మామిడిపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-07T04:29:23+05:30 IST

మామిడి రైతుకు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా విజృంభణతో మామిడి ఎగుమతులకు బ్రేక్‌ పడింది.

మామిడిపై కరోనా ఎఫెక్ట్‌
మల్దకల్‌లోని మామిడి తోట

పడిపోయిన ధరలు 

దిక్కుతోచని స్థితిలో రైతులు 

జిల్లాలో 14,616 టన్నుల దిగుబడులు


గద్వాల, మే 6 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుకు కరోనా ఎఫెక్ట్‌ తగిలింది. దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా విజృంభణతో మామిడి ఎగుమతులకు బ్రేక్‌ పడింది. గద్వాల జిల్లా నుంచి మామిడి దిగుబడులను ఢిల్లీ, హర్యాన, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు తీసుకెళ్తారు. ఏటా ఈ సమయానికి ఎగుమతులు ప్రారంభమయ్యేవి. కానీ ఈసారి కరోనా నేపథ్యంలో మామిడి దిగుబడులను కొనుగోలు చేయడానికి వ్యాపారులు రాలేదు. దిగుబడులను మార్కెట్లకు తరలించడానికి కూడా రైతులను కొవిడ్‌ భయం వెంటాడుతోంది.

3,654 ఎకరాల్లో మామిడి తోటలు: గద్వాల జిల్లాలోని కేటాదొడ్డి, గట్టు, మల్ధకల్‌, ధరూర్‌, అలంపూర్‌ మండలాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. 3,654 ఎకరాల్లో తోటలు ఉన్నాయిని అధికారులు చెబుతున్నారు. ఈ సారి 14,616 టన్నుల దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాఖ అంచనా వేసింది. అంటే 1,46,160 క్వింటాళ్లు. ఈ పండ్లను అమ్మాలంటే రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హైదరాబాద్‌ మినహా మామిడి మార్కెట్‌ ఎక్కుడా లేదు. జిల్లా రైతులు ఎక్కువగా రాయచూరు తీసుకెళ్తారు. కానీ హోల్‌సేల్‌ ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. అందుకే పండ్లను అమ్మకానికి తీసుకెళ్లడం లేదు. మామిడిని నిల్వ చేయడానికి గోదాంలు కూడా లేకపోవడం రైతులకు శాపంగా మారింది.

రూ.2,000లకు తగ్గిన ధర: హోల్‌సెల్‌ ధరలు గత ఏడాది క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఉండేవి. ప్రస్తుతం కరోనా వల్ల వ్యాపారులు రావడం లేదని, వచ్చినా క్వింటాలుకు రూ.2,000 నుంచి రూ.2,500లకు కొంటున్నారని రైతులు చెబుతున్నారు. దాంతో భారీగా నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. రిటైల్‌ అమ్మకాలు కూడా లేకపోవడంతో చాలా కాయలు చెట్టుపైనుంచి కిందపడుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు ఈ వారం రోజుల్లో రెండుసార్లు గాలి దుమారం రావడంతో కాయలు రాలి నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.

Updated Date - 2021-05-07T04:29:23+05:30 IST