కరోనా సెకండ్ వేవ్ : పరిస్థితులు మారాయ్.. ప్రతి ఇంట్లో ఇది తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-04-22T18:34:49+05:30 IST

కొవిడ్‌ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులన్నీ తలుపులు మూసేసుకున్న తరుణంలో...

కరోనా సెకండ్ వేవ్ : పరిస్థితులు మారాయ్.. ప్రతి ఇంట్లో ఇది తప్పనిసరి!

  • ప్రతి ఇంట్లో ఆక్సీమీటరుండాలి
  • డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి 

హైదరాబాద్‌ సిటీ : శ్వాసకోశ సమస్యలున్న వాళ్లు, రోగ నిరోధక శక్తి తక్కువున్న వ్యక్తుల్లో కొవిడ్‌ మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోందని డాక్టరు రవి శంకర్‌ చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంట్లో ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంకా ఆయన ఏం చెబుతున్నారంటే.. 


కొవిడ్‌ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులన్నీ తలుపులు మూసేసుకున్న తరుణంలో ఒక్క కోఠి, ఈఎన్టీ ఆస్పత్రి మాత్రమే రోగులకు నిరంతర సేవలను అందించింది. అంతేకాదు, ప్రమాదకర పరిస్థితిలోనూ చెవి, ముక్కు, గొంతు సమస్యలతో వచ్చిన రోగులకు శస్త్రచికిత్సలనూ చేస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో తొలినుంచి ప్రభుత్వ వైద్యులు ప్రాణాలను లెక్కచేయకుండా, దేశ సంరక్షణ కోసం పోరాడే సైనికుల వలే రాత్రింబవళ్లు రోగుల సేవలో తరిస్తున్నారు. మా ఆస్పత్రిలో ఎంతో మంది వైద్యులు, సిబ్బంది కొవిడ్‌కు గురయ్యారు. కొందరు మృత్యుముఖం వరకూ వెళ్లొచ్చారు. అయినా, వెనకడుగువేయకుండా విధుల్లో చేరి, తమ వృత్తి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. రోజుకి సుమారు 600 నుంచి 800 మంది రోగులను చూస్తుంటాం. అందులో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులూ ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులకు హాజరవుతున్నాం. రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రోగులను పరీక్షిస్తున్నాం. 


రెండో దశలో పరిస్థితులు మారాయి

గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ వంటి సమస్యలతో ఎక్కువ మంది మా వద్దకు వస్తున్నారు. అలాంటి వారందరినీ ముందుగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తున్నాం. కరోనా తొలిదశ వ్యాప్తిలో పొడిదగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలుంటేనే అనుమానించేవాళ్లం. కేవలం ముక్కు కారడం అనే సమస్యను కొవిడ్‌ లక్షణంగా అనుకోలేమని నిపుణులు అన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైరస్‌ మ్యుటేషన్‌లో వచ్చిన మార్పుల కారణంగా, ముక్కుకారడం కూడా ఒక లక్షణంగా భావిస్తున్నాం. గొంతు, నోరు సమస్యతో వచ్చే ప్రతి కేసునూ కొవిడ్‌ కేసుగా అనుమానించాల్సిందే. దీర్ఘకాలిక వాధ్యులతో బాధపడుతున్న వారికి, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లకు, శ్వాసకోశ సమస్యలున్న వారిలో వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొవిడ్‌ ప్రధానంగా ఊపిరితిత్తులమీద ప్రభావం చూపుతుంది కనుక, శ్వాస కోశ సమస్యలున్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి కప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటుండాలి. నోట్లో, ముక్కులో, కంట్లో చేతులు పెట్టుకోవడం వంటివి చేయవద్దు. అలర్జీ కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఆక్సీమీటరులో పల్స్‌ పరీక్షించుకుంటుండాలి. పల్స్‌రేట్‌ 94కి తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


అత్యవసర సర్జరీలు...

కరోనా సమయంలోనూ కొన్ని అత్యవసర సర్జరీలు నిర్వహిస్తున్నాం. అప్పటికప్పుడు వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో కొవిడ్‌ పాజిటివా, నెగెటివా అని చూసేంత సమయం ఉండదు. మా ప్రాణాలకన్నా, అప్పుడు రోగి ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఆపరేషన్‌కు వెళ్తాం. కొద్దిరోజుల కిందట ముక్కునుంచి రక్తస్రావం అవుతున్న ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకు అప్పటికప్పుడు ఆపరేషన్‌ చేయకుంటే ప్రమాదం. కొవిడ్‌ పరీక్ష చేయించేంత సమయం లేదు. దాంతో చాలా జాగ్రత్తలు తీసుకొని, సర్జరీ చేశాం. తర్వాత పరీక్షలో అతను పాజిటివ్‌గా తేలింది. మేమివ్వాల్సిన ట్రీట్మెంట్‌ ఇచ్చాక, గాంధీకి పంపాం. అతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఏడాదిలో ఇలాంటి కేసులు చాలానే. ఎంతో మంది వైద్యులు, వాళ్ల కుటుంబ సభ్యులు కొవిడ్‌కు లోనయ్యారు. కొందరు చనిపోయారు కూడా. అయినా, ప్రాణాలు గుప్పెట పట్టి వైద్యసేవలు అందిస్తున్నారు. కనుక వైద్యులే ప్రత్యక్ష దేవుళ్లు అనడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటుందా. 


మాస్కుతో గాలాడటం లేదా..

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలి. కొందరు మాస్కు పెట్టుకుంటే, ఊపిరి ఆడటం లేదని వాపోతుంటారు. అది కేవలం వాళ్ల సైకలాజికల్‌ ఫీలింగ్‌ మాత్రమే. అలాంటప్పుడు వాళ్లలో వాళ్లు ‘మాస్కు వల్ల నాకేమీ కాదు’ అనుకొని, సమస్యను అధిగమించాలి. మాస్కుపెట్టుకోవడం వల్ల గాలి అందకపోవడం వంటి సమస్యేమీ ఉండదు. ఇతరులకు, మనకు మాస్కు రక్షణగా నిలుస్తుంది.


లక్షణాలు మారాయి...

ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్‌ మ్యుటేషన్‌లోని మార్పులు చాలావేగంగా సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా లక్షణాలూ మారాయి. జీర్ణకోశ సమస్యలు, కళ్లకలక వంటి లక్షణాలు కనిపించినా కొవిడ్‌గా అనుమానించాల్సిందే. సామాజిక వ్యాప్తి తీవ్రత పెరిగింది. కరోనాని ఢీకొట్టాలంటే, మనముందున్న తక్షణ మార్గం మనలోని ఇమ్యూనిటీ పవర్‌ (రోగనిరోధక శక్తి)ని పెంచుకోవడమే. అందుకు బలవర్ధకమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్‌ సీ,డీ,బీ, జింక్‌, మ్యాగ్నీషియమ్‌ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవాలి.


వాటికి శాస్త్రీయత లేదు...

శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, కర్పూరం వాసన చూడటం వంటి చిట్కాలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అలాంటివేవీ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కనుక వాటిమీద ఆధారపడవద్దు. కొన్ని సార్లు అలాంటి చిట్కాలు వికటించే ప్రమాదమూ లేకపోలేదు. కనుక వీలైనంత వరకూ సొంత వైద్యానికి దూరంగా ఉండండి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు, రెమెడీస్‌ను విశ్వసించకపోవడం ఉత్తమం. అస్తమాను కొవిడ్‌ వార్తలు చూస్తూ, భయాందోళనలకు లోనవ్వడం వల్లకూడా మనలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కనుక మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే అంశాలకు దూరంగా ఉండండి.

Updated Date - 2021-04-22T18:34:49+05:30 IST