ప్రతి 4 శాంపిల్స్‌లో ఒకరికి కరోనా

ABN , First Publish Date - 2021-04-22T10:21:46+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. గతంలో 70 వేల శాంపిల్స్‌ను పరీక్షించినపుడు కూడా 10 వేలలోపే కేసులు బయటపడేవి. పైగా అప్పట్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేశారు. ఈసారి కేవలం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులే చేస్తున్నారు.

ప్రతి 4 శాంపిల్స్‌లో ఒకరికి కరోనా

  • ఒక్కసారిగా పెరిగిన పాజిటివిటీ రేటు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. గతంలో 70 వేల శాంపిల్స్‌ను పరీక్షించినపుడు కూడా 10 వేలలోపే కేసులు బయటపడేవి. పైగా అప్పట్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేశారు. ఈసారి కేవలం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులే చేస్తున్నారు. రోజుకు 35 వేల మందికి మించి పరీక్షలు చేయడం లేదు. కానీ.. ఆ 35 వేల శాంపిల్స్‌లోనే 25 శాతం మందికి పాజిటివ్‌గా తేలుతుంది. మృతుల సంఖ్య గతంకంటే భారీగా ఉంటోంది.


కరోనా వైరస్‌ వ్యాప్తి ఎంత వేగంగా, ప్రమాదకరంగా ఉందో ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయని వైద్యనిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివిటీ పెరగడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం పరీక్షించిన ప్రతీ నాలుగు శాంపిల్స్‌లో ఒకరికి కరోనా ఉంటుందని తేలింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 39,619 మందికి కరోనా పరీక్షలు చేయగా 9,716 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా తొలి విడతలో ఒకానొక దశలో రోజుకి 10 వేలకుపైనే కేసులు వచ్చాయి. అప్పుడు టెస్టుల సంఖ్య 70వే లపైనే ఉండేది. కేసులు తగ్గుతున్న దశలో ఆగస్టు 31న 17.7 శాతం పాజటివిటీ రేటు నమోదైంది. కానీ సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే పాజిటివిటీ రేటు 24 శాతంగా నమోదవుతోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్‌టీపీసీఆర్‌ మినహా మిగతావి పరీక్షలు ఆపేశారు. దీంతో టెస్టుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలోలా అన్ని రకాల టెస్టులు చేస్తే పాజిటివ్‌ల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ర్యాపిట్‌ టెస్ట్‌ చేయించుకొని ఫలితం పాజిటివ్‌ రాగానే వెంటనే ఆస్పత్రిలో చేరేవారు.




ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ ఒక్కటే కాబట్టి.. ఫలితం రావడంలో ఆలస్యమవుతోంది. దీని వల్ల చికిత్స ఆలస్యమవుతోంది. దీనివల్ల కొన్ని కేసుల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పాజిటివ్‌ కేసులతోపాటు మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోవడం కలవరానికి గురిచేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో 38 మందిని కరోనా బలితీసుకుంది. కృష్ణా జిల్లాల్లోనే 10 మంది మృత్యువాతపడ్డారు. ఈ జిల్లాలో ఈనెల 20న ముగ్గురు మరణించారు. 24 గంటల్లోనే ఆ సంఖ్య 10కి పెరగాయి. నెల్లూరు జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే జిల్లాలో 14 మంది మరణించారు. సెకండ్‌ వేవ్‌లోనూ చిత్తూరు జిల్లాలో కరోనా దూసుకుపోతోంది. గత సీజన్‌లోనూ ఈ ఇల్లాల్లో అత్యధిక కేసులతోపాటు మరణాలు సంభవించాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 9,400పాజిటివ్‌ కేసులతో ఆ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితులు మరీ ఆందోళనక రంగా మారాయి. ఒక్క రోజులోనే ఇక్కడ 1,444 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్‌ కేసుల్లో చిత్తూరు (9,481) తొలిస్థానంలో నిలవగా.. శ్రీకాకుళం (7,442) రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2021-04-22T10:21:46+05:30 IST