సమష్టి కృషితోనే కొవిడ్ నియంత్రణ!

ABN , First Publish Date - 2021-04-17T06:29:34+05:30 IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సాంకేతిక విజ్ఞానం, ప్రభుత్వ సామర్ధం రెంటినీ పూర్తిగా వినియోగించాలి. ముందుగా యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలి. టీకాల...

సమష్టి కృషితోనే కొవిడ్ నియంత్రణ!

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సాంకేతిక విజ్ఞానం, ప్రభుత్వ సామర్ధం రెంటినీ పూర్తిగా వినియోగించాలి. ముందుగా యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలి. టీకాల ఉత్పత్తిని పెంచాలి. వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులోకి తేవాలి. 18-–45 ఏళ్ల వారందరికీ కూడా టీకాలు వేయడానికి అనుమతించాలన్న సూచనల్ని పాటించాలి.


తాజాగా కోవిడ్ కేసులు దేశంలో రోజుకు లక్షా అరవై వేలకు పైగా నమోదవుతుండడంతో- మహమ్మారి రెండోదశ విజృంభణ, మొదటిదశ కంటే తీవ్రంగా ఉండవచ్చనే భయాందోళనలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలి విడతలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి, పోలీసు, శానిటేషన్ వర్కర్లకు టీకాలు వేస్తే, తరువాత 45 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకాలు వేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 10కోట్ల మందికి పైగా టీకాలు వేసినట్లు చెపుతున్నారు. మరోవైపు పలు రాష్ట్రాలు కోవిడ్ వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి.


అధిక ముప్పు పొంచి ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ మొదట 30 కోట్ల మందికి టీకాలు వేసే బృహత్ కార్యక్రమం దేశంలో జనవరి 16న ప్రారంభమైంది. కానీ ఇప్పటికీ దానిలో మూడోవంతు కూడా వ్యాక్సినేషన్ పూర్తికాని దశలో టీకాల కొరత విషయం తెరపైకి రావడం ఆందోళన కలిగించే విషయం. టీకా తయారీకి ముడిపదార్ధాల కొరత నెలకొందని, అమెరికా రక్షణ చట్టం వల్ల దిగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీరమ్ సంస్థ నెల రోజుల క్రితమే కేంద్రానికి విన్నవించింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు చేపట్టింది. అయితే కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నియంత్రణ వ్యూహాలకే కేంద్ర ప్రభుత్వం కూడా ఓటేస్తోంది. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రం టీకాల విస్తృత ఉత్పత్తికి, సత్వర వ్యాక్సినేషన్‌కి ప్రాధాన్యమిస్తూ కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. తగ్గినట్లే తగ్గుతూ కొత్త కోరలు తొడుక్కుంటున్న మహమ్మారి వైరస్ కరోనా, యావత్ మానవాళికే పెనుసవాల్ విసురుతోంది.


ఇప్పటికే రెట్టించిన బలంతో విజృంభిస్తున్న కొవిడ్‌కు కొన్ని దేశాలు గత్యంతరం లేదంటూ లాక్‌డౌన్ బాట పడుతున్నాయి. తగు జాగ్రత్తలు పాటించకపోతే మనదేశంలోనూ లాక్‌డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిరుడు విధించిన లాక్‌డౌన్ వల్లదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అసంఖ్యాక శ్రమజీవుల బ్రతుకులు తలక్రిందులయ్యాయి. జీవనాధారం కోల్పోయి పట్టణ ప్రాంతాల్లో 12 కోట్ల మంది, పల్లెల్లో 28 కోట్ల మంది కొత్తగా పేదరికంలో కూరుకుపోయారన్న విశ్లేషణలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వైరస్ ఇంకా వ్యాప్తిచెందుతుందన్న దశలో, మునుపటిలాగ దేశమంతటా లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు దాపురించకుండా ఉండాలంటే... అందరూ ఖచ్చితంగా నిర్దిష్ట జాగ్రత్తలు పాటించి తీరాల్సిందే! మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తల్ని విధిగా పాటిస్తే 70 శాతం మేర కేసుల్ని అదుపు చేయగల వీలుందని వైద్యనిపుణులు ఎప్పటినుండో సూచిస్తున్నారు. ఇదే సందర్భంలో లాక్‌డౌన్ల కన్నా విస్తృత పరీక్షలు, టీకాలు, జనచైతన్యం ద్వారానే కొవిడ్ వ్యాప్తిని నిరోధించే విధంగా ప్రభుత్వాలు, ప్రజలు సమిష్టి కృషి చేయాలి.


అయితే ప్రజలు కొన్నాళ్ళు ఈ స్వీయ క్రమశిక్షణని పాటిస్తే కరోనా వైరస్‌ని కట్టడి చేయొచ్చు. కాకపోతే ఈ లాక్‌డౌన్ పద్ధతి ఒక్కటే సరిపోదని ప్రజారోగ్య చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలు కూడా మనం గుర్తించుకోవాలి. ప్రజల సహకారంతో ఈ వైరస్‌ని మరి కొన్ని వారాల్లో నియంత్రించవచ్చుగానీ, మారుతున్న కాలంలో పుట్టుకొస్తున్న కొత్త కొత్త వైరస్‌లను, వ్యాధులను ఎదుర్కోవడం ఎలా అన్నది మనముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతెందుకు ఒకవేళ కరోనా ఇప్పుడు మరింత విజృంభిస్తే మనకి ఉన్న అరకొర సౌకర్యాలతో ఆ మహమ్మారిని ఎదుర్కోవడం అసాధ్యమని అందుబాటులో ఉన్న నిపుణులే అంటున్నారు. మహా నగరాల్లోని ఆసుపత్రుల్లో సైతం వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ అయిన గ్లౌజులు, మాస్కులు, బాడీ సూట్లు అందుబాటులో లేవని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.


ముంబైలోని ఒక ఆసుప్రతిలో ముగ్గురు డాక్టర్లు, 26 మంది వైద్యసిబ్బందికి కరోనా సోకడంతో ఆ ఆసుపత్రిని మూసివేసే నిర్ణయం తీసుకున్నారంటేనే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఇవన్నీ బలహీనమైన మన ఆరోగ్య వ్యవస్థను తెలియజేస్తున్నాయి. బలమైన వ్యవస్థలున్న చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలే కరోనా మహమ్మారికి విలవిలలాడుతుంటే, అరకొర సౌకర్యాలతో పాటు నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు కలిసిన మన సమాజంలో ఈ మహమ్మారి వ్యాప్తి చెందితే దాన్ని నిలువరించడం సాధ్యంకాని పని. మనముందున్నది పెద్ద సవాలే అయినా ఆధునిక సాంకేతికత విజ్ఞానంతో ఈ సవాలును ఎదుర్కోవడం అసాధ్యమేమీ కాదు, కాకపోతే ఇంకా చాలా కష్టపడాలి. మన దేశంలో వ్యవసాయదారులు సహా ఎక్కువమంది జీవించే చాలా గ్రామాలకు శిక్షణ పొందిన వైద్యుడు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనేమో అత్యధికులకు నాణ్యమైన చికిత్సను అందుకోలేని దుస్థితి! ఆరోగ్యరంగంపై ప్రపంచ సరాసరి వ్యయం జీడీపీలో తొమ్మిది శాతం కాగా, భారత్ కేవలం ఒక శాతానికి అటూయిటుగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. మనదేశంలో సగటున పదకొండు వేలమందికి ఒక అల్లోపతి డాక్టర్ ఉన్నాడు. ఉన్న చాలీచాలని సిబ్బందిలోనూ 57 శాతానికి ప్రామాణిక అర్హతలు కూడా లేవు.


తమ జీవితకాలంలో స్పెషలిస్ట్ వైద్యుడ్ని ఒక్కసారైనా చూడని భారతీయుల సంఖ్య 70 కోట్లని పార్లమెంటరీ స్థాయీ సంఘమే తెలిపింది. ప్రజారోగ్య సౌకర్యాలు కొరవడి, ఉత్పాదక శక్తి పడిపోవడం వల్ల భారత్ ఏటా 60 లక్షల కోట్ల రూపాయలు నష్టపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. గ్రామాల్లో 68 శాతం మంది చికిత్స కోసం కుటుంబ ఆదాయం, పొదుపు మొత్తాలపై ఆధారపడుతుండగా, 25 శాతం మంది అప్పుల్ని ఆశ్రయిస్తున్నారు. పట్టణ కుటుంబాలు 18 శాతం మేర అప్పులు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చికిత్సకు అవుతున్న ఖర్చుల కారణంగా కోట్లాది మంది పేదలుగా మారుతున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చులే దేశ పేదరికంలో ఆరో వంతుకు కారణమని ముంబయిలోని టాటా సామాజిక శాస్త్ర పరిశోధన సంస్థ తన అధ్యయనంలో నిర్ధారించింది. పేదలను గుర్తించడం ఒక సమస్యయితే, ప్రజలకు వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చులే మనదేశంలో పేదరికానికి అతి పెద్ద కారణంగా ఉన్నాయనేది ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన చేదు వాస్తవం.


అప్పటిదాకా పేదలు కానివారు, పేదరికం నుంచి బైటపడ్డవారు... కేవలం చికిత్సకు అవుతున్న ఖర్చుల భారం వల్ల పేదలుగా మారుతున్నారు, లేదా పేదరికంలోకి తిరిగి జారిపోతున్నారు. అనేకమంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణాల్లో వైద్య ఖర్చులూ ఒకటి. నివారించదగ్గ వ్యాధులతో ఏటా 12 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ మనల్ని పాలించిన పాలకులు ప్రజల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం పట్ల చూపిన నిర్లక్ష్యానికి ఈ గణాంకాలే సాక్ష్యం. దీనికి ప్రధాన కారణం ప్రజారోగ్యాన్ని తీవ్రమైన అంశంగా మన ప్రభుత్వాలు గుర్తించకపోవడమే. ఆరోగ్యశ్రీ సహా ప్రభుత్వ ఆరోగ్య పథకాల వల్ల పేద, మధ్యతరగతి వారికి ఒనగూరే మేలుకన్నా, ప్రయివేటు ఆసుపత్రులకు మిగిలే లాభాలే అధికం. జబ్బు ముదిరాక అందించే ద్వితీయ, తృతీయ అంచె సేవలు లాభదాయకం కాబట్టి ప్రయివేటు రంగం వీటిపైనే ఎక్కువ నిధులు ఖర్చు పెడుతోంది. అందువల్లే ప్రాథమికాన్ని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఆరోగ్య స్కీములు ప్రయివేటు, కార్పొరేటులకు లాభసాటి వ్యాపారంగా మారాయి.


ప్రభుత్వాలలో ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఆర్థికవృద్ధి ముఖ్యమేగానీ సర్వస్వం కాదని... కోట్లాది ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంతో పాటు వారికి ఎదిగే, హుందాగా బతికే అవకాశాలు కూడా ముఖ్యమని గుర్తించాలి. గత, ప్రస్తుత అనుభవాలను బేరీజు వేసుకుంటూ సరైన చర్చ, లోతైన అవగాహన, శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్య రంగంలో సరైన మార్పులు తీసుకురావాలి. ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతంచేసి, స్థానిక ప్రభుత్వాలకు నిధుల్ని, అధికారాలను ఇచ్చి, ప్రభుత్వ -ప్రయివేటు భాగస్వామ్యంతో ఆరోగ్య వ్యవస్థను విస్తరించి నివారించదగ్గ బాధల నుంచి కోట్లాదిమందికి పరిష్కారాల్ని అందించాలి. అదే సందర్భంలో ప్రస్తుత కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సాంకేతిక విజ్ఞానం, ప్రభుత్వ సామర్థ్యం రెంటినీ పూర్తిగా వినియోగించాలి. ముందుగా యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా టెస్టింగ్ సెంటర్లు ఏర్పాట్లు చేయాలి. టీకాల ఉత్పత్తిని పెంచాలి. వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులోకి తేవాలి. 18-–45 ఏళ్ల వారందరికీ కూడా టీకాలు వేయడానికి అనుమతించాలన్నఫిక్కీ చేసిన విలువైన సూచనల్ని పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ‘అభివృద్ధికి ప్రధాన సంకేతం మనిషి ఆరోగ్యమ’ని కరోనా చేస్తున్న హెచ్చరికతోనైనా అప్రమత్తమైనప్పుడే ‘ఆరోగ్య భారత్’ సాధ్యమని పాలకులు గ్రహించాలి. ప్రజలు కూడా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలి. వ్యక్తిగత స్థాయిలో చేతనకు వ్యవస్థాగత దిద్దుబాట్లు తోడైతేనే కొవిడ్ కోరలు తీయగలుగుతాం!


కూసంపూడి శ్రీనివాస్


Updated Date - 2021-04-17T06:29:34+05:30 IST