కరోనా వచ్చిందని హోం క్వారంటైన్.. ఇంటి తాళం పగలగొట్టి మరీ పారిపోయాడు..!

ABN , First Publish Date - 2020-07-06T19:16:43+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. పల్లె, పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్ల పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో

కరోనా వచ్చిందని హోం క్వారంటైన్.. ఇంటి తాళం పగలగొట్టి మరీ పారిపోయాడు..!

విస్తరిస్తున్న మహమ్మారి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో 14 పాజిటివ్‌ కేసులు


నల్లగొండ, ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. పల్లె, పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్ల పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం 14 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 10, సూర్యాపేట జిల్లాలో మూడు, యాదాద్రి జిల్లాలో ఒక కేసు నిర్ధారణ అయింది. నల్లగొండ జిల్లాలో ఓ మహిళ కరోనాతో మృతిచెందగా, యాదాద్రి జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి హోంక్వారంటైన్‌ నుంచి పరారయ్యాడు.


మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో గాంధీ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మూడు నెలలుగా, తల్లిగారి ఊరైన చండూరు మండలం తేరట్‌పల్లి గ్రామంలో ఉంటోంది. పది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది.


యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామానికి నైజీరియా నుంచి వారం రోజుల క్రితం వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌ రాగా, అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు. అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా పంచాయతీ సిబ్బంది తాళం వేశారు. కాగా, శనివారం రాత్రి తాళాలను పగలగొట్టి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పరారయ్యాడు. అతడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


నల్లగొండ జిల్లా కేంద్రం, మిర్యాలగూడ, హాలియా, చిట్యాల, దేవరకొండ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఒకటి చొప్పున 5 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అందులో స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఒకరు, మండల కేంద్రానికి చెందిన మరొకరు ఉన్నారు.


పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మపురం పంచాయతీ, కోట్టాలగడ్డ గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. ఇతడు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయగా, అతడికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.


గుర్రంపోడు మండలంలోని కొప్పొలు గ్రామంలో ఓ యువకుడికి పాజిటివ్‌ రాగా, అతడిని చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలించారు. తెరాటిగూడెంకు చెందిన ఒకరి రిపోర్టు రావాల్సి ఉంది.


కట్టంగూరు మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. అతడిని హోంక్వారంటైన్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు.


సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చింది. ఆమె ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.


నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామంలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. గ్రామంలో రెండు రోజుల క్రితమే ఒకరికి పాజిటివ్‌ రాగా, అతడి కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతడిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్రామంలో మొత్తం రెండు పాజిటివ్‌ కేసులు నమోదవడంతో వైద్య సిబ్బంది ఆరోగ్య సర్వే నిర్వహించారు.


గరిడేపల్లి మండలంలో ఒకరికి పాజిటివ్‌ రాగా, అధికారులు హోంక్వారంటైన్‌ చేశారు.


యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓ యువకుడికి పాజిటివ్‌ వచ్చింది. అతడు దేవరకొండ మండల కేంద్రంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి జ్వరం రావడంతో ఈ నెల 3న హైదరాబాద్‌ కింగ్‌కోటి ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ పరీక్షలు చేశారు. అతడికి ఆదివారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతడి తల్లిదండ్రులను హోంక్వారంటైన్‌ చేశారు.


సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ రాగా, ఆయన కుటుంబసభ్యులు పెన్‌పహాడ్‌ మండలం సింగారెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ డబుల్‌బెడ్‌రూం ఇంటిలో నివాసం ఉంటున్నారు. దీంతో అతడి కుటుంబసభ్యులను ఇక్కడి నుంచి పంపించివేయాలని స్థానికులు ఆందోళన చేయగా, వైద్యాధికారులు వచ్చి వారిని హోంక్వారంటైన్‌ చేశారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు.


హాలియా మునిసిపాలిటీలో ఒకరు కరోనా అనుమానిత లక్షణాలతో మృతి చెందగా, 3వ వార్డు, 11వ వార్డులో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అదేవిధంగా, సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో ఓ మహిళకు పాజిటివ్‌ రాగా, పంచాయతీ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.


కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఆదివారం నుంచి ఈనెల 13వరకు జ్యూయలరీ దుకాణాలు బంద్‌ చేస్తున్నట్టు స్వర్ణకార సంఘం నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

Updated Date - 2020-07-06T19:16:43+05:30 IST