కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-05-11T04:55:27+05:30 IST

కరోనా కల్లోలం

కరోనా కల్లోలం

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఆరుగురి  మృతి

యాచారం/కందుకూరు/షాబాద్‌:యాచారం మండలంలో ఒకే రోజు కరోనా బారిన పడి  ముగ్గురు మృతి చెందారు.  మంతన్‌గౌరెల్లికి చెందిన  ఓ వ్యక్తి (45), కుర్మిద్దకు చెందిన మహిళ (75), బొల్లిగుట్టతండాలో వ్యక్తి (65)  సోమవారం మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో సర్పంచులు ప్రతి వాడలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించడంతో పాటు మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.  కందుకూరు మండలంలోని దెబ్బడగూడలో  ఆదివారం రాత్రి ఓ మహిళ కరోనా కాటుకు బలైంది. అయితే  మృతురాలి భర్త ఈనెల 4తేదీన కొవిడ్‌తో మృతి చెందగా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా షాబాద్‌ మండలంలోని  గోపిగడ్డ గ్రామంలో  కరోనాతో వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన వ్యక్తి (45)కి  15 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. వారం రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం  మృతి చెందాడు.   

బషీరాబాద్‌ మండల పరిషత్‌ కో-అప్షన్‌ సభ్యుడి మృతి

బషీరాబాద్‌: బషీరాబాద్‌ మండల పరిషత్‌ మాజీ కో-అప్షన్‌ సభ్యుడు,  మైనార్టీ నాయకుడు (47) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆనారోగ్యంతో పది రోజుల కిందట తాండూరు జిల్లా ఆసుపత్రిలో కుటుంబీకులు చేర్చారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు అతన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు  కరోనా సోకడంతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

వికారాబాద్‌ జిల్లాలో 526 మందికి పాజిటివ్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో సోమవారం కొత్తగా 526 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,656 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 526 మందికి కరోనా పాజిటివ్‌  వచ్చినట్లు గుర్తించారు. తాండూరులో 67 కరోనా కేసులు నమోదు కాగా, దౌల్తాబాద్‌లో 44, కొడంగల్‌లో 31, కులకచర్లలో 31, నవాల్గలో 28, బొంరా్‌సపేట్‌లో 26, నవాబ్‌పేట్‌లో 24, దోమలో 23, రామయ్యగూడలో 19, యాలాల్‌లో 19, పరిగిలో 17, చిట్యాలలో 17, అంగడి రాయిచూర్‌లో 17, వికారాబాద్‌లో 16, పట్లూర్‌లో 16, ధారూరులో 16, బంట్వారంలో 15, మర్పల్లిలో 13, బషీరాబాద్‌లో 13, చెన్‌గోముల్‌లో 13, సిద్దులూరులో 13, పూడూరులో 12, పెద్దేముల్‌లో 9, మోమిన్‌పేట్‌లో 9, జిన్‌గుర్తిలో 9, నాగసమందర్‌లో 5, కోట్‌పల్లిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం 6,769 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 6,654 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా, వివిధ ఆసుపత్రుల్లో 115 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-05-11T04:55:27+05:30 IST