కరోనా కలవరం

ABN , First Publish Date - 2022-01-10T05:27:57+05:30 IST

కరోనా థర్డ్‌ వేవ్‌ విస్తరిస్తోందన్న కలవరం సర్వత్రా నెలకొంది. నాలుగు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు దేశం, రాష్ట్రంలో కూడా కొవిడ్‌ కేసులు అధిక సంఖ్యలో బయటపడుతుండడంతో సర్వత్రా అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనా కలవరం

జిల్లాలో పెరుగుతున్న కేసులు

జాగ్రత్తలు అత్యవసరమంటున్న వైద్యులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 9 :కరోనా థర్డ్‌ వేవ్‌ విస్తరిస్తోందన్న కలవరం సర్వత్రా నెలకొంది. నాలుగు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు దేశం, రాష్ట్రంలో కూడా కొవిడ్‌ కేసులు అధిక సంఖ్యలో బయటపడుతుండడంతో సర్వత్రా అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. 

కరోనా విజృంభణతో జిల్లాలో దాదాపు రెండేళ్లుగా విద్య, వ్యాపార, ఉపాధి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కొన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం 650 మంది విగతజీవులుగా మారారు. లెక్కకు రాని మరణాల సంఖ్య మరో వందకు పైగా ఉండొచ్చుననే అంచనాలు ఉన్నాయి. కరోనా సెకెండ్‌ వేవ్‌ తీవ్రంగా ప్రభావం చూపింది. ఆస్పత్రులు కిటకిటలాడాయి. ఒకానొక దశలో ఆక్సిజన అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలో థర్డ్‌వేవ్‌ వచ్చిందో రాలేదో ఇంకా పూర్తిగా నిర్ధారించలేకపోయినప్పటికీ కేసులు రోజురోజుకూ పెరుగుతుం డడంతో ప్రజలు మళ్లీ పాత రోజుల్లా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. భౌతిక దూరం పాటించడం.. మాస్క్‌ను ధరించడం.. చేతులను పరిశుభంగ్రా ఉంచుకోవడం.. శానిటైజర్‌ వాడడం అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. 

జిల్లాలో ఇటీవల కొత్తవలసలో ఎక్కువ సంఖ్యలో కేసులు వచ్చాయి. అందులోనూ విద్యార్థులకు వైరస్‌ ప్రబలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తర్వాత గరుగుబిల్లిలో మరో 11 మంది విధ్యార్థులకు కరోనా సోకింది. గడిచిన నాలుగు  రోజులుగా 39, 49, 36, 83 సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లోనూ టెన్షన మొదలైంది. మరో నాలుగు రోజుల్లో పండగ రానుంది. అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పండగకు సంబంధించి వసా్త్రలు, కిరాణా ఇతరత్రా వస్తువుల కొనుగోలుతో దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం ఎంతగా చెబుతున్నా వ్యాపారులు, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో సైతం ఇదే మాదిరిగా ప్రజలు సంచరిస్తున్నారు. గతాన్ని గుర్తించి వర్తమానంలో ప్రాణ నష్టం కలగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అధికారులు సభలు, సమావేశాలు నిషేధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. బస్సులు, క్యాబ్‌, అటోల్లో ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలు అధికారులు విడుదల చేయాల్సి ఉంది. 

రామభద్రపురంలో ముగ్గురికి కరోనా

రామభద్రపురం: మండల కేంద్రంలోని ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దిలీప్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. మట్టి పని కోసం గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు కూలీలకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  మరో స్థానిక వ్యక్తికి కూడా కరోనా ప్రబలింది. ముగ్గురిని హోం ఐసోలేషన్‌లో ఉంచి మందులు అందిస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం సుదూర ప్రాంతాల నుంచి గ్రామాలకు వస్తున్న వారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 

11 మంది విద్యార్థులకు కరోనా

గరుగుబిల్లి: మండలంలోని ఓ గ్రామంలో కరోనా కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న  36 మంది విద్యార్థులకు ఈ నెల 7న కొవిడ్‌  పరీక్షలు నిర్వహించారు. తాజాగా శనివారం రాత్రి ఆ ఫలితాలు వచ్చాయి. 11 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీనిపై ఎంఈవో ఎన.నాగభూషణరావు ఆ పాఠశాల విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఆదివారం వైద్యాధికారి కె.అరుణకుమారి కూడా గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించారు. వారి తల్లిదండ్రులకు కూడా పరీక్షలు నిర్వహించారు.

కరోనా కట్టడికి సహకరించాలి

పండగ కంటే ప్రాణాలు ముఖ్యం. కరోనా కట్టడి బాధ్యత అధికారులు, ప్రభుత్వానిదేకాదు వైరస్‌ విస్తరించకుండా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలి. చదువులు, ఉద్యోగాలు, కూలి పనుల కోసం రాష్ట్రలు, జిల్లాలు దాటి వెళ్లిన వారు తిరిగి విజయనగరం వస్తే గనుక నలుగురిలో సంచరించకుండా నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ఉంటే తోటి ప్రజలకు మంచిది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల యువత తప్పకుండా వ్యాక్సిన వేసుకోవాలి. కేసుల పెరుగుదలపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారు. నోడల్‌ అధికారులను కూడా నియమించాం. ఇంకా కేసులొస్తే రైతుబజార్లు, మార్కెట్‌, ఇతర రద్దీ ప్రాంతాలపై దృష్టి సారిస్తాం.

- ఎ.సూర్యకుమారి, కలెక్టర్‌ 



Updated Date - 2022-01-10T05:27:57+05:30 IST