలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 148 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా అందులో 13 ర్యాపిడ్‌ టెస్ట్‌ల ద్వారా వచ్చాయి. ముస్తాబాద్‌ మండల కేంద్రంలో 42 సంవత్సరాల పంప్‌మోటర్‌ మెకానిక్‌ కరోనా బారిన పడి మృతి చెందాడు. వారం రోజుల క్రితం జ్వరం రావడంతో సిద్ధిపేట ప్రభుత్వ అసుపత్రికి వెళ్లాడు. కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా అసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది.


దీంతో తహసీల్దార్‌తో పాటు, పలువురు రెవెన్యూ సిబ్బంది హోంక్వారెంటైన్‌కు పరిమితమయ్యారు. గురువారం వచ్చిన కేసుల్లో సిరిసిల్ల అర్బన్‌లోనే 70 మంది, వేములవాడలో 27 మంది, ఎల్లారెడ్డిపేటలో 9, ముస్తాబాద్‌లో 10, గంభీరావుపేటలో 11 మంది, తంగళ్లపల్లిలో 14 మంది, కోనరావుపేటలో ముగ్గురు, ఇల్లంతకుంటలో ముగ్గురికి, బోయినపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలోని బీజేపీ ముఖ్యనాయకుడితో పాటు పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 792 మంది కొవిడ్‌ బాధితులుగా మారారు. ఇందులో 571 మంది యాక్టివ్‌ రోగులుగా ఉండగా, 212 మంది డిశ్చార్జి అయ్యారు. పది మంది మృతి చెందారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో  భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు సిరిసిల్ల మున్సిపల్‌లో 410 మందికి కరోనా సోకగా, తంగళ్లపల్లి మండలంలో 89, కోనరావుపేటలో 28, ఇల్లంతకుంట 24, గంభీరావుపేట 30, ముస్తాబాద్‌ 35, ఎల్లారెడ్డిపేట 29, వేములవాడ 137, చందుర్తి 2, బోయినపల్లిలో 8,  మొత్తం 792 మందికి కరోనా సోకింది.


ఎల్లారెడ్డిపేటలో మరో ఏడు.. 

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలంలో మరో ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తహసీల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ప్రధాన అధికారులతో పాటు ముగ్గురు సిబ్బంది, మండల కేంద్రంలోని ఓ ప్రజాప్రతినిధి, మరో ప్రజాప్రతినిధి భర్తకు కరోనా నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-08-07T19:43:52+05:30 IST