మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-06-25T05:37:09+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం నియంత్రణ చర్యలపై దృష్టి సారించింది. నగరం పరిధిలో వరుసగా రెండు రోజులు రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. నాలుగు నెలల నుంచి ఎలాంటి కేసులు లేకుండా ఉన్న జిల్లాలో మళ్లీ కేసులు బయటపడడంతో ఆందోళన మొదలైంది.

మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

జిల్లాలో రెండు రోజులుగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం 

మాస్కు ధరించాలంటున్న అధికారులు

నిజామాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం నియంత్రణ చర్యలపై దృష్టి సారించింది. నగరం పరిధిలో వరుసగా రెండు రోజులు రెండు కరోనా కేసులు బయటపడ్డాయి. నాలుగు నెలల నుంచి ఎలాంటి కేసులు లేకుండా ఉన్న జిల్లాలో మళ్లీ కేసులు బయటపడడంతో ఆందోళన మొదలైంది. నగరంలోని దుబ్బా, గౌతంనగర్‌లో కేసులు బయటపడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో రెండో విడత వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తిస్తూ అవసరమైన వారు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా ఈ వ్యాక్సిన్‌ అందించేందుకు సిద్దమవుతున్నారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 19లక్షల 96వేల 522 డోసులను ఇచ్చారు. మిగతా వారికి కూడా ఇచ్చే ఏర్పాట్లను చేస్తున్నారు. మొదటి విడత ఇప్పటికే పూర్తికాగా రెండవ విడత పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొదటి విడత కింద 11లక్షల 51వేల 333 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. రెండవ విడత కింద 8లక్షల 3వేల 27 మందికి ఇచ్చారు. ప్రికాషన్‌ డోస్‌ కింద 29వేల 672 మందికి వ్యాక్సినేషన్‌ వేశారు. కొవిడ్‌ సంబంధించిన చర్యలను తీసుకుంటునే సీజనల్‌ వ్యాధులపై  దృష్టిపెడుతున్నారు. పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల పరిదిలో వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతర వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. కావాల్సిన మందులను అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు మళ్లీ బయటపడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. వివిధ పనుల కోసం బయటకి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. సానిటైజర్‌లను ఉప యోగించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని కోరారు.

నేటి నుంచి ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేయాలి: కలెక్టర్‌

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రు ల్లో కనీస సదుపాయాలతో పాటు ప్రసవాలు నిర్వహి స్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపేందుకు వీలుగా కలెక్టర్‌ తనిఖీ బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో జిల్లా స్థాయి అధికారితో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో, ప్రోగ్రాం అధికారి తదితరులు ఉన్నారు. ఏఏ అంశాలను పరిశీలించాలి, నివేదిక ఎలా సమర్పించాలి అనే అంశంపై కలెక్టర్‌ శుక్రవారం సెల్‌కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. శనివారం నుంచే ఆస్పత్రుల తనిఖీలు నిర్వహించాలని ప్రతి రోజూ రెండు ఆస్పత్రులు తనిఖీ చేసి సమగ్ర నివేదిక అం దించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న కాన్పుల్లో 75శాతం సిజేరియన్లు అవుతున్నాయని ప్రైవేటు ఆస్పత్రుల్లో 92శాతం ఇవి జరుగుతున్నాయని ఇలా జరగకూడదన్నారు. ఇతర రాష్ట్రాల్లో 35శాతం సిజేరియన్లు ప్రైవేటులో జరుగుతున్నాయని జిల్లాలో జరుగుతున్న అధిక శాతం ఆపరేషన్లపై పరిశీలన కోసమే ఈ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2022-06-25T05:37:09+05:30 IST