అవగాహనతోనే కరోనా దూరం

ABN , First Publish Date - 2021-04-18T04:56:24+05:30 IST

అవగాహనతోనే కరోనా దూరం చేయొచ్చని సీఐ లక్ష్మణరావు తెలిపారు. శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు.కరోనాపై అప్ర మత్తంగా ఉండాలని సూచించారు.

అవగాహనతోనే కరోనా దూరం
తెర్లాం: కరోనా నిబంధనలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్‌ఐ, ఉపాధ్యాయులు

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 17 : అవగాహనతోనే కరోనా దూరం చేయొచ్చని  సీఐ లక్ష్మణరావు తెలిపారు.  శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు.కరోనాపై  అప్ర మత్తంగా ఉండాలని  సూచించారు.   రెండో దశ కరోనా విస్తృతంగా వ్యాపి స్తున్న తరుణంలో అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలన్నారు.  విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.  శానిటైజర్‌తో చేతులను శుభ్రం  చేసుకోవాలన్నారు.  కరోనా వ్యాధి తీవ్రత గురించి ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. కరోనా కట్టడిలో యువజన సంఘాలు, స్వచ్ఛంద  సంస్థలు  భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.   కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ కళాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

 జాగ్రత్తలతో రక్షణ

భోగాపురం: కొవిడ్‌పై ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యానికి రక్షణ పొందగలుగుతామని ఎస్‌ఐ యు.మహేష్‌ అన్నారు. సుందరపేట జంక్షన్‌ జాతీయ రహదారి కూడలిపై వాహనచోదకులకు ఆయన శనివారం కొవిడ్‌- 19పై అవగాహన కల్పించారు. కొవిడ్‌ చాలా వేగంగా విస్తరిస్తోందని, దీని నుంచి రక్షణ పొందాలంటే అనవసరంగా బయటకు రాకూడదని, మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

 అప్రమత్తత తప్పనిసరి 

రామభద్రపురం: కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సాలూరు సీఐ టి.అప్పలనాయుడు సూచించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం రామభద్రపురం బైపాస్‌ రోడ్డులో వాహన దారులకు అవగాహన కల్పించారు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని,  ఎక్కువ మంది గుంపుగా ఉండరాదని తెలిపారు.   వైద్య సిబ్బంది సూచనల మేరకు ప్రతిఒక్కరూ  టీకాలు వేయించు కోవాలన్నారు.  అనంతరం మాస్కు లేకుండా ప్రయాణం చేసేవారికి మాస్కు ఆవశ్యకతను వివరించారు.  ఎస్‌ఐ  కృష్ణమూర్తి, హెచ్‌సీ నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు మట్టయ్య, ప్రసాద్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.   స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు శనివారం ఎస్‌ఐ కృష్ణమూర్తి   కరోనా నివారణపై అవగాహన కల్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు. 

‘మన చేతిలోనే.. మన ఆరోగ్యం’

తెర్లాం: స్థానిక జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు శనివారం ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ కరోనా నివారణపై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ‘మనచేతిలోనే మన ఆరోగ్యం’ ఉందని తెలిపారు. నిర్లక్ష్యం పనికిరాదని.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సిబ్బంది ఈశ్వరరావు పాల్గొన్నారు. 

పాఠశాలలో కరోనా పరీక్షలు  

సీతానగరం: సీతానగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు శనివారం వైద్యాధికారి టి.జగన్మోహన్‌ ఆధ్వర్యంలో  కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.  మొత్తం 52 మందికి పరీక్షలు చేయగా, నమూనాలను  విజయనగరం కొవిడ్‌ ల్యాబ్‌కు పంపించారు.  హెచ్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్లు  హరికృష్ణ, చంద్రనాయుడు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఆలస్యంగా ఫలితాలు 

బాడంగి: మండలంలోని వాడాడ, బాడంగి పీహెచ్‌సీ పరిధిలోని  పలు గ్రామాల్లో కరోనా పరీక్షలు ముమ్మరంగా జరిపిస్తున్నారు.  అయితే ఆ నమూనాలను బొబ్బిలి నుంచి పార్వతీపురం పంపిస్తున్నారు. దీంతో రిపోర్టులు వచ్చేసరికి వారంరోజులు గడిచిపోతోంది.  ఈ లోగా పల్లెల్లో కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. దీనిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొవిడ్‌ టెస్ట్‌ ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. 


 

Updated Date - 2021-04-18T04:56:24+05:30 IST