Corona కొత్త వేరియంట్ ఎయిడ్స్ రోగుల నుంచి ఉత్పన్నమైందా?

ABN , First Publish Date - 2021-11-27T22:53:15+05:30 IST

కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్త వేరియంట్స్ భయాందోనలకు గురిచేస్తోంది. దక్షిణాప్రికాలో సూపర్ వేరియంట్‌గా పిలుస్తోన్న బి.1.1.529 వేరియంట్..

Corona కొత్త వేరియంట్ ఎయిడ్స్ రోగుల నుంచి ఉత్పన్నమైందా?

ఏబీఎన్ డెస్క్: కరోనా మరోసారి కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్త వేరియంట్స్ భయాందోనలకు గురిచేస్తోంది. దక్షిణాప్రికాలో సూపర్ వేరియంట్‌గా పిలుస్తోన్న బి.1.1.529 వేరియంట్.. వేగంగా మ్యుటేషన్స్ చెందుతుందని అక్కడి వైరాలజిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కి పైగా కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్నవారిలో చాలా మందిలో ఇదే రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. క్రమేపీ ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా ఈ వేరియంట్ హరిస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. బి.1.1.529 వేరియంట్‌ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్‌ ఎలా ఉత్పన్నమైందన్న దానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రోగిలో ఈ వేరియంట్‌ ఉత్పన్నమై ఉంటుందని లండన్‌లోని యూసీఎల్‌ జెనెటిక్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో 8.2 మిలియన్లకు పైగా హెచ్‌ఐవీ బాధితులున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్‌ రోగులున్న దేశం ఇదే. గతంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్‌ కూడా హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు ఆ మధ్య నిపుణులు తెలిపారు. దీంతో తాజా వేరియంట్‌ కూడా వారి నుంచే వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కరోనాలో ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే బి.1.1.529 చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. ఒక్క స్పైక్‌ ప్రొటీన్‌లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. డెల్టా వేరియంట్‌ కంటే కొత్త వేరియంట్‌లో మ్యుటేషన్లు చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.  మనిషి శరీరంలోకి వైరస్‌ ప్రవేశించడంలో స్పైక్‌ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుంది. అక్కడే అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వైరస్‌ డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.


కొత్త వేరియంట్‌ను అర్థం చేసుకునేందుకు చాలా వారాలు పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిగ్గుతేల్చింది. బోట్సువానా, హాంకాంగ్ దేశాలలో కూడా ఈ వేరియంట్ వ్యాపించినట్లు రోగులకున్న లక్షణాలను బట్టి తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో కూడా ఈ వేరియంట్ వ్యాపించి ఉండొచ్చని ఆ దేశ ప్రభుత్వమే అంగీకరించింది. వేగంగా వ్యాపించిన ఈ వ్యాధితో దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి రావొచ్చని ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటోంది. వారంలోనే పాజిటివిటీ రేటు 30 శాతానికి పెరిగిన నేపథ్యంలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉందని కూడా గుర్తించారు. 


దక్షిణాప్రికా, బోట్సువానా, హాంకాంగ్ దేశాలలో వెలుగు చూసిన వేరియంట్స్ పై అప్రమత్తంగా ఉండాలని భారత ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఈ దేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులను నిశితంగా పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్ పోర్ట్స్ లో కఠినమైన స్క్రీనింగ్ తో పాటు.. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను జనిటికల్ ఎనాలసిస్‌కు పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. రీసెంట్‌గా అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు సడలించడంతో.. ఈ కొత్త వేరియంట్స్ నుంచి ముంపు లేకపోలేదని లేఖలో తెలిపింది. ఇండియాలో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ దాఖలాలు లేకపోయినా.. జనం జాగ్రత్తగా ఉండటం మాత్రం తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


ప్రపంచ దేశాల్లో లాక్‌ డౌన్ భయం 

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ విజృంభణతో ఆఫ్రికా దేశాలన్నింటినీ ఇప్పుడు ఒకే గాటిన కట్టెయ్యాల్సి వస్తోంది. ఆఫ్రికా దేశాల్లో హెచ్‌ఐవీ కేసులు ఎక్కువగా ఉన్నందున ఏడు దేశాల నుంచి విమానాల రాకపై సింగపూర్ తక్షణమే నిషేధం విధించింది. నిజానికి ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే యూకే, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు.. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సహా మరో నాలుగు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్‌ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఫ్రాన్స్‌ కూడా అదే బాటలో నడిచింది. వ్యాక్సినేషన్ రూల్స్‌ని కూడా కఠినతరం చేసింది. జర్మనీ కూడా విమానాలను నియంత్రిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే జర్మన్ జాతీయులను మాత్రమే దేశంలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఆఫ్రికా దేశాలకు వెళ్లిన వారికి దేశంలోకి అనుమతి లేదని ఇటలీ ప్రకటించింది. భారత ప్రభుత్వం కూడా ప్రయాణ ఆంక్షలపై దృష్టి పెడుతోంది. 


దేశాల ఆర్థిక స్థితిగుతలపై ప్రభావం? 

దక్షిణాఫ్రికా వేరియంట్‌ వేగంగా వ్యాపించడంతో దేశాల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు డిసెంబర్‌ నుంచి 2022 మార్చి మధ్య కాలంలో కొత్త వేరియంట్ విస్తరణ ఎక్కువగా ఉంటుందన్న అనుమానాల నడుమ లాక్‌డౌన్లు ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కార్యాలయాలు, విద్యా సంస్థల మూసివేత లాంటి పరిణామాలు తప్పకపోతే లక్షల కోట్లు నష్టం రావచ్చని భావిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు కూడా తెరవలేని పరిస్థితి ఎదురుకావచ్చు. తయారీ రంగంపై కొత్త  వేరియంట్ ప్రభావం ఉండొచ్చు. భారత్‌పై ఈ వేరియంట్‌పై అప్పుడే పరోక్ష ప్రభావం కనిపించింది. స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. మరోసారి లాక్‌డౌన్లు తప్పవన్న అంచనాలతో మదుపర్లు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ దాదాపు 17 వందల పాయింట్లు నష్టపోయింది. కొత్త వేరియంట్‌తో మూడో వేవ్‌ ఖాయమన్న అంచనాల నడుమ మార్కెట్ వర్గాల్లో  భయం పెరిగింది. రెండో వేవ్‌లో ఎక్కువ మంది చనిపోవడంతో ప్రభుత్వం ముందస్తు లాక్‌డౌన్ విధిస్తుందని అనుమానిస్తున్నారు. మరో పక్క కొత్త వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాకిన్ కంపెనీలు తమ టాకీ ఉత్పత్తుల్లో మార్పులు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీకా బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-11-27T22:53:15+05:30 IST