జీవితాలు.. చిందరవందర

ABN , First Publish Date - 2020-11-08T13:51:34+05:30 IST

గుక్కపెట్టి ఏడ్వడానికి కంట్లో చుక్కనీరు..

జీవితాలు.. చిందరవందర

బతుకు చిత్రం.. జీవనం ఛిద్రం

కరోనాతో మారిన పేద, మధ్య తర‘గతులు’

కుదుటపడని బతుకులు

అన్‌లాక్‌లోనూ మారని స్థితిగతులు

పనుల్లేక, జీతాలు అందక అవస్థలమయం

వ్యాపారాలూ అంతంతమాత్రమే

వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూపులు

ఆ తరువాత కోలుకోవడమూ కష్టమే..


ఆంధ్రజ్యోతి, విజయవాడ: గుక్కపెట్టి ఏడ్వడానికి కంట్లో చుక్కనీరు లేదు. ఏడ్చీఏడ్చీ నీళ్లన్నీ ఇంకిపోయాయి. గట్టిగా అరుద్దామనుకుంటే గొంతు పైకి పెగలట్లేదు. బాధలు దిగమింగి మింగి ఆవిరైపోయింది. ‘మేమేం పాపం చేశాం దేవుడా..’ అని భగవంతుడిని నిలదీయాలనుంది. కానీ అంత సత్తువ లేకపోయింది. కనికరం లేని కరోనా ఒకరి తరువాత ఒకరిని కాటు వేస్తుంటే.. కనీస ఆదాయం లేక జీవనం దుర్భరంగా మారి బతకలేక బతుకుతున్న పేద, మధ్యతరగతి బతుకుల దీనవ్యథ ఇది. పనుల్లేక, కూలీ అందక, ఉద్యోగాలు పోయి జీతాలు రాక, పూట గడవక, పొట్టనిండక ఆకలి రాజ్యంలో అవశాన దశలో ఉన్న జీవితాల కన్నీటి గాథలివి. అన్‌లాక్‌ కోసం ఆశగా ఎదురుచూస్తే.. ఆశ తీరకపోగా కష్టాల కుంపట్లో కాలిపోతున్న ఈ దుర్భర జీవితాలు మారేదెన్నడో.. మాయదారి కరోనా మాయమయ్యేదెన్నటికో..!


కష్టాల్లో చిరు వ్యాపారులు

సిగరెట్లు, బిస్కెట్ల వ్యాపారం ఒకరిది. టీ స్టాల్‌ మరొకరిది. పండ్ల వ్యాపారం ఇంకొకరిది. మిగిలిన వ్యాపారాల్లో కాస్తోకూస్తో అమ్మకాలు కనిపించినా ఈ చిరు వ్యాపారాల్లో మాత్రం అమ్మకాలు అంతగా లేవు. టీ స్టాల్‌ వద్దకు నలుగురు వెళ్తే, అందులో ఒక్కరే టీ తాగుతున్నారు. మిగిలిన ముగ్గురూ కరోనా భయంతో ఆ గ్లాసులను పట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. చిన్నపిల్లల బిళ్లలు, బిస్కెట్లు, సిగరెట్లు అమ్ముకునే వ్యాపారులదీ ఇదే పరిస్థితి. పిల్లలు ఎవరూ బడ్డీకొట్ల వద్దకు రావడం మానేశారు. సిగరెట్‌ ప్యాక్‌లు కొనడానికి పొగప్రియులు అతి స్వల్పంగా వస్తున్నారు. జ్యూస్‌ దుకాణదారులు కొనుగోలు చేసిన ఐస్‌ మొత్తం వృథాగా కరిగిపోతోంది. వాతావరణంతో సంబంధం లేకుండా నాడు కూలింగ్‌ జ్యూస్‌లను నగరవాసులు అధికంగా తాగేవారు. ఇప్పుడు తాగుతున్న కొద్దిమందీ ఐస్‌లెస్‌ జ్యూస్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పట్లో తమ వ్యాపారాలు కోలుకుంటాయన్న నమ్మకం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు చిరు వ్యాపారులు.


పిలుపులేని ప్రైవేట్‌ టీచర్లు

బీఈడీ చేసి, ప్రైవేట్‌ బోధనలో ఉండిపోయిన ఉపాధ్యాయులు.. యాజమా న్యాల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాలలు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఈనెల రెండు నుంచి పచ్చజెండా ఊపింది. తొమ్మిది, పది తరగతుల నిర్వహణకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు తరగతులకు సంబంధించిన ఉపాధ్యాయుల్నే  యాజమాన్యాలు పిలిచాయి. లాక్‌డౌన్‌కు ముందు ఆగిపోయిన ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఇప్పటికీ కొలువులకు గ్యారెంటీ లేదు. తొమ్మిది, పది తరగతులకు పాఠ్యాంశాల బోధన జరుగుతున్నా, కొద్దిమంది ఉపాధ్యాయులకే యాజమాన్యాలు ఆహ్వానాలు పంపాయి. మిగిలిన వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ పాఠశాలలు పూర్తిగా తెరుచుకున్నాక కొలువు ఉంటుందా, లేదా అనేదీ సందేహమే.


ఆటోవాలా.. దివాలా..

కిరాయి గిట్టుబాటు కావడం లేదు. ఎక్కే ప్రయాణికులు ముందుకురావడం లేదు. అన్‌లాక్‌ అనగానే అప్పులోళ్లు వచ్చి పడుతున్నారు. ఇదీ ఆటోడ్రైవర్ల పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు ప్రయాణికులే చెయ్యెత్తి ఆటోలను ఆపేవారు. ఇప్పుడు ఆటోవాలాలు వచ్చి ముందు ఆగినా ఎక్కడానికి ప్రయాణికులు సాహసించడం లేదు. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు రూ.1,000 వరకు  సంపాదించే ఆటో కార్మికులు ఇప్పుడు రూ.300-400 కూడా లేక అవస్థలు పడుతున్నారు. అన్‌లాక్‌ రాగానే ఫైనాన్స్‌ కంపెనీల సిబ్బంది సీజ్‌ నోటీసులు పట్టుకుని ఆటోడ్రైవర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆటో డ్రైవర్లు తమ వాహనాలను ఫైనాన్స్‌ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు. 


వస్త్రవ్యాపారం.. దుర్భరం

షెట్టర్‌ ఎత్తామన్న ఆనందం తప్ప వ్యాపారం బాగుందన్న సంతృప్తి వస్త్ర వ్యాపారుల్లో లేదు. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు జిల్లాలో నిత్యం రూ.50-60కోట్ల వరకు వ్యాపారం జరిగేది. అన్‌లాక్‌లో అది రూ.15కోట్లకు తగ్గింది. జిల్లాలో మొత్తం 5వేల వస్త్ర దుకాణాలున్నాయి. వివాహ ముహూర్తాలు, పండగల సమయాల్లో ఈ దుకాణాలు కళకళలాడేవి. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత మొత్తం షెట్టర్లు దించేశారు. అన్‌లాక్‌లో దుకాణాలు తెరిచినా వ్యాపారం మాత్రం కష్టంగా సాగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం షాపులు తెరుచుకున్నా నగరాలకు గ్రామీణ జనాభా రావడంలేదని వాపోతున్నారు. జనవరి, ఫిబ్రవరి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారం సిబ్బంది వేతనాలకే సరిపోతోందని చెబుతున్నారు. ఇప్పుడు కొద్దోగొప్పో పెళ్లిళ్ల ముహూర్తాలు ఉన్నా, జనవరి నుంచి ఎలాంటి ముహూర్తాలు లేకపోవడం వ్యాపారానికి గడ్డు పరిస్థితే అంటున్నారు. జనవరిలో సంక్రాంతి ఉన్నప్పటికీ ఆ సందడి రెండు, మూడు రోజులే ఉంటుందని ఏమీ అర్థంకాని స్థితిలో అయోమయంగా గడుపుతున్నారు.


కష్టాలు పడుతున్నాం

బ్యాంకులు, ఇతర చోట్ల అప్పులు చేసి వ్యాపారం చేస్తున్నాను. కరోనాతో నానా కష్టాలు పడుతున్నాను. ఏడు నెలలుగా వ్యాపారం లేదు. మార్చి నుంచి నాలుగు నెలలపాటు మాకు వ్యాపారం బాగా ఉంటుంది. కరోనాతో షాపులు తెరవలేదు. ఇప్పుడు ఎక్కువమంది కూల్‌డ్రింక్స్‌ తాగకపోవడంతో వ్యాపారం పడిపోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. తెచ్చిన అప్పులు, అద్దెలు చెల్లించలేని పరిస్థితి. 

- ఎం.వెంకటేశ్వర్లు, కూల్‌డ్రింక్‌ షాపు నిర్వాహకుడు 


ఆకలి చావులు తప్పవు 

లాక్‌డౌన్‌ ఎత్తేశాక పెద్దగా వ్యాపారం ఏమీ లేదు. కాకపోతే లాక్‌డౌన్‌ కంటే కాస్త పర్వాలేదు. అయినా కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి మరికొన్ని నెలలు ఉంటే ఆకలి చావులు తప్పవు. కొన్నేళ్లుగా టీ స్టాల్‌ నిర్వహిస్తున్నాను.    కరోనాతో వ్యాపారం అంతా పోయింది.

- సబీర్‌, టీ స్టాల్‌ నిర్వాహకుడు


పచ్చడి మెతుకులే గతి 

కరోనా వచ్చినప్పటి నుంచి కుటుంబంలో మాకు పచ్చడి మెతుకులే గతయ్యాయి. పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వలేకపోతున్నాను. ప్రభుత్వం రేషన్‌ బియ్యం తప్ప మరే ఇతర ప్రోత్సాహకం అందించలేదు. మా బతుకులు దుర్భరమయ్యాయి. 

- పోతురాజు, ముఠాపని


చేసిన అప్పులు తీర్చలేకపోతున్నాం 

లాక్‌డౌన్‌ సమయంలో జీతాలు లేక ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. ప్రస్తుతం స్కూల్స్‌ తెరిచినా, లాక్‌డౌన్‌ సమయంలో చేసిన అప్పులు తీర్చడానికి ఆదాయం లేక సతమతమవుతున్నాం.

- ప్రమీలారాణి, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌

Updated Date - 2020-11-08T13:51:34+05:30 IST