పరీక్షలపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-04-16T06:22:52+05:30 IST

కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత ఏడాది మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది.

పరీక్షలపై కరోనా పంజా

 ఈయేడు కూడా పరీక్షలు లేకుండానే ‘పది’ విద్యార్థులు పాస్‌ 

 ఇంటర్మీడియట్‌ పరీక్షలు జూన్‌కు వాయిదా 

 విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 15: కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత ఏడాది మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో పరీక్షలు నిర్వహించకుండానే 2019-20 విద్యాసంవత్సరంలో 10, 12వ ఆపై తరగతుల విద్యార్థులందరిని పాస్‌ చేశారు. కరోనా తీవ్రత సెప్టెంబర్‌లో కొంత తగ్గడంతో 2020-21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించి ఆన్‌లైన్‌ ద్వారా తరగతులను నిర్వహించారు. క్రమేపి కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో 9,10 ఆపై తరగతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో 2021 ఫిబ్రవరి1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించారు. అయితే హాజరుశాతం తప్పనిసరికాదని, విద్యార్థులు నేరుగా లేదా ఇళ్ళలోనే  ఆన్‌లైన్‌ ద్వారా చదువుకొని పరీక్షలకు హాజరుకావచ్చని ప్రభుత్వం ప్రకటించింది.   ఏప్రిల్‌, మే మాసాల్లో వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే మళ్ళీ గత సంవత్సరం మాదిరిగానే ఈయేడు కూడా మార్చి చివరి వారం నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ విశ్వరూపాన్ని చూపుతోంది. దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు భారీగా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ టెన్త్‌, ప్లస్‌ 2పరీక్షలను వాయిదా వేయగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరీక్షలపై ఇదే నిర్ణయాన్ని తీసుకున్నది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టువ్‌ విధానం ద్వారా ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని, అయితే కొవిడ్‌ తీవ్రత తగ్గిన తర్వాతనే పరీక్షలకు అవకాశమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  జిల్లాలో ప్రసుత్త విద్యా సంవత్సరం 2020-21లో 13,312 మంది రెగ్యులర్‌, 59 మంది ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించారు.  వీరందరూ ఉత్తీర్ణులైనట్లే. అయితే గత ఏడాది విద్యాసంవత్సరంలో మార్చి 16వ తేదీ వరకు విద్యాబోధన జరుగగా, ఈసారి ఆన్‌లైన్‌తోపాటు ప్రత్యక్ష బోధనను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించినా విద్యాసంవత్సరం ఆరంభం నుంచి ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కి అన్న చందంగా సాగింది. కరోనాతో రెండేళ్ళుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్‌ చేయడంతో విద్యార్థులకు భవిష్యత్‌లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇక  మే మొదటి వారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించగా వాటిని కూడా జూన్‌ మాసానికి వాయిదా వేశారు. అయితే ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ఈయర్‌ పరీక్షలు లేకుండానే సెకండ్‌ ఈయర్‌కు ప్రమోట్‌ చేస్తామని ప్రకటించడంతో సెకండ్‌ ఈయర్‌ పరీక్షలు కూడా జరుగుతాయో లేదోయోనన్న అయోమయంలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. 

 

Updated Date - 2021-04-16T06:22:52+05:30 IST