అబ్బా.. ఇన్ని బాధలా!?

ABN , First Publish Date - 2021-11-18T05:22:55+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలను ఛిద్రం చేసింది. ఆత్మ బంధువులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

అబ్బా..  ఇన్ని బాధలా!?

కొవిడ్‌ ఎక్స్‌గ్రేషియా పేరుతో ప్రజలకు కష్టాలు

రకరకాల డాక్యుమెంట్లు, సంతకాలంటూ కొర్రీలు

జిల్లామొత్తానికి ఒకేఒక్క కౌంటర్‌

అదికూడా ఎక్కడ ఉంటుందో తెలియని పరిస్థితి

చివరకు దరఖాస్తు ఫారాలూ ఇవ్వని వైనం

లబోదిబోమంటున్న దూర ప్రాంత ప్రజలు


నెల్లూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : 

కొవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలను ఛిద్రం చేసింది. ఆత్మ బంధువులను కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి కుటుంబాలకు ఎంతోకొంత సాంత్వన కలిగించేలా రూ.50 వేల పరిహారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిహారం అందించడంలో అధికారులు పెడుతున్న ఇబ్బందులు బాధిత కుటుంబాలను మరింత కుంగదీస్తున్నాయి. కనీసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు.  వ్యయప్రయాసలు పడి నెల్లూరుకు చేరుకున్నా సవాలక్ష నిబంధనలు విధిస్తున్నారు. ఈ బాధలు భరించలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక సామాన్యులు కుమిలిపోతున్నారు. కొవిడ్‌ పరిహారం కోసం దరఖాస్తులు స్వీకరించే కౌంటర్‌ను ఒక్క నెల్లూరు నగరంలోనే ఏర్పాటు చేశారు. అది కూడా మొదట కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేయగా తర్వాత జీజీహెచకు మార్చారు. ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయలేదు. 


కొవిడ్‌ ప్రభావంతో జిల్లాలో వేల మంది ప్రాణాలు కోల్పోగా అనేక కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. ఇటువంటి సందర్భంలో చేస్తున్న ఆర్థిక పరిహారానికి అనేక రకాల నిబంధనలు విధించడం విమర్శలకు తావిస్తోంది. దరఖాస్తు చేసుకునే వారు రెండు రకాల డాక్యుమెంట్‌ సెట్లను అందజేయాల్సి ఉంది. ఒక దానిలో జిల్లా రెవెన్యూ అధికారికి (డీఆర్వో) దరఖాస్తు చేసుకునే ఫారంతోపాటు మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ జెరాక్స్‌, బ్యాంక్‌ ఖాతా కాపీ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఉంటుంది. ఈ దరఖాస్తులో ఆశా కార్యకర్త, ఆరోగ్య కార్యకర్త, మండల వైద్యాధికారితో సంతకం చేయించాలి. అలానే రెండవ సెట్‌లో సీడాక్‌ దరఖాస్తు ఫారంతోపాటు ఆధార్‌ జెరాక్స్‌, మరణ ధ్రువీకరణ ఒరిజినల్‌ పత్రం, కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్టు, డెత సమ్మరీ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ఉంటుంది. వీటన్నింటిపై గజిటెడ్‌ అధికారి సంతకం చేయించాలి. వీటిలో ఏ ఒక్క పత్రం లేకపోయినా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పత్రాలన్నీ తెచ్చుకునేందుకు బాధిత కుటుంబాలకు వెసులుబాటు కల్పించారా అంటే అదీనూ లేదు. కొన్ని పత్రాలు బాధిత కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నా పాజిటివ్‌ రిపోర్టు, డెత సమ్మరి, వైద్యాధికారుల సంతకాల కోసం మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. 


కొవిడ్‌తోనే చనిపోయారా..?


కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో అనుమానితులకు సకాలంలో పరీక్షలు చేయడం కష్టంగా మారింది. దీంతో వ్యాధిని నిర్ధారించుకునేలోపే చాలా మంది తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. మరికొంత మంది చుట్టు పక్కల వాళ్లకు తెలియకూడదన్న ఉద్దేశంతో పరీక్షలు చేయించుకోలేదు. ఇటువంటి వారిలో చాలా మంది ఇంటి వద్దనే చనిపోయారు. కొంత మంది ఆసుపత్రులకు వెళ్లాక మరణించారు. ఇటువంటి వారి విషయంలో స్థానిక ఆశా, ఏఎనఎం, వైద్యాధికారులు తమ జాబితాలో మీ పేరు లేదని చెబుతుండటంతో బాధితులు ఉసూరుమంటున్నారు. కొవిడ్‌తో చనిపోయినట్లు ఆసుపత్రిలో డెత సమ్మరీ ఇచ్చినా వీరు సంతకాలు చేసేందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఓ దశలో ప్రభుత్వం కూడా కొవిడ్‌ పరీక్ష అవసరం లేదని, లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు రావాలని సూచించింది. దీంతో చాలా మంది పరీక్షలు చేయించుకోకుండా ఆసుపత్రులకు వెళ్లడం, ఆ తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది. అలానే చాలా మందికి మెసేజ్‌ రూపంలో పాజిటివ్‌ సందేశం అందింది. ఇటువంటి వారికి ఇప్పుడు పాజిటివ్‌ రిపోర్టు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలో అధికారులే చెప్పాలి. డెత సమ్మరీలో కొవిడ్‌తో చనిపోయినట్లు నమోదు చేసినా పాజిటివ్‌ రిపోర్టు తప్పనిసరి అంటుండడంతో ఏం చేయాలో సామాన్యులకు అర్థం కావడం లేదు. ఇక మరికొంత మంది విషయంలో ఆసుపత్రుల్లో చనిపోయినప్పటికీ డెత సమ్మరీ ఇవ్వలేదు. ముఖ్యంగా జీజీహెచలో చనిపోయిన వారికి సంబంధించి డెత సమ్మరీ తీసుకోవడం కష్టంగా మారింది. ఒక్కసారిగా బాధితులంతా ఆసుపత్రికి క్యూ కడుతుండడంతో అక్కడి అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి తలెత్తింది. డెత సర్టిఫికెట్‌లో కొవిడ్‌ అని నమోదు చేయలేదు. ఇది కూడా ఓ సమస్యగా మారింది. కొవిడ్‌ సమయంలో జిల్లాలోని దాదాపు అన్నీ ప్రధాన ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఆసుపత్రుల్లో ఎవరెవరు చనిపోయారన్న వివరాలు అధికారుల వద్ద ఉన్నాయి. అయితే వాటిని సరిపోల్చుకోకుండా రకరకాల నిబంధనలు విధించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిహారాన్ని వీలైనంత ఎక్కువ మందికి తగ్గించేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలూ ఉన్నాయి.

Updated Date - 2021-11-18T05:22:55+05:30 IST