కొవాగ్జిన్‌తో ‘డబుల్‌ మ్యుటెంట్‌’ నిర్వీర్యం

ABN , First Publish Date - 2021-04-22T07:09:39+05:30 IST

భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కొవాగ్జిన్‌ టీకా ‘డబుల్‌ మ్యుటెంట్‌’(బి.1.617) కరోనా వైరస్‌ వేరియంట్‌ను నిర్వీర్యం చేయగలదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది...

కొవాగ్జిన్‌తో ‘డబుల్‌ మ్యుటెంట్‌’ నిర్వీర్యం

  • టీకా తీసుకున్న 0.04 శాతం
  • మందికే కరోనా: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: భారత్‌ బయోటెక్‌ కంపెనీకి చెందిన కొవాగ్జిన్‌ టీకా ‘డబుల్‌ మ్యుటెంట్‌’(బి.1.617) కరోనా వైరస్‌ వేరియంట్‌ను నిర్వీర్యం చేయగలదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించింది. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈవిషయం వెల్లడైనట్లు తెలిపింది. కాగా, ఈ అంశంపై ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, వారంలోగా దానికి సంబంధించిన వివరాలన్నీ కంపెనీకి అందొచ్చని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీ ఎండీ) కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. కాగా, దేశంలో కొవిడ్‌ టీకా మొదటి డోసు తీసుకున్న వారిలో ఇప్పటివరకు 21 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారని, రెండు డోసులూ తీసుకున్న వారిలో 5,709 మందికి వైరస్‌ సోకిందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. ఇప్పటివరకు 93,56,436 మంది కొవాగ్జిన్‌ తొలి డోసు తీసుకోగా.. వారిలో 4,208 మందికి వైరస్‌ సోకిందని, ఇది 0.04 శాతమేనని తెలిపారు. అలాగే, 17,37,178 మంది రెండు డోసులూ తీసుకోగా.. వారిలో 695 మంది కరోనా బారిన పడ్డారని, ఇది కూడా 0.04 శాతమేనని వివరించారు. మొత్తం మీద కొవాగ్జిన్‌ తీసుకున్న ప్రతి పది వేల మందిలో నలుగురికి మాత్రమే వైరస్‌ సోకిందన్నారు. కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న ప్రతి పది వేల మందిలో ఇద్దరికే(0.02ు) వైరస్‌ సోకిందని బలరాం భార్గవ వివరించారు. 

Updated Date - 2021-04-22T07:09:39+05:30 IST