కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-23T05:39:16+05:30 IST

విశాఖపట్నంలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ప్రతిరోజూ పదిహేను నుంచి ఇరవై మంది మరణిస్తున్నారు.

కరోనా కల్లోలం
నగరంలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు


జ్ఞానాపురం శ్మశాన వాటికలో ఒక్కరోజే 18 శవాల దహనం

అధికారిక లెక్కల్లో మాత్రం ఒకటి...రెండు మృతులు

కొత్తగా మరో 844 కేసులు నమోదు

మరోవైపు కొవిడ్‌ పరీక్షలకు  కిలోమీటర్ల కొద్దీ క్యూలు

వ్యాక్సిన్‌ రెండో డోసుకు బారులు తీరిన జనం

ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ప్రతిరోజూ పదిహేను నుంచి ఇరవై మంది మరణిస్తున్నారు. మృతదేహాలను జ్ఞానాపురం శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహనం చేస్తున్నారు. అక్కడ అగ్నిహోత్రంలా నిత్యం చితిమంటలు కాలుతూనే కనిపిస్తున్నాయి. గురువారం సుమారు 18 మృతదేహాలను ఇక్కడ దహనం చేశారు. అధికారులు మాత్రం గురువారం ఒక్కరే చనిపోయారని ప్రకటించారు. అలాగే బుధవారం మరణాలు రెండే ప్రకటించారు. కరోనా పరీక్షలు, రోగ నిర్ధారణలు, మరణాలు ఏవీ వాస్తవానికి దగ్గరగా వుండడం లేదు. అధికారిక లెక్కలకంటే నాలుగైదు రెట్లు కేసులు ఎక్కువగా వున్నాయని ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించగానే అత్యధికులు హోమ్‌ ఐసోలేషన్‌లో వుండి చికిత్స తీసుకుంటున్నారు. వారు పరీక్షలకు వెళ్లడం లేదు. అయితే కరోనా లక్షణాలు కనిపించినా పట్టించుకోకుండా బయట తిరిగేస్తున్న వారి వల్ల వైరస్‌ మిగిలిన వారికి వ్యాపిస్తోంది. 

కరోనా పరీక్షలకు తిప్పలు

కరోనా పరీక్షల కోసం రోగులు నానా పాట్లు పడుతున్నారు. ఈఎన్‌టీ ఆస్పత్రికి ఉదయం ఐదు గంటలకే వెళుతున్నా...మధ్యాహ్నం వరకు నమూనాలు తీసుకోవడం లేదు. ఎండలో పడిగాపులు పడాల్సి వస్తోంది.కాసింత ఖర్చు అయినా ప్రైవేటు సెంటర్‌లో పరీక్ష చేయించుకుందామని కొందరు ఆరిలోవ హెల్త్‌సిటీలోని విజయ మెడికల్‌ సెంటర్‌కు వెళుతున్నారు. అక్కడ కిలోమీటర్ల పొడవున క్యూలు ఉంటున్నాయి. రోగుల తాకిడిని తట్టుకోలేక యాజమాన్యం ‘ఈ రోజు ఇక పరీక్షలు చేయలేము’ రేపు ఉదయం 5 గంటలకు రండిఅంటూ బోర్డుపెట్టుకోవలసి వచ్చింది. ప్రైవేటు సెంటర్‌లలో యాంటీజెన్‌ పరీక్షకు రూ.800 నుంచి రూ.900, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షకు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు తీసుకుంటున్నారు.

ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత

నగరంలో ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఆటోనగర్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ సెంటర్‌ నుంచి ఇంతకు ముందులా కోరినన్ని సిలెండర్లు ఇవ్వడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరు సిలిండర్లు పంపమని కోరితే..మూడే ఇస్తున్నారని, దాంతో వాటిని రోగులకు సర్దుబాటు చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఫిల్లింగ్‌ స్టేషన్‌కు ప్లాంటు నుంచి అందడం లేదని తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్థానిక అవసరాలకు ఇవ్వకుండా ఆక్సిజన్‌ను ఇతర ప్రాంతాలకు పంపడం సరికాదని వైద్య వర్గాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం బారులు

కరోనా వాక్సిన్‌ రెండో డోసు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం గురువారం ఏర్పాట్లు చేయగా, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 45 ఏళ్లు దాటిన వారిలో రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి గతంలో తొలి ప్రాధాన్యం ఇచ్చి వ్యాక్సిన్‌ వేశారు. వారు తీసుకొని నెల రోజులు దాటడంతో రెండో డోసు తీసుకోవలసిన సమయం వచ్చింది. ఆ జాబితాలో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారంతా రెండో డోసు కోసం స్వర్ణభారతి స్టేడియానికి గురువారం భారీగా తరలివచ్చారు. ఎక్కువ మంది వృద్ధులే కావడంతో వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం నెమ్మదిగా సాగింది. 

మరో 844 కేసులు నమోదు

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగు తున్నాయి. సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత గురువారం అత్యధికంగా 844 కేసులు నమో దయ్యాయి. వీటితో మొత్తం సంఖ్య 71,341కు చేరు కుంది. ఇందులో 65,311 మంది కోలుకోగా, మరో 5,455 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య 575కు చేరింది. 

Updated Date - 2021-04-23T05:39:16+05:30 IST