కరోనా రహిత జిల్లాకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-03-02T05:45:10+05:30 IST

జిల్లాను కరోనా రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు.

కరోనా రహిత జిల్లాకు సహకరించాలి
వృద్ధులకు టీకా వేయడాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

అందరూ టీకా వేసుకోవాలి

మూడవ విడత ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు (వైద్యం)మార్చి 1 : జిల్లాను కరోనా రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం మూడో విడత కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని నెల్లూరులోని పడారుపల్లి, ఎన్టీఆర్‌ నగర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో ప్రారభించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వృద్ధులు టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. అలాగే మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 45 నుంచి 59 ఏళ్ల వయసు వారు కూడా ఈ టీకా వేసుకోవాలని సూచించారు. ఇందుకోసం కొవిన్‌, ఆరోగ్యసేతు యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేదంటే 1075, 1077 టోల్‌ఫ్రీ నెంబర్లను సంప్రదించాలన్నారు.  టీకా వేసే ఆరోగ్య కేంద్రాలకు నేరుగా వెళ్లి ఆధార్‌, వైద్యుల ధ్రువీకరణ పత్రాలు చూపించి కూడా టీకా వేయించుకోవచ్చన్నారు. అన్ని పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల్లో ఈ టీకాను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేస్తారని చెప్పారు. ఆదివారంతోపాటు సాధారణ సెలవు రోజుల్లో కూడా టీకా పంపిణీ కొనసాగుతుందన్నారు. మొదటి, రెండవ విడతల్లో 40వేల మంది వరకు టీకా వేసుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ సతీష్‌చంద్ర గౌడ్‌, డెమో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 


4 కరోనా కేసులు నమోదు

నెల్లూరు (వైద్యం), మార్చి 1: జిల్లాలో సోమవారం 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 64,049లకు చేరుకుంది. అలాగే కరోనా నుంచి కోలుకున్న నలుగురిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.  

Updated Date - 2021-03-02T05:45:10+05:30 IST