కరోనా వ్యాక్సినేషన్‌లో బాధ్యతా రాహిత్యం!

ABN , First Publish Date - 2021-04-24T03:46:15+05:30 IST

కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేస్తున్న టీకాల కోసం పేర్లు నమోదులో సిబ్బంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

కరోనా వ్యాక్సినేషన్‌లో బాధ్యతా రాహిత్యం!

పేర్లు నమోదులో తప్పులతడక

ఎక్కడ వేయించుకోవాలో స్పష్టత కరువు

ఆందోళనలో ప్రజలు

కావలి, ఏప్రిల్‌ 23: కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేస్తున్న టీకాల కోసం పేర్లు నమోదులో సిబ్బంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కావలిలో కరోనా వ్యాక్సిన్‌ ఎవరికి ఎప్పుడు వేస్తారో, ఎక్కడ వేస్తారో తెలియడంలేదు. తొలి డోస్‌ వేయించు కున్న తర్వాత రెండో డోస్‌ సకాలంలో వేయించుకునేందుకు ప్రజలు సచివాలయాల చుట్టూ పరుగులు తీస్తున్నారు. సచివాలయాల్లో టీకా వేసుకునేటప్పుడు వారి పేర్లు సక్రమంగా నమోదు చేయకపోవటంతో రెండో డోస్‌ వేయించుకున్న వారికి మొదటి డోస్‌ వేయించుకున్నటు, కొందరికి వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తి పేరు కాకుండా వారి తండ్రి వేయించుకున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయని వాపోతున్నారు. వ్యాక్సినేషన్‌ నమోదులో అనేక తప్పులు దొర్లుతుండటంతో వందలాది మంది పేర్లు తారుమారవుతున్నాయన్న ఆరోపణన్నాయి. దీంతో వాస్తవంగా వేయించుకున్న వారికన్నా అదనంగా పేర్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావలి పట్టణం జనతాపేటకు చెందిన ఒక వ్యక్తి మండలపరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ శిబిరంలో మార్చి 18న కోవిషీల్డ్‌ మొదటి డోస్‌ వేయించుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్‌ చేసి ఆధార నెంబరుతో అనుసంధానం రాలేదని, మరొక ఫ్రూప్‌ అడిగారు. దీంతో ఆయన ఫాన్‌ కార్డు ప్రూప్‌ ఇచ్చారు. రెండో డోస్‌ ఏప్రిల్‌ 15న తీసుకోమన్నారు. రెండో డోస్‌ కోసం అప్పటి నుంచి తిరుగుతుండగా ఏప్రిల్‌ 22న మున్సిపల్‌ కార్యాలయంలోని సచివాలయంలో వేస్తుండగా అక్కడకు వెళ్లి వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారు. తీరా ఇంటికి వెళ్లిన తర్వాత ఆయన ఫోన్‌కు మొదటి డోస్‌ వేయించుకున్నట్లు సమాచారం వచ్చింది. అలాగే అదే కుటుంబంలో ఒక మహిళ మార్చి 31వ తేదీన వైకుంఠపురం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఫోన్‌కు ఎప్పుడో చనిపోయిన ఆమె తండ్రి వేయించుకున్నట్లు మెసేజ్‌ వచ్చింది. ఆ విషయం అక్కడకు వెళ్లి అడగాగా మరో ఫ్రూప్‌ ఇవ్వమన్నారు. మరో ఫ్రూప్‌ ఇచ్చిన తర్వాత ఏప్రిల్‌ 8న వ్యాక్సినేషన్‌ వేయించుకున్నట్లు మెసేజ్‌ వచ్చింది.

పర్యవేక్షణ లోపం

వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా డేటా నమోదులో తప్పులు దొర్లుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ కోసం వెళ్లిన వారిని మొదటి డోసా, రెండవ డోసా అని వ్యాక్సినేషన్‌ సెంటర్‌లలో సిబ్బంది అడగటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే అక్కడ వైద్యాధికారుల పర్యవేక్షణ ఉండటంలేదు. కనీసం వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు కొంత సేపు కూర్చునే వెసులుబాటు కూడా కల్పించటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 



Updated Date - 2021-04-24T03:46:15+05:30 IST