కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం?!

ABN , First Publish Date - 2021-05-09T08:35:35+05:30 IST

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిరేటు స్థిరత్వానికి చేరుకుందా ...

కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం?!

  • ప్రైవేటు పరీక్షా కేంద్రాల శాంపిళ్లలో.. 20 శాతమే ‘పాజిటివిటీ’
  • పదిహేను రోజుల క్రితం 30 శాతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 
  • ప్రస్తుత వ్యాప్తిరేటు 7.57 శాతమే
  • జనసంచారం తగ్గడమే కారణమా 
  • లేక కేసుల తగ్గుదల మొదలైందా?


హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిరేటు స్థిరత్వానికి చేరుకుందా? గత పది రోజులుగా కేసుల పెరుగుదల ఒకే విధంగా ఉందా? ప్రైవేటులోనూ టెస్టుల కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిందా? కేసులు తగ్గుముఖం పట్టాయా? పడకల కోసం ఎంక్వైరీలు తగ్గాయా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయు. రాష్ట్రంలో వారం, పది రోజులుగా కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల లేదు. కేసుల సంఖ్య సగటున ఒకే స్థాయిలో ఉంటోంది. అలాగే ఏప్రిల్‌ మూడో వారం వరకు టెస్టుల కోసం ప్రజలు క్యూ కట్టారు. ప్రస్తుతం పరీక్షలకు వచ్చేవారి సంఖ్య కూడా 15 రోజుల కిందటితో పోలిస్తే తగ్గింది.


ల్యాబ్‌ల నిర్వాహకుల మాట.. 

హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 62 ప్రైవేటు కొవిడ్‌ పరీక్షా కేంద్రాల్లో ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు.  ఓ మూడు, నాలుగు ల్యాబ్‌లకు ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారు. ఏప్రిల్‌ మూడో వారం వరకు కొవిడ్‌ అనుమానితులు ల్యాబ్‌ల వద్ద క్యూ కట్టారు. ప్రస్తుతం ఆ స్థాయిలో రద్దీ లేదని ఓ ల్యాబ్‌ యాజమాన్యం వెల్లడించింది. పదిహేను రోజుల క్రితం వరకు  ఓ ప్రముఖ ల్యాబ్‌కు రోజూ 5500-6000 మంది కొవిడ్‌ పరీక్షల కోసం వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గి 4000-4200కు చేరిందని ఆ ల్యాబ్‌ నిర్వాహకులు తెలిపారు. ఇక కొవిడ్‌-19 ‘పాజిటివిటీ’ రేటు కూడా పదిహేను రోజుల క్రితం 30 వరకు వచ్చేదని, ప్రస్తుతం ఆ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రోజువారీ వచ్చే నమూనాల్లో 20 శాతమే వ్యాప్తి రేటు ఉంటోందని తెలిపారు. అంటే టెస్టు చేయించుకునే ప్రతి 100 మందిలో 20 మందికే కొవిడ్‌ పాజిటివ్‌ వస్తోంది. నగరంలోని మరో ప్రముఖ ల్యాబ్‌లోనూ దాదాపు ఇదే విధమైన పరిస్థితి. 


సర్కారీ లెక్కల్లోనూ తగ్గుదల

వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న గణాంకాల ప్రకారం కూడా కరోనా వ్యాప్తిరేటు స్థిరంగానే ఉంటోంది. భారీగా తగ్గుదల లేకపోయినప్పటికీ పదిరోజుల కిందటితో పోలిస్తే ప్రస్తుతం తగ్గింది. ఏప్రిల్‌ 26న రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఆ రోజు ఏకంగా 10,122 మందికి పాజిటివ్‌ రాగా, వ్యాప్తిరేటు (పాజిటివిటీ) 10.15గా నమోదైంది. ఇది ఏప్రిల్‌ 30 నాటికి 9.94కు, మే 8 నాటికి 7.57కు తగ్గడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్రంలోని కొన్ని సరిహద్దు జిల్లాల్లో ఏప్రిల్‌ రెండో వారం వరకు ఉన్న స్థాయిలో కేసులు ఇప్పుడు లేవని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఉదాహరణకు వైర్‌సకు హాట్‌స్పాట్‌గా నిలిచిన ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో ఏప్రిల్‌ రెండోవారం నాటికి ప్రతిరోజు సగటున 6500-6600 మందికి టెస్టులు చేయగా, నాడు పాజిటివిటీ రేటు 27.27గా వచ్చింది. అంటే టెస్టు చేసుకున్న ప్రతి 100 మందిలో 27 మందికి ఇన్ఫెక్షన్‌ నిర్ధారణ అయింది. తాజాగా శనివారం ఆ జిల్లాల్లో 1,972 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 254 పాజిటివ్‌లే వచ్చాయి. వ్యాప్తి రేటు 12.88గా నమోదైంది. వాస్తవానికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు తగ్గితే పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతుంది. కానీ ఇక్కడ టెస్టులు తగ్గినప్పటికీ పాజిటివిటీ రేటు పెరగలేదు. అయితే కేసులు భారీ సంఖ్యలో ఉంటే టెస్టులు తగ్గినా వ్యాప్తిరేటు (పాజిటివిటీ) ఎక్కువగానే ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి లేదని, కొద్ది రోజులుగా స్థిరంగానే కేసులు వస్తున్నాయని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. అలాగే జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొవిడ్‌ వార్డుల్లోని ఖాళీ పడకల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం కూడా కేసుల్లో తగ్గుదలతో పాటు రికవరీల సంఖ్య పెరగడం, యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య గత వారం రోజులుగా తగ్గడం కనిపిస్తోంది.


పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు తగ్గడంతో.. 

తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌లలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మనకు మధ్య రాకపోకలు తగ్గాయి. దీంతో ప్రజల కదలికలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. దానివల్ల కూడా కేసుల పెరుగుదలలో స్థిరత్వం ఉన్నట్లు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొన్ని గ్రామాలు, పట్టణాలు స్వీయకఠిన ఆంక్షలు విధించుకుంటున్నాయి. అవసరమైతేనే జనం బయటకు వస్తున్నారు. బహుశా ఈ కారణాల వల్ల కూడా కేసులు మరింత పెరగకుండా ఉండటానికి కారణంగా చెబుతున్నారు. మున్ముందూ ప్రజలు ఇలాగే  నిబంధలు పాటిస్తే.. కేసులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది.

Updated Date - 2021-05-09T08:35:35+05:30 IST