కొంపముంచుతున్న హోం ఐసోలేషన్.. వైరస్‌ వేగంగా విస్తృతి

ABN , First Publish Date - 2020-09-21T15:27:48+05:30 IST

కొవిడ్‌ కట్టడికి ముందడుగు పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.వాతావరణంలోవచ్చిన మా ర్పులు, కొనసాగుతున్న వర్షాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో వైరస్‌ మరింత

కొంపముంచుతున్న హోం ఐసోలేషన్.. వైరస్‌ వేగంగా విస్తృతి

కుటుంబాలకు కుటుంబాలే కరోనా బారిన పడుతున్న వైనం 

ఇటు నిర్లక్ష్యం, ఇటు అవగాహన లోపం.. మధ్యలో వసతుల లేమి

సౌకర్యాలు పెంచని ప్రభుత్వం.. 

ప్రైవేటులో కొనసాగుతున్న దోపిడీ 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు: కొవిడ్‌ కట్టడికి ముందడుగు పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.వాతావరణంలోవచ్చిన మా ర్పులు, కొనసాగుతున్న వర్షాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో వైరస్‌ మరింత విస్తరిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలే కొవిడ్‌ బారిన పడుతున్నాయి. ఇటు ప్రభుత్వపరంగా వైద్య సేవలు పెంచకపోవటం, అటు ప్రైవేటు వైద్యశాలల్లో ఫీజుల పేరుతో కొనసాగుతున్న దోపిడీతో హోం ఐసోలేషన్‌కు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరిలో పలువురు ఎలాంటి లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరికొందరి గృహాల్లో సౌకర్యాలు లేకపోవటం, బాధితులు కానివారితో తిరగటం వైరస్‌ విస్తృతికి కారణమవుతోంది. 


కొనసాగుతున్న పాజిటివ్‌ల పరంపర

జిల్లాలో గత 20 రోజులతో పోలిస్తే ఇటీవల కరోనా మృతుల సంఖ్య కొంత మేర తగ్గింది. పాజిటివ్‌ పరంపర కొనసాగుతోంది.అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 42 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 10వేల వరకూ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో 2వేల పడకలుపోను మిగిలిన వారంతా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు చెప్తున్నారు. అనధికారికంగా చూస్తే సుమారు 50వేల మంది జిల్లాలో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం కూడా అవసరమైన మందుల కిట్లను సరఫరా చేస్తూ బాధితులకు హోం ఐసోలేషన్‌ చికిత్సనే ప్రోత్సహిస్తోంది. కానీ వారి కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోతోంది. 


అక్కడే సరికొత్త సమస్యలు 

మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఆంధ్రజ్యోతి బృందం నిర్వహించిన పరిశీలనలో అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి. చాలామంది పాజిటివ్‌ లక్షణాలు కనిపించటం లేదు. అటు వసతులు లేక, ఇటు లక్షణాలు కన్పించలేదని బాధితులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసిమెలిసి ఉండటంతోపాటు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీనికితోడు కొన్ని కుటుంబాల్లో వృద్ధులైన బాధితులను దగ్గరుండి చూసుకునేందుకు సమీప కుటుంబ సభ్యులు ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి ఒంగోలు రిమ్స్‌లో కూడా కొంతమంది బాధితుల తరఫున కరోనా సోకని కుటుంబ సభ్యులు సేవలందిస్తున్నారు.  


ప్రభుత్వ వైద్యశాలల్లో అరకొర...

బాధితులు వైద్యశాలలో చికిత్స పొందేందుకు ఎదురవుతున్న సమస్యలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పా టు చేసి ఆక్సిజన్‌ అందించే సౌకర్యం పెం చినా అది జిల్లాలోని మూడు నాలుగు ప్రాంతాలకే పరిమితమైంది. కానీ వైరస్‌ మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. ఈ సమయంలో అందరికీ అందుబాటులో ప్రభుత్వ వైద్య చికిత్సా కేంద్రాలు లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది.  


ఐదు వైద్యశాలలకే అనుమతి

ఒంగోలులో ఐదు ప్రైవేటు వైద్యశాలల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదారు ప్రైవేటు వైద్యశాలల్లో అయితే అనధికారికంగా కొవిడ్‌ బాధితులకు పడకలు ఏర్పాటు చేసి చికిత్స కూడా చేస్తున్నారు. 


రోజుకు రూ. 30వేల నుంచి రూ. 40వేలు వసూలు 

ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు పెరగక, ఇటు ప్రైవేటు వైద్యశాలలు తక్కువగా ఉండి బాధితులకు పడకలు కూడా దొరకని పరిస్థితి. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ప్రైవేటు వైద్యశాలల వారు పెద్దమొత్తంలో దండుకుంటున్నారు. రోగికి విలువైన మందులు వినియోగించకపోయినప్పటికీ రోజుకు రూ. 30వేల నుంచి 40వేల వరకూ వసూలు చేస్తున్న ఆసుపత్రులు నగరంలో రెండు ఉన్నాయి. మరో రెండింట్లో సౌకర్యాలు ఆ స్థాయిలో లేకపోయినా ఫీజులు వేలల్లోనే ఉన్నాయి. 


హోం ఐసోలేషన్‌కు బాధితుల ప్రాధాన్యం 

ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీ ఫీజులు చెల్లించలేక గ్రా మీణ  ప్రాంతంలోని అత్యధికమంది బాధితు లు హోం ఐసోలేషన్‌కి వెళ్తున్నారు. దీనివలన కరో నా బారినపడే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుంటూరులో అమరావతి హాస్పటల్‌ నిర్వహిస్తున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి కూడా ఈ విషయంలో ఒక అధ్యయనం చేసి ఇటు సౌకర్యాలు లేక, అటు హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల అవగాహన లోపం కారణంగానే పాజి టివ్‌ కేసులు పెరుగుతున్నాయని విశ్లేషించారు. ప్రజలు స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రస్తుత వాతావరణ  పరిస్థితులలో పరిస్థితి మరోసారి చేయిదాటే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్‌లో ప్రభుత్వ వైద్యులు, ముఖ్యం గా డాక్టర్‌ రిచర్డ్స్‌ వైద్యసేవల పట్ల రోగులు సంతృప్తిగాఉన్నప్పటికీ అవసరమైన మందులు లేవని నూటికి 99 మంది చెప్తున్నారు. 


Updated Date - 2020-09-21T15:27:48+05:30 IST