కరోనా సన్నివేశాలు

ABN , First Publish Date - 2020-08-28T06:16:26+05:30 IST

కరోనా వేడి క్రమంగా ఆరోగ్యం నుంచి ఆర్థికం వైపు, రాజకీయం వైపు ప్రవహిస్తోంది. వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, సోకితే చేయవలసిన చికిత్సలు, వ్యాప్తిని నిరోధించడానికి...

కరోనా సన్నివేశాలు

కరోనా వేడి క్రమంగా ఆరోగ్యం నుంచి ఆర్థికం వైపు, రాజకీయం వైపు ప్రవహిస్తోంది. వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, సోకితే చేయవలసిన చికిత్సలు, వ్యాప్తిని నిరోధించడానికి చేయవలసిన కట్టడులు, వాటి వల్ల కష్టనష్టాలు- వీటి గురించిన చర్చే ఇంతకాలం ప్రధానంగా ఉండింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ కొవిడ్-–19 సృష్టిస్తున్న ఆర్థిక పతనం, ఉపాధి నష్టం వీటి గురించి తెలియదనీ కాదు, మాట్లాడుకోలేదనీ కాదు. కానీ, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయడమే ప్రాధాన్యంగా ఉన్నప్పుడు, కొంత కష్టనష్టాలకు సమాజాలూ వ్యవస్థలూ సిద్ధపడతాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడి అవుతాయి. పెద్ద ఉపద్రవం కదా, ఓపిక పడదాం అనుకున్న వారిలో క్రమంగా అసహనం పెరుగుతుంది. కరోనాను ఎదుర్కొనే పేరుతో, ఏర్పడిన ఒక సమష్టి క్రమంగా విచ్ఛిన్నమవుతుంది. ఉమ్మడి ఆపదలోనూ స్వార్థాన్ని, పక్షపాతాన్ని వదులుకోకుండా, రాజకీయం చేసేవారిని ప్రశ్నించడం మొదలవుతుంది. ఫలితంగా, కరోనా పరిస్థితి ద్వారా ప్రేరితమయ్యే కొత్త రాజకీయ సన్నివేశం నెమ్మదిగా ఆవిష్కృతమవుతుంది.

 

మొదట లాక్‌డౌన్‌ విధించిన తీరు, అందువల్ల ఉత్పన్నమయిన వలసకార్మికుల సమస్య- మొదటి దశలో కరోనా సన్నివేశంగా ఉండింది. అప్పటికింకా వ్యాధి వ్యాప్తి ప్రమాదకరస్థాయిలో లేదు. అకస్మాత్తుగా సకల ఆర్థిక కార్యరంగాలూ మూతపడడం వల్ల చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు, రోజు కూలీలు- అందరూ ఇబ్బంది పడ్డారు. రెండు నెలలు ఉచిత రేషన్, కంటితుడుపు నగదు వారు బొటాబొటిగా బతకడానికి పనికివచ్చి ఉండవచ్చు. తరువాత క్రమంగా లాక్‌డౌన్‌ సడలించడం మొదలుపెట్టారు. సడలించినప్పటికీ, అనేక జీవనరంగాలు యథాపూర్వ స్థితికి చేరుకోలేదు. కోట్లాది మంది ఆదాయాలు సగానికి సగం పడిపోయాయి. మధ్యతరగతి జీవులు తమ అప్పులను, ఆశలను వాయిదా వేసుకుంటున్నారు. ఆరుమాసాల పూర్తి, పాక్షిక కట్టడి తరువాత క్రమంగా ఓపిక నశిస్తున్నది. ఎక్కడి నుంచి కూడా ఎవరికీ ఏ సహాయమూ అందడం లేదు. ఇప్పుడు రుణాల చెల్లింపు వాయిదాల మీద ఉన్న మారటోరియం ముగిసిపోతే, పరిస్థితి మరింత విషమం అవుతుంది.


చెల్లింపులు వాయిదా వేశారు సరే, వాయిదా వేసిన కాలానికి కూడా వడ్డీ వసూలు చేస్తారా? లాక్‌డౌన్‌ విధించింది కేంద్రప్రభుత్వం. అది ఆర్‌బిఐతో కలసి పని చేయగలదు. అత్యంత శక్తిమంతమైన విపత్తుల చట్టం, సాంక్రమిక వ్యాధుల చట్టం చేతిలో ఉన్నది. వడ్డీ వసూలు వద్దు అని బ్యాంకులను ఆదేశంచలేరా?- అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. మారటోరియం పొడిగింపు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. అది కూడా వడ్డీ లేకుండా! కార్పొరేట్ సంస్థలు, వ్యాపారులు నష్టపోతే, రకరకాలుగా ఆదుకుంటుందే ప్రభుత్వం, అదే సూత్రం ప్రజలకు వర్తించదా? 


కరోనా వల్ల ఏర్పడిన కొత్త పరిస్థితిలో తాను ఏ సాయమూ చేయకుండా భారమంతా రాష్ట్రాలపైకే తోసేసిన కేంద్రం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం విషయమై బోనులో నిలబడింది. చట్టంలో చెప్పినట్టు పరిహారపు సెస్ వసూలు చేస్తున్నప్పుడు, తగినంత ఆదాయం రాకపోతే పరిహారం చెల్లించాలి కదా? ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఈ విషయంలో బయటకు మాట్లాడి ఉండవచ్చు, ఇతర రాష్ట్రాలలో కూడా పరిస్థితి అదే. రుణసేకరణకు నిబంధనలు సడలించమంటే ఆనాడు కేంద్రం గీసిగీసి బేరమాడింది. ఆ వెసులుబాటుకు మరేవో షరతులు పెట్టింది. ఇప్పుడు జిఎస్‌టి పరిహారం విషయంలో రుణసేకరణకు నిబంధనలు సడలిస్తానని చెబు తున్నది. అన్ని రాష్ట్రాలకీ కలిపి ఓ లక్షకోట్ల రూపాయలను ఇస్తానని అంటున్నది. రెండు మూడు రకాల అవకాశాలను కేంద్రం ప్రతిపాదించింది కానీ, అందులో రాష్ట్రాల కష్టాలను పెద్దగా తీర్చేవేవీ లేవు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఇదొక దీర్ఘకాలిక ఉద్రిక్తతలకు కారణం కావచ్చు. 


పరిస్థితి గురించిన అంచనాలలో కేంద్రం -రాష్ట్రాల మధ్య అగాధం ఏర్పడుతున్నది. నీట్, జెఇఇ పరీక్షల నిర్వహణ విషయమై అనేక రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి భిన్నంగా ఉన్నది. తమ శాసనసభ్యులలో 23 మందికి కరోనా సోకిందని, ఇక క్షేత్రస్థాయిలో మరింత తీవ్రపరిస్థితులున్నాయని, పరీక్షల నిర్వహణ ఎట్లా సమంజసమని పంజాబ్ ముఖ్యమంత్రి ఆవేదన చెందితే, స్కూళ్లు తెరచిన వెంటనే అమెరికాలో 97వేల మంది పిల్లలకు కరోనా సోకిందని, మన దగ్గర అటువంటి పరిస్థితి ఏర్పడితే పర్యవసానాలు ఊహించలేమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. పరీక్షల తేదీ వాయిదా కోసమై సుప్రీంకోర్టును తిరిగి ఆశ్రయించాలని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, అంతర్రాష్ట్ర ప్రయాణాలను, రవాణాను అనుమతించకపోతే తీవ్రచర్యలుంటాయని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ప్రమాదకరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకోవలసిన అంశాన్ని, ఆర్థిక అవసరాల పేరిట, కేంద్రం తన చేతిలోకి తీసుకోవడం, పైగా విపత్తుల చట్టాన్ని ఝళిపించడం కలవరం కలిగిస్తున్నది. 


రెండు లక్షల కోట్ల దాకా ఖర్చు పెడతామని ఏదో ప్యాకేజి ప్రటించినా, ప్రజలకు, రాష్ట్రాలకు అది అనుభవంలోకి రాలేదు. కరోనా కట్టడుల వల్ల ఇబ్బందుల పాలైన వారికి నేరుగా సహాయం అందించే ప్రయత్నాలు చేయకపోతే, ప్రజల ఓపిక నశించిపోతుంది. సరిహద్దు ఘర్షణలు, చైనాతో ఉద్రిక్తతలు మళ్లీ పొడసూపినా సరే, ప్రభుత్వంపై ప్రజల వైఖరి ప్రభావితం కాబోదు. ఉద్వేగాలతో చల్లారే ఉపద్రవం కాదిది.

Updated Date - 2020-08-28T06:16:26+05:30 IST