HYD : RTPCR దందా.. ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో ఇష్టారాజ్యంగా చార్జీలు.. పట్టించుకునే వారెవరు..!?

ABN , First Publish Date - 2021-12-08T17:22:01+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ అయినా కాస్త శాంతించిందేమో కానీ, ప్రైవేట్‌ ల్యాబ్‌ల దోపిడీ తగ్గడం లేదు. కరోనా...

HYD : RTPCR దందా.. ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో ఇష్టారాజ్యంగా చార్జీలు.. పట్టించుకునే వారెవరు..!?

  • ప్రభుత్వ ధరలను అమలు చేయని డయాగ్నోస్టిక్‌ సెంటర్లు
  • ఒకటి, రెండు మినహా అన్నింటా ఇదే పరిస్థితి
  • అధికారుల పర్యవేక్షణ కరువు

కొవిడ్‌ వైరస్‌ అయినా కాస్త శాంతించిందేమో కానీ, ప్రైవేట్‌ ల్యాబ్‌ల దోపిడీ తగ్గడం లేదు. కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం చేసే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ల ఫీజు ఒక్కో ల్యాబ్‌లో ఒక్కోలా ఉంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఎక్కడో ఒకటి, రెండు చోట్ల మాత్రమే పరీక్ష చేస్తున్నారు. మెజార్టీ నిర్వాహకులు అదనంగా దోచుకుంటున్నారు.


హైదరాబాద్‌ సిటీ  : ఒక వైపు కొవిడ్‌ కేసులు కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఒమైక్రాన్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో  కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీపీసీఆర్‌ చార్జీలను ప్రభుత్వం తగ్గించినప్పటికీ ప్రైవేట్‌ ల్యాబ్‌లు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహస్తున్నాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు ల్యాబ్‌లో అయితే రూ.500, ఇంటి వద్ద అయితే రూ. 750 చార్జీ చేయాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి, రెండు ల్యాబ్‌ల్లో మినహా మెజార్టీ ల్యాబ్‌ల్లో అంత కంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు.


ఎవరిష్టం.. వారిది

ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులనే ఎక్కువగా చేస్తున్నారు. ఆ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిన వారిలో కొందరికి మాత్రమే ఆర్టీపీసీఆర్‌  చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ల్యాబ్‌ల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో నిర్వాహకులు ఎవరికి ఇష్టమొచ్చిన ధరను వారు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణీత రుసుమును పక్కన పెట్టేస్తున్నారు.


పట్టించుకునే వారు లేక..

ప్రైవేట్‌ ల్యాబ్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల అమలుపై పర్యవేక్షణ లేదు. దీంతో ల్యాబ్‌లు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ప్రతీ ల్యాబ్‌లో ఏ రకం పరీక్షకు ఎంత చార్జీ చేస్తారో సూచికలు ఏర్పాటు చేయాలి. కానీ మెజార్టీ ల్యాబ్‌ల్లోని బోర్డుల్లో ఆర్టీపీసీఆర్‌ ధరలు ఉండడం లేదు.


ఇదీ పరిస్థితి..

‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది పలు ప్రైవేట్‌ ల్యాబ్‌లో చార్జీలపై ఆరా తీయగా ఎక్కువ శాతం అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తేలింది. లంగర్‌హౌజ్‌లోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో రూ. 1000, మరో ల్యాబ్‌లో రూ. 1200 వసూలు చేస్తున్నారు. మెహిదీపట్నంలో రూ.800, మోతీదర్వాజ్‌, గోల్కొండ పరిధిలో రూ.1200 చార్జీ చేస్తున్నారు. ఓ పెద్ద ల్యాబ్‌లో రూ.500 చార్జీ వసూలు చేస్తుండగా, ఇంటికి వెళ్లి నమునాలు సేకరిస్తే 1,070 తీసుకుంటున్నారు. 


సికింద్రాబాద్‌లోని సరోజినీ దేవి రోడ్డు పరిధిలోని ఓ కేంద్రంలో రూ.1200, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ బుద్వేల్‌లో రూ.800, నల్లకుంటలో రూ.1200, సంతోష్‌నగర్‌ పరిధిలో రూ.800, 1000 వరకు చార్జీ చేస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ పరిధిలోని ఓ సినిమా థియేటర్‌ వద్ద ఉన్న ల్యాబ్‌లో రూ.750 చార్జీ చేస్తున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ పరిధిలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో రూ.850, జీడీమెట్ల పరిధిలో రూ. వెయ్యి, సుచిత్రా, కుత్బుల్లాపూర్‌, చందానగర్‌, హిమాయత్‌నగర్‌, హయత్‌నగర్‌.. ఇలా దాదాపు అన్ని కేంద్రాలలో అధిక చార్జీలే వసూలు చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని ఓ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన మేరకే వసూలు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T17:22:01+05:30 IST