ఆలయ సిబ్బందికి కరోనా.. ముగ్గురు ఈవోలు, పలువురు సిబ్బందికీ వైరస్‌

ABN , First Publish Date - 2020-08-07T20:05:45+05:30 IST

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. జిల్లాలో ముగ్గురు ఆలయాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (ఈవోలు), పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా కట్టడిలో భాగంగా దాదాపు రెండు నెలలు ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేసి పూజారులు, అర్చకులు రోజువారీ

ఆలయ సిబ్బందికి కరోనా.. ముగ్గురు ఈవోలు, పలువురు సిబ్బందికీ వైరస్‌

భక్తుల్లో హైరానా

ముందస్తు జాగ్రత్తల్లో అధికారులు


కడప (సిటి): కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. జిల్లాలో ముగ్గురు ఆలయాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (ఈవోలు), పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా కట్టడిలో భాగంగా దాదాపు రెండు నెలలు ఆలయాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేసి పూజారులు, అర్చకులు రోజువారీ పూజలు, కైంకర్యాలు నిర్వహిస్తూ వచ్చారు. జిల్లాలో చిన్న పెద్ద కలిపి 2950 ఆలయాలు ఉన్నాయి. సడలింపుల్లో భాగంగా మే నెల నుంచి దర్శనాలు కొనసాగిస్తున్నారు. దేవునికడపలోని లక్ష్మీవేంకటేశ్వర ఆలయం, వేంపల్లె గండి వీరాంజనేయస్వామి ఆలయంతో పాటు నందలూరు సౌమ్యనాఽథస్వామి ఆలయం, బ్రహ్మంగారిమఠం, అల్లాడుపల్లె దేవాలయాలు, లక్కిరెడ్డిపల్లె ప్రాంతంలోని అనంతపురం గంగమ్మ ఆలయం తదితర పెద్ద ఆలయాలు సహా చిన్న ఆలయాల్లోనూ దర్శనాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో గత నెలలో ఓ ప్రధాన ఆలయ పూజారికి కరోనా సోకడంతో ఆయనను చికిత్స నిమిత్తం క్వారంటైన్‌కు పంపారు. అయితే దర్శనాలకు భక్తులు గుంపులుగా వస్తుండడంతో జిల్లాలోని కొన్ని ఆలయాల సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 


ముగ్గురు ఈవోలు.. పలువురు సిబ్బంది

అనుమానించినట్లే కరోనా ఆలయాల్లోకి ప్రవేశించింది. ముగ్గురు ఈవోలకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వెనువెంటనే ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న పలువురు సిబ్బంది, స్వీపర్లకు కూడా వైరస్‌ వ్యాపించడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జూన్‌, జూలైల్లో జాతరలు, తిరునాళ్లు పవిత్ర మాసాలు, వివాహాలు ఇతరత్రా పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. దీంతో ఎంత కట్టడి చేసినా కొన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈవోల కొరత ఉండడంతో ఒక్కో ఈవో ఐదారు ఆలయాలను నిర్వహించాల్సి వస్తోంది.


ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం: శంకర బాలాజీ, అసిస్టెంట్‌ కమిషనర్‌

ఈవోలకు, సిబ్బందికి కరోనా సోకడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీలున్నంత వరకూ ఈవో, సిబ్బంది ఇంటి నుంచే పనులు చేసేలా ఆదేశించాం. స్వీపర్లు, ఇతరత్రా సిబ్బంది రక్షణ పరికరాలు ఉపయోగించాలని ఆలయాల్లో మాస్కులు లేనిదే ప్రవేశం లేదన్న ఫ్లెక్సీలను అమర్చామన్నారు. పూజారులు, సిబ్బంది కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.

Updated Date - 2020-08-07T20:05:45+05:30 IST