కరోనా భయంతో.. ఒకేసారి ప్రాణాలొదిలిన భార్యాభర్తలు

ABN , First Publish Date - 2020-09-23T18:35:15+05:30 IST

కళ్లెదుటే భర్త కన్నుమూయడం చూసిన ఆ భార్య.. నీ వెంటే నేనంటూ..

కరోనా భయంతో.. ఒకేసారి ప్రాణాలొదిలిన భార్యాభర్తలు

పెద్దతిప్పసముద్రం(చిత్తూరు): కళ్లెదుటే భర్త కన్నుమూయడం చూసిన ఆ భార్య.. నీ వెంటే నేనంటూ తనువు చాలించింది. మంగళవారం పెద్దతిప్పసముద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ....పెద్దతిప్పసముద్రానికి చెందిన కొచ్చెరువు హమీద్‌సాబ్‌(72), సైదానీబీ(66) దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. నాలుగు రోజులుగా వీరిద్దరికీ కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వాస్పత్రిలో శ్వాబ్‌ పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరికీ పాజిటివ్‌ అని తెలియడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో 108 వాహనం ఇంటి వద్దకు వచ్చింది. వాహనం ఎక్కేందుకు హమీద్‌సాబ్‌ నిరాకరిస్తూ ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకుని కుప్పకూలిపోయారు.


108 సిబ్బంది, కుటుంబీకుల సాయంతో ఆయన్ను, సైదానీబీని బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న మరో 108 వాహనంలోకి హమీద్‌సాబ్‌ను మార్చి మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. కాగా, బి.కొత్తకోటలోనే భర్త మృతి చెందినా వైద్యులు ధృవీకరించ లేదని అనుమానించిన సైదానీబీ బాగా కుంగిపోయారు. మరో వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె కూడా మృతి చెందారు. మదనపల్లె ఆస్పత్రికి చేరుకున్న సైదానీబీని స్ట్రెచర్‌ మీద ఉండగానే వైద్యులు పరీక్షించి ఆమె మృతిచెందినట్లు పేర్కొన్నారు.


దీంతో వీరి బంధువులు మరో వాహనంలో మృతదేహాలను పెద్దతిప్పసముద్రానికి తరలించారు. శవాలను గ్రామ సమీపంలోని శ్మశాన వాటిక వద్దే ఉంచి, ఎక్స్‌కవేటర్‌ సాయంతో అంత్యక్రియలు పూర్తి చేయించారు.  

Updated Date - 2020-09-23T18:35:15+05:30 IST