కుప్ప ‘కూలి’పోతే!

ABN , First Publish Date - 2020-11-09T15:47:51+05:30 IST

వారి చెమట చుక్కలతో తడిసి నేల సిరులను..

కుప్ప ‘కూలి’పోతే!

ఉత్పత్తికి ‘వలస’ లోటు

పరి‘శ్రమించే’దెప్పుడు? 

మందగించిన మెగా ప్రాజెక్టులు

కదలని నిర్మాణ పనులు

తిరగని లారీ చక్రం

కరోనా తరిమిన కాలం 

చేదు అనుభవాల సారం

వలస కార్మికులు మళ్లీ వచ్చేనా?

అన్ని రంగాలూ కోలుకునేదెప్పుడో!


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): వారి చెమట చుక్కలతో తడిసి నేల సిరులను పండించింది. వారి నెత్తురు కంకరగా ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి.. వారి జీవన పునాదులపై అందమైన సౌధాలు నిర్మితమయ్యాయి. వారి శ్రమే మొత్తం ప్రపంచాన్ని నడిపించింది. ఇప్పుడా ప్రపంచాన్ని కరోనా స్తంభింపజేసింది. అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌ వలస జీవుల బతుకుల్లో చీకటి నింపింది. చేసేందుకు పని లేక.. తిరిగి వెళ్లేందుకు వాహనాలు లేక.. తమ కాళ్లనే నమ్ముకుని సొంత ఊళ్లకు పయనమయ్యారు. కండబలం నడకలోనే కరిగిపోయింది. గుండెబలం దారి మధ్యలో జారిపోయింది. ఇక ఆ ప్రాణాలు తిరిగి ‘వలస’ దారిపట్టే అవకాశం కనుచూపు మేరలో లేదు. ఇక్కడ వారి ఉష్ణ దేహాలు లేవు.. ఉక్కు కరగదు. చక్రం తిరగదు.. అంతస్థులు లేవవు.. పరిశ్రమించే ప్రాణి లేక అన్ని రంగాల్లో ఉత్పత్తే కుప్పకూలిపోయింది. ఈ దుస్థితి నుంచి మళ్లీ కోలుకునేదెపుడో!


కరోనా జీవితాలనే తలకిందులు చేసింది. ఉత్పత్తిని దెబ్బ తీసింది. ‘వలస’ జీవులను ఇంటి బాట పట్టించిన కాలం మళ్లీ స్థిమితపడేదెప్పుడో తెలియదు! కార్మికులంతా సొంత ప్రాంతాలకు తరలి వెళ్లి పోవడంతో ఆ ప్రభావం జిల్లావ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక ఉత్పాదకత, రవాణా రంగాల మీద తీవ్రంగా చూపిస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకుని కాస్త కోలుకుంటున్నా, లాక్‌డౌన్‌ మొత్తం ఎత్తివేసినా, వలస కార్మికులు లేని లోటు నిర్మాణ, పారిశ్రామిక, రవాణా రంగాలను వెంటాడు తూనే ఉంది. అన్‌లాక్‌ల ద్వారా ఆంక్షలను సడలిం చినా, పూర్తి స్థాయిలో వ్యవస్థలు గాడిలో పడలేదు. ముఖ్యంగా భారీ నిర్మాణరంగం, పారిశ్రామిక, రవాణా రంగాలు వలస కార్మికుల కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్లు తిరిగి వస్తారా? వస్తే ఎప్పటికి వస్తారు? అప్పటి వరకు ఏం చేయాలి? ఇవి ఇప్పుడు చాలా రంగాలను వేధిస్తున్న ప్రశ్నలు. 


మందగించిన నిర్మాణరంగం 

నిర్మాణ రంగానికి ‘వలస’ దెబ్బ బలంగా తగిలింది. జిల్లాలో ఈ రంగం అత్యధిక భాగం వలస కార్మికుల మీదే ఆధారపడి ఉంది. నిర్మాణ పనుల్లో అత్యధిక శ్రమతో కూడుకున్న పనులు చేసేది వలస కార్మికులే. వీరంతా బీహార్‌, అస్సాం, ముంబయి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరంతా వెనుదిరగడంతో మెగా ప్రాజెక్టులు మందగించాయి. ఇటీవల నగరంలో ప్రారంభమైన అతి పెద్ద మౌలికరంగ ప్రాజెక్టు కనకదుర్గా ఫ్లై ఓవర్‌. వలస కార్మికుల మీద ఆధారపడిన ఈ ప్రాజెక్టు చివర్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. మహారాష్ట్ర వలస కార్మికులు చాలా వరకు వెళ్లిపోయారు. బలవంతంగా ఉంచే ప్రయత్నం చేయడంతో చాలా మంది పారిపోయారు. చివరికి కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ అతి బలవంతంగా ఉంచిన కొద్ది మంది వలస కార్మికుల పర్యవేక్షణలో.. లోకల్‌గా ఉన్న వారిని పెట్టుకుని పనులు పూర్తి చేయించుకోగలిగింది. దుర్గా ఫ్లై ఓవర్‌ మాదిరిగా మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితి లేదు. ప్రతిష్ఠాత్మక హెచ్‌సీఎల్‌ మూడవ టవర్‌ పనులు కార్మికులు లేకే నెమ్మదించాయి. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు కూడా ‘వలస’ దెబ్బ తగిలింది. అనేక బహుళ అంతస్థుల నిర్మాణాలు నిలిచిపోయాయి. 


లారీలకు బ్రేక్‌  

రవాణా రంగంలో వలస కార్మికులు లేని లోటు రెండు రకాలుగా పడతోంది. జిల్లావ్యాప్తంగా 40 వేల లారీలు ఉన్నాయి. ఇందులో 25 వేల వరకు నేషనల్‌ పర్మిట్‌ లారీలున్నాయి. మిగిలినవి పెద్ద టిప్పర్లు, చిన్న టిప్పర్లు. నేషనల్‌ పర్మిట్‌ లారీల్లో ట్రాలీలు, ట్యాంకర్లు, కంటెయినర్లు, భారీ లోడు లారీలను వలస కార్మికులే నడుపుతుంటారు. దాదాపు జిల్లావ్యాప్తంగా 40 శాతం డ్రైవర్లు వలస కార్మికులే. వారంతా వెళ్లిపోవటంతో ఇప్పుడు డ్రైవర్ల కొరత వెంటాడుతోంది. దీంతో లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ను పుర్తిగా సడలించినా, ఇప్పటికీ 40 శాతం మించి లారీలు తిరగటం లేదు. 


పారిశ్రామిక రంగం కుదేలు 

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పారిశ్రామిక రంగంలోని వలస కార్మికుల ఉపాధికి గండి పడింది. జిల్లాలో పలు స్పిన్నింగ్‌ మిల్లుల్లో, ఉక్కు పరిశ్రమల్లో, డెయిరీ పరిశ్రమలు, డెయిరీ ఫామ్‌లలో వలస కార్మికులే ఎక్కువుగా పనిచేస్తుంటారు. కొవిడ్‌ సమయంలో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు వలస కార్మికులను పనుల నుంచి తొలగించటంతో కార్మికులు ఎదుర్కొన్న కష్టాలెన్నో. చివరికి వాళ్లు ఎన్నో కష్టనష్టాలకోర్చి, సొంతూళ్లకు చేరుకున్నారు. వలస కార్మికులు వెళ్లిపోయిన ప్రభావం ఇప్పుడు పారిశ్రామిక రంగం మీద తీవ్రంగా చూపిస్తోంది. యాభై శాతానికి పైగా వలస కార్మికుల మీదనే పారిశ్రామిక రంగం ఆధారపడుతోంది. ఈ రంగంలో ఇప్పుడు ఉత్పాదకత నిలిచిపోయింది. 


సరుకు లేదు.. రవాణా సాగదు

నిర్మాణ రంగంలో చోటు చేసుకున్న స్తబ్ధత కారణంగా సిమెంట్‌, ఇనుము తదితర మెటీరియల్‌ రవాణా జరగటం లేదు. పారిశ్రామికరంగ ఉత్పాదకత కూడా ఆశించిన విధంగా లేకపోవటం వల్ల వస్తు రవాణా జరగటం లేదు. దీంతో ఇప్పుడు అన్ని రంగాల చూపు వలస కార్మికుల మీదనే ఉంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, బాధాతప్త హృదయాలతో సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికులు మళ్లీ వెనుదిరిగి వచ్చే సాహసం చేస్తారా? కలో గంజో తాగి, సొంత ఊర్లోనే ఉండిపోదామనే నిర్ణయం తీసుకుంటారా? అనేదానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వలస కార్మికులు తిరిగి రాకపోతే వివిధ వ్యవస్థల మీద ప్రభావం గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 


వారు లేని లోటు లోటే 

లారీ డ్రైవర్లుగా వలస కార్మికులు చాలా మంది పనిచేస్తున్నారు. దాదాపు జాతీయ పర్మిట్ల ఫ్లీట్‌లో 40 శాతం వీళ్లే. వీరంతా హెవీ వెహికల్స్‌ నడుపుతుంటారు. ట్రాలీలు, ట్యాంకర్లు, గ్యాస్‌ సిలిండర్స్‌ వాహనాలు, ఇంకా భారీ వాహనాలను నడుపుతుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారంతా వెళ్ళిపోవటంతో రవాణా రంగంపై  ఆ ప్రభావం పడింది. ఈ రంగం పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవటంతో ప్రస్తుతం వారు లేని లోటు పూర్తిగా తెలియడం లేదు. ఇక ముందు ఈ లోటు తీవ్రంగా ఉంటుంది. 

- వైవీ ఈశ్వరరావు, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ 


పారిశ్రామిక రంగానికీ ఇబ్బందే 

పరిశ్రమల్లో ఎక్కువగా వలస కార్మికులే పనిచేస్తుంటారు. వారిలో బీహార్‌, అస్సాం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. చెమటలు కక్కే కర్మాగారాల్లో ఎక్కువగా పని చేసేది వారే. ఉష్ణాన్ని తట్టుకునే శారీరక దారుఢ్యం వారికే ఉంటుంది. వీరు లేకుండా స్థానికులతో పనులు చేయించుకోవటం దుస్సాహసమే అవుతుంది. వలస కార్మికులు లేనిదే ఉత్పాదకత వేగంగా సాగదు. వారు లేని లోటు తెలుస్తోంది. పరిస్థితులను కొవిడ్‌ తారుమారు చేసింది. మళ్లీ మంచి రోజులు రావాలని, వలస కార్మికులు తిరిగి రావాలని కోరుకోవటం తప్ప చేసేదేమీ లేదు. 

- పొట్లూరి భాస్కరరావు, ఏపీ చాంబర్స్‌ ప్రధాన కార్యదర్శి



Updated Date - 2020-11-09T15:47:51+05:30 IST