కరోనా పంజా

ABN , First Publish Date - 2021-04-23T04:59:37+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో రోజురోజుకూ కొవిడ్‌ ఉధృతి పెరుగుతోంది.

కరోనా పంజా

  • రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌లు
  • నెలరోజుల్లో రెట్టింపు 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) వికారాబాద్‌ జిల్లాలో రోజురోజుకూ కొవిడ్‌ ఉధృతి పెరుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే కొవిడ్‌ కేసులు రెట్టింపయ్యాయంటే కొవిడ్‌ ఎంతవేగంగా వ్యాప్తి చెందుతున్నదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో రోజూ మూడు వేల వరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రాకపోకలను కట్టడి చేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించింది. గ్రామాల నుంచి పట్టణాలు, మండల కేంద్రాలకు రాత్రి కర్ఫ్యూతో రాకపోకలు కొంత వరకు తగ్గినా పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజూ వందల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

జిల్లాలో రెండో దశ కొవిడ్‌ ఉధృతి చాపకింద నీరులా కొనసాగుతోంది. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో పరీక్షల సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఫిబ్రవరి 1వ తేదీ వరకు జిల్లాలో నమోదైన కొవిడ్‌ పాజిటిట్‌ కేసులు 3,407 ఉండగా, ఏప్రిల్‌ 17వ తేదీ వరకు ఆ సంఖ్య 6,840కు చేరుకుందంటే కొవిడ్‌ వ్యాప్తి ఏ విధంగా కొనసాగుతోందనేది స్పష్టమవుతోంది. మార్చి 20న పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,715 ఉండగా, ఆ కేసుల సంఖ్య ఏప్రిల్‌ ఒకటిన 4,038, అదేనెల 10వ తేదీన 4,953 పాజిటివ్‌ కేసులుంటే.. 17వ తేదీ వరకు 6,840 కేసులకు పెరిగాయి. గత అయిదు రోజుల వ్యవధిలో మరో 700 వరకు పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో కొవిడ్‌ కేసులు రెట్టింపు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా నమోదైన కేసులతో సమానంగా గత నెల రోజుల్లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా నెల రోజుల కిందటి వరకు రోజుకు వెయ్యి వరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం మూడు వేల వరకు టెస్టులు చేస్తున్నారు. మార్చి 20న జిల్లాలో 134 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉండగా, నెల రోజుల వ్యవధిలో ఆ సంఖ్య 3400కు పెరిగింది.


లక్షణాలు తెలియక ఉక్కిరిబిక్కిరి..

కొవిడ్‌ అనుమానిత లక్షణాలపై స్పష్టత లేకపోవడంతో ఏ చిన్న అనారోగ్యం ఏర్పడినా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకుముందు కొవిడ్‌ సోకిన వారికి జ్వరం, జలుబు, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండేవి. రెండో దశలో కళ్లు ఎర్రగా మారి నొప్పి పెట్టడం, గొంతులో మంట, లోపలికి ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, కడుపునొప్పి వంటి లక్షణాలు ఉన్నా అనుమానించాల్సిందేనని చెబుతుండడంతో తలపట్టుకుంటున్నారు. ఏ చిన్న జ్వరం, దగ్గు వచ్చినా, జలుబు చేసినా, తలనొప్పి వచ్చినా భయపడుతున్నారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలి గానీ భయాందోళనలకు గురికావద్దని, ముందస్తు జాగ్రత్తలు, మనోధైర్యమే కొవిడ్‌ మహమ్మారికి సరైన మందని డాక్టర్లు చెబుతున్నారు. 


కేసుల వివరాలు

తేదీ          పాజిటివ్‌లు

మార్చి 20 3,715 

ఏప్రిల్‌ 17 6,840

Updated Date - 2021-04-23T04:59:37+05:30 IST