Advertisement

ప్రముఖ వ్యాపారికి కరోనా.. అయినా అయినా స్టోర్‌ తెరిచి వికయ్రాలు

Jul 30 2020 @ 15:48PM

పలువురు హెచ్చరించినా.. చాటుమాటుగా అమ్మకాలు

పట్టించుకోని వైద్య, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది


మెదక్, ఆంధ్రజ్యోతి ప్రతినిధి: జిల్లాకేంద్రమైన మెదక్‌లో ఆయనొక ప్రముఖ వ్యాపారి. పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. నిత్యావసరాల సరుకులు భారీగా విక్రయించే స్టోర్‌కు యజమాని. సోమవారం అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోగ లక్షణాలు లేవు గానీ పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ సోకినట్లు తేలింది. ఎవరికైనా వైరస్‌ సోకితే అతడితో పాటు కుటుంబీకులను, కలిసి పని చేసిన వారిని, ఇటీవల కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌ చేస్తారు. లక్షణాలు ఉన్న వారికి అరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. సదరు వ్యక్తికి చెందిన దుకాణాన్ని కూడా మూసి వేయించి శానిటైజ్‌ చేయాలి. కానీ మెదక్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల సంబంధికులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా పట్టించుకున్నా వారే లేరు. కరోనా పాజిటివ్‌గా వచ్చిన ఆ వ్యాపారి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. ఆయన కుటుంబీకులు మాత్రం దుకాణాన్ని యథావిధిగా తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు దుకాణాన్ని తెరిచి ఉంచగా.. పలువురు హెచ్చరించడంతో మూసి వేశారు. 


అయితే బుధవారం ప్రధాన ద్వారాన్ని మూసి వేసి.. పక్కనున్న గల్లీ వైపు నుంచి సరుకులు అమ్మడం గమనార్హం. ప్రముఖ స్టోర్‌ కావడం, కరోనా పాజిటివ్‌ నమోదైన విషయం తెలియక.. మెదక్‌ పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది ఆ దుకాణంలో నుంచి సరుకులు కొని తీసుకెళ్లారు. పట్టణంలో స్వచ్ఛంద బంద్‌లో భాగంగా, ప్రధాన ద్వారాన్ని మూసి వేశారని భావించి ఎంతో మంది.. మరో వైపు ఉన్న ద్వారం గుండా స్టోర్‌లోకి వెళ్తున్నారు. కొందరిని ప్రధాన ద్వారం వద్దే ఆపి ఏఏ సరుకులు కావాలో లిస్టు రాసుకుని హోం డెలివరీ సైతం చేస్తున్నారు. సదరు వ్యాపారి కుటుంబం ఈ తరహాలో వ్యాపార కార్యాకలాపాలు నిర్వహించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అంశాన్ని దాచి స్టోర్‌ విక్రయాలు చేయడం వల్ల విషయం తెలియక దుకాణానికి వెళ్లే అమాయక ప్రజలు మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలువురు మున్సిపల్‌, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు, వారి సంబంధికులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోనూ పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉండగా.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమనే చెప్పాలి. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Follow Us on:
Advertisement
Advertisement