అనిశ్చితులుంటాయ్‌!

ABN , First Publish Date - 2020-07-07T06:36:17+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికంలో కొవిడ్‌-19 ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం అనేక అనిశ్చితి పరిస్థితులు ఎదురుకావచ్చని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అంచనా వేస్తోంది...

అనిశ్చితులుంటాయ్‌!

  • మరో ఆర్నెల్లు కొవిడ్‌-19 ప్రభావం 
  • ఓటీసీ ఔషధాలకు గిరాకీ
  • డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికంలో కొవిడ్‌-19 ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం అనేక అనిశ్చితి పరిస్థితులు ఎదురుకావచ్చని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అంచనా వేస్తోంది. వ్యయాలను తగ్గించుకుని పోటీతత్వం పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించింది. మరిం త సమర్థమంతమైన కంపెనీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తామని డాక్టర్‌ రెడ్డీస్‌ చైర్మన్‌ కే సతీశ్‌ రెడ్డి, సహ చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ ఈ మేరకు వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, తెలంగాణలోని మిర్యాలగూడలోని ఏపీఐ తయారీ యూనిట్లకు, విశాఖపట్నం సమీపం దువ్వాడలోని కేన్సర్‌ ఫార్ములేషన్ల తయారీ యూనిట్‌కు యూఎస్‌ ఎఫ్‌డీఏ పచ్చజెండా ఊపిందని, ఆడిట్‌ను ముగించిందని తెలిపింది. 




వ్యూహాలు మారుస్తాయ్‌..: ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఔషధ కంపెనీలు యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ), ఇంటర్మీడియెట్ల కోసం చాలా ఎక్కువగా చైనాపై ఆధారపడుతున్నాయని సతీష్‌ రెడ్డి అన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇది కంపెనీలకు పెద్ద సవాలుగా నిలువనుందని మున్ముం దు చైనాపై ఆధారపడడాన్ని కంపెనీలు క్రమం గా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తాయన్నారు. ఏపీఐ నుంచి ఫార్ములేషన్‌ తయారీ వరకూ ఎండ్‌-టు-ఎండ్‌ ఉత్పత్తి తయారీ కంపెనీలుగా మారడానికి ఏపీఐల తయారీపై దృష్టి పెట్టే అవకాశం ఉందన్నారు. డాక్టర్‌ రెడ్డీ్‌సకు తగినన్ని సొంత ఏపీఐ తయారీ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. 

కొవిడ్‌-19 మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు కొనసాగే అవకాశం ఉందని, దీనివల్ల ఇతర వ్యాధులకు చికిత్స ఆలస్యం కావొచ్చని వివరించారు. ఇతర వ్యాధుల రోగులకు చికిత్సలో జాప్యం కారణంగా అనేక ఔషధాలకు గిరాకీ తగ్గుతుందని, ఆరోగ్య పరిస్థితులు విషమిస్తాయని పేర్కొన్నారు. ఓవర్‌-ద-కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాలకు మాత్రం గిరాకీ పెరిగే అవకాశాలున్నాయని, ముఖ్యంగా విటమిన్లు వంటి రోగ నిరోధక శక్తిని పెంచే ఓటీసీ ఔషధాల కొనుగోళ్లు పెరుగుతాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.  


Updated Date - 2020-07-07T06:36:17+05:30 IST