కరోనా కలవరం..!

ABN , First Publish Date - 2022-01-21T06:50:51+05:30 IST

కరోనా సునామీ కలవరపెడుతోంది. వైరస్‌ రోజురోజుకీ విరుచుకుపడుతోంది. భారీగా జనం మహమ్మారి బారిన పడుతున్నారు.

కరోనా కలవరం..!

20 రోజులు... 4243 కేసులు

గురువారం ఒక్కరోజే 951 మందికి నిర్ధారణ

భారీగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు

పసిపిల్లలనూ వదలని వైరస్‌

నెలల చిన్నారులకు పాజిటివ్‌

జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఐసీయూలో చికిత్స

అనంతలో టెన్షన

అనంతపురం వైద్యం, జనవరి20: కరోనా సునామీ కలవరపెడుతోంది. వైరస్‌ రోజురోజుకీ విరుచుకుపడుతోంది. భారీగా జనం మహమ్మారి బారిన పడుతున్నారు. పాజిటివ్‌ బాధితులు అమాంతం పెరిగిపోతున్నారు. ఈనెలారంభం నుంచే వైరస్‌ బెంబేలెత్తిస్తోంది. అప్పటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఒక్కసారిగా వందలకు చేరిపోయాయి. ఈనెల 1 నుంచి 20వతేదీ వరకు పరిశీలిస్తే ఈ 20 రోజుల్లోనే జిల్లాలో 4243 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 951 మంది వైరస్‌ బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు 162509 మంది మహమ్మారికి చిక్కగా.. 158122 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1093 మంది మరణించగా.. ప్రస్తుతం జిల్లాలో 3294 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. థర్డ్‌వేవ్‌ దడ పుట్టిస్తోంది. నగరం, పట్టణం, పల్లె, కాలనీలు అనే తేడాలేకుండా వైరస్‌ పాకిపోయింది. జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వీటిలో సగానికిపైగా అనంత నగరంలోనే ఉంటుండడం ఆందోళన రేపుతోంది. ఆ తర్వాత హిందూపురం, కదిరి, ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుత్తి, తాడిపత్రి, గుంతకల్లు మున్సిపాలటీల్లో కేసులు వస్తున్నాయి. కొన్ని మండలాలోనూ వైరస్‌ ప్రభావం అధికంగానే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో జనం విలవిల్లాడిపోతున్నారు. కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని వైద్యశాఖ వర్గాలే చెబుతున్నాయి. అందరూ పరీక్షలు చేయించుకుంటే రోజూ వేలల్లోనే కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. దీనిని బట్టే జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


పసిపిల్లలనూ వదలని వైరస్‌

కరోనా వైరస్‌ పసిపిల్లలను కూడా వదలడం లేదు. జిల్లాలో ఇప్పటికే పాఠశాలలు తెరవడంతో అనేకమంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. చివరకు నెలల చిన్నారులు సైతం వైర్‌సకు చిక్కి విలవిల్లాడుతున్నారు. జిల్లా సర్వజనాస్పత్రికి తాడిమర్రి మండలం, దాడితోటకు చెందిన 8 నెలల చిన్నారి, పెద్దపప్పూరుకు చెందిన ఏడు నెలల చిన్నారిని జ్వరం వస్తుందని వారి కుటుంబికులు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ కరోనా పరీక్షలు చేయడంతో గురువారం ఆ పిల్లలకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఆ పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. వైద్యులు.. నెలల చిన్నారులను కొవిడ్‌ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుటగానే ఉందని వైద్యులు చెబుతున్నా.. కుటుంబ సభ్యులు మాత్రం కొవిడ్‌ సెంటర్‌ వద్ద టెన్షనతోనే గడుపుతున్నారు.

Updated Date - 2022-01-21T06:50:51+05:30 IST