7 లక్షలు!

ABN , First Publish Date - 2020-07-07T08:03:44+05:30 IST

వరుసగా నాలుగో రోజు 20 వేలపైగా కేసులు.. ఐదు రోజుల్లోనే 1.12 లక్షలు.. మొత్తం 7 లక్షలకు చేరిన బాధితుల సంఖ్య.. దేశంలో కరోనా విజృంభణ తీరిది. ప్రపంచ జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరింది...

7 లక్షలు!

  • ఇది దేశంలో కరోనా బాధితుల సంఖ్య
  • మళ్లీ 24 వేలపైగా కేసులు నమోదు

న్యూఢిల్లీ, జూలై 6: వరుసగా నాలుగో రోజు 20 వేలపైగా కేసులు.. ఐదు రోజుల్లోనే 1.12 లక్షలు.. మొత్తం 7 లక్షలకు చేరిన బాధితుల సంఖ్య.. దేశంలో కరోనా విజృంభణ తీరిది. ప్రపంచ జాబితాలో భారత్‌ మూడో స్థానానికి చేరింది. సోమవారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో 24,248 కేసులు నమోదయ్యాయని, 425 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్యను 6,97,413గా పేర్కొంది. రాత్రికి అవి 7 లక్షలకు చేరాయి. మొత్తం 1,00,04,101 మందికి పరీక్షలు నిర్వహించినట్లు  ఐసీఎంఆర్‌ తెలిపింది. గత 14 రోజులుగా సగటున 2 లక్షల పరీక్షలు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో కొవిడ్‌కు చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్టు (34).. నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హిందీ దిన పత్రికలో పనిచేస్తున్న ఈ జర్నలిస్టుకు ఇటీవలే బ్రెయిన్‌ ట్యూమర్‌ శస్త్రచికిత్స జరిగింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో సోమవారం నుంచి మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. వారం పాటు ఇది కొనసాగనుంది.


కర్ణాటకలో 14 రోజుల హోం క్వారంటైన్‌ 

దేశంలోని ఏ రాష్ట్రం నుంచి వచ్చినా 14 రోజుల హోం క్వారంటైన్‌లో గడపాల్సిందే...అంటూ కర్ణాటక ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.  పెళ్లి, సీమంతం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న 70 మందికి కరోనా ప్రబలడంతో బాగల్కోటె జిల్లాలో వివాహాలకు బ్రేక్‌ పెడుతూ జిల్లా అధికారి ఆదేశాలు జారీ చేశారు. మండ్య ఎంపీ, ఒకప్పటి ప్రముఖ నటికి పాజిటివ్‌ ప్రబలింది. తుమకూరు జిల్లా కుణిగల్‌ ఎమ్మెల్యేకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తమిళనాడులో కొత్తగా 3,827 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయపడ్డాయి. చెన్నైలో 1,747 కేసులు వచ్చాయి. 61 మంది మృతి చెందారు. దీనితో ఇప్పటిదాకా కరోనా తాకిడికి గురైన మృతుల సంఖ్య 1571కి పెరిగింది. 


ఢిల్లీలో భారీగా తగ్గిన పాజిటివ్‌ రేటు

పరీక్షల సంఖ్యను భారీగా పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్‌ రేటు 30 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నెల రోజుల క్రితం రోజుకు 5,481 పరీక్షలు చేయగా.. ప్రస్తుతం 18 వేల పైగా జరుగుతున్నాయని పేర్కొంది. జాతీయ స్థాయి పాజిటివ్‌ రేటు కూడా తగ్గిందని.. ప్రస్తుతం అది 6.73 శాతమని తెలిపింది. పుదుచ్చేరి (5..55), ఛండీగడ్‌ (4.36), అసోం (2.84), త్రిపుర (2.72), కర్ణాటక (2.64), రాజస్థాన్‌ (2.51), గోవా (2.5), పంజాబ్‌ (1.92)లలో పాజిటివ్‌ రేటు జాతీయ స్థాయి కంటే తక్కువని వివరించింది. 


Updated Date - 2020-07-07T08:03:44+05:30 IST