‘కరోనా’ మృతదేహం కుక్కల పాలు.. అధికారులు ఏం చెప్తున్నారంటే..

ABN , First Publish Date - 2020-07-06T18:25:37+05:30 IST

కరోనా కాలంలో మానవత్వం మంటగలుస్తోంది. కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన వారిని వారి కుటుంబీకులు కనీసం చూడలేని దుస్థితి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు

‘కరోనా’ మృతదేహం కుక్కల పాలు.. అధికారులు ఏం చెప్తున్నారంటే..

పూర్తిగా కాలేవరకు ఉండని సిబ్బంది


అమీర్‌పేట/హైదరాబాద్‌ సిటీ  (ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో మానవత్వం మంటగలుస్తోంది. కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించిన వారిని వారి కుటుంబీకులు కనీసం చూడలేని దుస్థితి. కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులకు అనుమతి లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. దీంతో సరిగ్గా కాలని మృతదేహాలు కుక్కల పాలవుతున్నాయి. కుటుంబ సభ్యులు మరుసటి రోజు వచ్చేసరికి మృతదేహ భాగాలను కుక్కలు పీక్కు తింటుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో చనిపోయిన వారికి దహనసంస్కారాలు సరిగ్గా చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. 


వృద్ధుడి మృతదేహాన్ని..

కింగ్‌కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు శుక్రవారం మృతి చెందాడు. మృత దేహాన్ని భద్రపర్చడానికి అక్కడ ఫ్రీజర్‌ సౌకర్యం లేదు. దీంతో ఈ మృతదేహాన్ని తీసుకుపోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అదే రాత్రి ఈఎ్‌సఐ హరిశ్చంద్ర శ్మశాన వాటికకు తరలించారు. ఆ మృతదేహాన్ని శ్మశాన వాటికలో షెల్టర్‌ కింద కాకుండా మరో చోట చితిపేర్చి దహనం చేశారు. రాత్రి సమయం కావడంతో సిబ్బంది ఇంటికి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం తాత అస్థికల కోసం శ్మశాన వాటికకు  మనవడు వచ్చి చూడగా సగం కాలినట్లు గమనించారు. మృతదేహ భాగాలను కుక్కలు పీక్కుతినడం గమనించి ఆవేదన చెందాడు. వెంటనే దానిని వీడియో తీసి వైరల్‌ చేశాడు. ఈ విషయంలో తప్పు మాది కాదంటే మాది కాదు అంటూ జీహెచ్‌ఎంసీ, శ్మశాన వాటిక నిర్వాహకులు చెబుతున్నారు.


ప్రత్యేక ఏర్పాట్లు

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను జీహెచ్‌ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకుని శ్మశానవాటికకు తరలించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బందితో దహనసంస్కారాలు చేయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఒక్కో మృతదేహానికి రూ.18,000లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది మొదలు పీపీఈ కిట్లు, రవాణా చార్జీలు, చితికి కట్టెలు, డీజిల్‌ కోసం వీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈఎ్‌సఐ శ్మశానవాటికకు నగరంలోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రులలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తీసుకొచ్చి దహనం చేస్తున్నారు. 


వర్షం కారణంగా...

శుక్రవారం 18 మృతదేహాలను దహనం చేశాం. ఒక్కో శవం కాలేందుకు సూమారు 4గంటల సమయం పడుతోంది. మృతదేహాలను దహనం చేసేందుకు అవసరమైనన్ని  దిమ్మెలు లేకపోవడంతో రాత్రి 8-30 గంటలకు చివరి మృతదేహానికి నేలపై చితిని పేర్చి దహనం చేశాం. రెండు గంటల తర్వాత కురిసిన భారీ వర్షానికి చితి చల్లారుతుండగా 20 లీటర్ల డీజిల్‌ చల్లి మంట పెట్టి వెళ్లిపోయాం. మళ్లీ కురిసిన వర్షానికి మృతదేహంలోని కొద్ది భాగం కాలకుండా ఉండిపోయింది. మర్నాడు ఉదయం 8.40 ప్రాంతంలో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే ఉదయం 8 గంటల సమయంలో కొందరు వచ్చి వీడియో తీసుకుని వెళ్లార ని తెలిసింది. అక్కడే కాలకుండా మిగిలి ఉన్న శరీర భాగాలను వెంటనే తీసి దహ నం చేశాం. ఎలక్ట్రికల్‌ మిషన్‌లో క్రిమియేషన్‌ చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవు.

- రవీందర్‌గౌడ్‌ ఏఎంహెచ్‌ఓ, సికింద్రాబాద్‌


జీహెచ్‌ఎంసీ అధికారులదే బాధ్యత

కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ తరఫున 8 నుంచి 9 మంది పనిచేస్తున్నారు. రోజు వారీగా వచ్చే మృతదేహాలకు వారే అంత్యక్రియలు నిర్వహించుకుంటారు. మొన్న రాత్రి ఒంటి గంట వరకు శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. జోరుగా వర్షం రావడంతో చితి మంటలు చల్లారి ఇలా జరిగి ఉండవచ్చు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఉదయం వచ్చి పరిస్థితి చక్కదిద్దేలోపు ఎవరో వచ్చి వీడియోలు తీసి వైరల్‌ చేశారు.  

- గోపాలకృష్ణ, శ్మశాన వాటికి ఇన్‌చార్జ్‌


Updated Date - 2020-07-06T18:25:37+05:30 IST