హిందూపురం, మడకశిరలో కరోనా బీభత్సం

ABN , First Publish Date - 2021-04-22T06:19:00+05:30 IST

కరోనా మరోసారీ హిందూపురాన్ని కమ్మేస్తోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదుతో సెకెండ్‌ వేవ్‌ వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది

హిందూపురం, మడకశిరలో కరోనా బీభత్సం
హిందూపురం ప్రభుత్వం ఆసుపత్రి వద్ద కొవిడ్‌ టెస్టుల కోసం క్యూ,

 


గత ఏడాది కంటే వేగంగా 

హిందూపురం, ఏప్రిల్‌ 21: కరోనా మరోసారీ హిందూపురాన్ని కమ్మేస్తోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదుతో సెకెండ్‌ వేవ్‌ వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాలను నుంచి కరోనా లక్షణాలతో కొవిడ్‌ నిర్థారణ పరీక్షల, ఆసుపత్రులకు కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సెకెండ్‌ వేవ్‌ వైరస్‌ గత ఏడాది పట్టణంలో ఇదే సమయానికి నమోదు అయిన కరోనా కేసుల కంటే ఏప్రిల్‌ మూడో వారానికి పట్టణంలో 236 కేసుల నమోదుతో ఆందోళన కల్గిస్తోంది. పట్ణణంలో మార్చి 18న మళ్లీ పాజిటివ్‌ కేసులు ప్రారంభంతో ప్రతిరోజు నమోదుతో ఏకంగా బుధవారం పట్టణంలోనే 68 కేసులు నమోదు చూస్తే సెకెండ్‌ వేవ్‌ వైరస్‌ గతం కంటే బీభత్సం సృష్టిస్తోంది. వైరస్‌ కట్టడికోసం మున్సిపల్‌, పోలీస్‌ శాఖలు ప్రతి రోజు సమీక్ష సమావేశాలు పెట్టి వ్యాపార నిర్వహకులతోపాటు అన్ని వర్గాల, ప్రజలకు కొవిడ్‌ నిబంధనలతోపాటుహెచ్చరికలు, అవగాహన కల్పిస్తున్నా కరోనా మాత్రం కట్టడికావడంలేదన్న విమర్శలకు దారీతీస్తోంది. హిందూపురంతోపాటు పెనుకొండ, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్లలో భారీగా కరోనా కేసులు నమోదు పరంపర కొనసాగుతోంది. ఇలాగే ప్రతి రోజు కేసులు నమోదైతే కొవిడ్‌ ఆసుపత్రుల్లో సైతం వైద్యసేవలు అందించడం కష్టమని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హిందూపురం కొవిడ్‌ ఆసుపత్రిలో 119 మంది వైద్యసేవలు పొందుతున్నారు. రోజూ పాజిటివ్‌ కేసుల రాకతో పట్టణంలో ప్రైవేట్‌ ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా నోటిపై చేశారంటే హిందూపురంలో కరోనా వైరస్‌ విజృంభణ ఏవిధంగా ఉందో ఆందోళన కల్గిస్తోంది. ఓవైపు కొవిడ్‌ వ్యాక్సినేషన జరుగుతున్నా మరోవైపు సెకెండ్‌వేవ్‌ వైరస్‌ తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి కొవిడ్‌ లక్షణాలతో వస్తున్నా వారి సంఖ్య పెరుగుదలతో మాతాశిశు, అత్యవసరసేవలకు పరిమితం చేసే పరిస్థితికి వచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ విలయతాండవంతో కట్టడి ఎలా అని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం నుంచి మాతాశిశు కేంద్రంతోపాటు అత్యవసర వైద్యసేవలకే పరిమితం చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దివాకర్‌బాబు తెలిపారు. 

మడకశిరటౌన: మడకశిర పట్టణంలో కరోనా కేసులు రోజు రోజుకూ అధికమవుతుండటంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఆరోగ్య శాఖ వెల్లడించిన కరోనా కేసుల్లో మడకశిరలో 36 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. రోజు రోజుకూ కరోనా కేసులు చాపకింద నీరులా పట్టణంలో విస్తరిస్తుండటంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మడకశిరకు సమీపంలో ఉండటంతో ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం పట్టణవాసులు బెంగళూరుకు వెళుతుంటారు. దీంతో ఎటు నుంచి కరోనా వ్యాపిస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. గత వారం రోజుల్లో కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందారు. కరోనా కేసులు పట్టణంలో వ్యాప్తి చెందుతున్నా నియంత్రణకు చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. అధికారులు  కేవలం ప్రకటనలకు ప్రచారానికే పరిమితం అవుతున్నారేకానీ కరోనా నివారణకు చర్యలు చేపట్టడం అంతంత మాత్రంగానే ఉన్నాయంటూ పట్టణ వాసులువాపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మడకశిరకు వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వస్తుంటారు. కరోనాపై ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మరింత చైతన్యం రావాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, సెకెండ్‌వేవ్‌ కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉందని, వ్యాక్సినేషన తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. కరోనా నివారణకు గట్టిచర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-22T06:19:00+05:30 IST