కరోనా తగ్గుముఖం

ABN , First Publish Date - 2021-02-22T06:03:27+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఉధృతి యాదాద్రి భువనగిరి జిల్లాలో తగ్గినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రుల్లో రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు.

కరోనా తగ్గుముఖం

20 రోజులుగా యాదాద్రి జిల్లాలో 27 పాజిటివ్‌ కేసులే 

ఐదు రోజులపాటు 10లోపు కేసులు

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ 


భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 21: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ఉధృతి యాదాద్రి భువనగిరి జిల్లాలో తగ్గినట్లు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 19 పీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రుల్లో రాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఎంపిక చేసిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. అయితే 20 రోజులుగా జిల్లాలో కేవలం 27 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదు రోజులపాటు 10లోపు కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా ప్రభావం తగ్గినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు జిల్లా ఆస్పత్రి, బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ఐసోలేషన్‌ వార్డులను అందుబాటులో ఉంచారు. 


పూర్తికానున్న రెండో విడత వ్యాక్సినేషన్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు మొదటి విడత వ్యాక్సినేషన్‌ మొదటి డోస్‌ పూర్తికాగా, రెండో డోస్‌ సోమవారంతో పూర్తి కానుంది. రెండో విడత మొదటి డోస్‌ పూర్తి కాగా, రెండో డోస్‌ మరోవారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా పేర్కొంటున్న 8,453 మందికి 6,827 మంది టీకా తీసుకోగా, మిగతా వారు విముకత చూపారు. దీంతో 80శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 2,800 మంది ప్రభుత్వ వైద్య, ఐసీడీఎస్‌ సిబ్బందికి 2,620 మంది ఆసక్తి చూపారు. అలాగే మొదటి విడతలో 603 ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి 250 మంది టీకా తీసుకోగా రెండో డోస్‌ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అలాగే రెండో విడతలో 4,800 మంది మునిసిపల్‌, రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌ సిబ్బందికి కేవలం 1,204 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. వీరికి రెండో డోస్‌ మరో వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు సిబ్బంది తెలిపారు.


ఇప్పటివరకు 97వేల కరోనా టెస్టులు 

యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 97వేల కరోనా పరీక్షలు నిర్వహించగా సుమారు 9,860 పాజిటివ్‌గా తేలింది. అయితే ఇప్పటివరకు 9,736 మంది డిశ్చార్జి కాగా, 87మంది మృత్యువాత పడ్డారు. మరో 35 యాక్టివ్‌ కేసులు జిల్లాలో ఉన్నాయి. అయితే హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నవారు, పాజిటివ్‌గా తేలిన బాధితులు సుమారు వెయ్యి మంది వరకు ఉంటారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా వైద్య చికిత్సల అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతనెల 21వ తేదీకి 4,554 మంది పాజిటివ్‌తో బాధపడుతుండగా, ఈనెల 21వ తేదీ వరకు కోలుకొని ఆ సంఖ్య 169కి చేరింది.  ఈ నెల మొదటి వారం నుంచి రోజుకు 15 చొప్పున పాటిజివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య పెరిగి, పాజిటివ్‌ కేసులు తగ్గుతుండడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.


కొవిడ్‌ తగ్గినా నిబంధనలు మరవద్దు  : డాక్టర్‌ సాంబ శివరావు, డీఎంహెచ్‌వో, యాదాద్రి భువనగిరి జిల్లా

జిల్లాలో కొవిడ్‌ ఉధృతి గణనీయంగా తగ్గిం ది.లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్‌ కొనసాగిస్తున్నాం. ఎంపిక చేసిన వారంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. అయితే కరోనా తగ్గిందని, వ్యాక్సిన్‌ వచ్చిందని   నిర్లక్ష్యం చూపొద్దు. యథావిధిగా మాస్కులు ధరించాలి. సా మూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ఏ మాత్రం అలసత్వం చూపినాకరోనా విజృంభించే ప్రమాదం ఉన్నది.  


Updated Date - 2021-02-22T06:03:27+05:30 IST